Janasena : ఏపీలో జనసేన ఊపు మొదలైంది. మార్చి 14న ఏపీలో నిర్వహించే జనసేన ఆవిర్భావ సభ కోసం ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పవన్ కళ్యాణ్.. దీని నిర్వహణ బాధ్యతల కోసం సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో కమిటీలు వేశారు. ఈ సభను భారీగా నిర్వహించుకునేందుకు ఇప్పటికే చాలా మంది నేతలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
అమరావతిలోని మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామంలో ఈ నెల 14న నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ కోసం 12 కమిటీల నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీల్లో మరికొందరిని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహించారు.
తాజాగా జనసేన ఆవిర్భావ వేడుక వేళ పెద్దఎత్తున నేతలు చేరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వైసీపీకి చెందిన నాయకులు చోడిపిండి సుబ్రహ్మణ్యం, గొలిశెట్టి సూర్యచంద్రరావు, ఆరేటి బులి వెంకట్రామయ్య, కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పన ప్రసాద్, బైపీ పుల్లారావు, ఏపీ టైలర్స్ వర్కర్స్ స్టేట్ అసోసియేషన్ సెక్రటరీ చెప్పుల మధుబాబుతో పాటు మరికొందరు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
జిల్లా ఇంఛార్జి శ్రీ కొటికలపూడి గోవిందరావు, పోలవరం ఇంఛార్జి చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో వీరంతా జనసేన కండువా కప్పుకున్నారు. వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మనోహర్ గారు అంతా కలసికట్టుగా పార్టీ బలోపేతానికి, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేయాలని సూచించారు.
ప్రతిపక్ష జనసేన పార్టీలోకి అధికార వైసీపీ నుంచి కూడా చేరికలు ఉండడం విశేషం.ఇది వైసీపీపై అసంతృప్తికి కారణమవుతోంది.