కరోనా మహమ్మారి ప్రపంచ గతిని , స్థితిని సమూలంగా కదిలించింది. లక్షలమంది చనిపోవటంతో పాటు భవిష్యత్తు అందకారంగా మారింది. రాజకీయంగా ఎన్నో మార్పులకు గురవుతుంది. ఆర్ధికంగా ప్రపంచదేశాలు కోలుకోవటానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియని పరిస్థితి. ఈ లోపల ప్రజల బతుకులు ఎలా ఉంటాయో ఎవరికీ అర్ధంకాని పరిస్థితి. ఇది పెను సంక్షోభం. ఈ మహమ్మారికి మందెట్లా లేదో ఈ పెను సంక్షోభం నుంచి కూడా అంతతేలికగా బయటపడే మార్గం కూడాలేదు. దీనిపై కాలమే నిర్ణయించాలి. అయితే కొన్ని విషయాల్లో డీలా పడేదానికన్నా ధైర్యంగా ఎదుర్కోవటమే పరిష్కారం. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇటీవల మన ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రపంచ సమస్యలను సమర్ధంగా ఎదుర్కోవటానికి కొత్త ప్రపంచ వ్యవస్థ రావాల్సి వుంది. అది మానవ విలువులపై ఆధారపడి నిర్మించబడాలి అన్నాడు. ఈ వ్యాఖ్యానం లో ఎంతో అర్ధం దాగివుంది. ఇప్పుడున్న ప్రపంచ వ్యవస్థ ‘ ఐక్యరాజ్య సమితి ‘ విఫలమయ్యిందని చెప్పకనే చెప్పాడు. ఇందులో ఆశ్చర్యమేమీలేదు. గత దశాబ్దంలో ఎంతోమంది దేశాధినేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. చివరకు శాశ్వత సభ్యదేశాధి నేతలు పుతిన్ దగ్గర్నుంచి డోనాల్డ్ ట్రంప్ వరకు ప్రతిఒక్కరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇందుకు కారణం ఐరాస తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చటంలో పూర్తిగా విఫల మయ్యిందనేది ఎక్కువమంది అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం. మన దేశ అనుభవం రీత్యాకూడా ఈ అభిప్రాయమే సరైనదని అనిపిస్తుంది.
ఐక్యరాజ్యసమితి పుట్టు పూర్వోత్తరాలు, తదనంతర పరిణామాలు
రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఏర్పడిన ఈ సంస్థ మొదటి ప్రపంచ యుద్ధ నేపధ్యం లో ఏర్పడిన నానా జాతి సమితి నుంచి గుణ పాఠాలు నేర్వలేదు. గెలిచినవాళ్ళు ప్రపంచాన్ని పంచుకోవటానికి అసమతుల్యంగా ఏర్పడిన సంస్థగానే రూపుదిద్దుకుంది.అయితే ఈసారి ప్రాశ్చాత్య కూటమి , కమ్యూనిస్టు కూటమి కలిసి అధికారం పంచుకుంది. ఈరెండు కూటములు కలిసి అయిదు దేశాలతో ( అందులో చైనా కూడా అప్పటికి ప్రాశ్చాత్య కూటమి లో భాగమే ) వీటో పేరుతో ప్రపంచ రాజకీయాల్ని శాసించటం మొదలుపెట్టాయి. అయితే ఆ తర్వాత దశాబ్దాల్లో పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. ఇప్పుడు ప్రత్యర్ధి రెండు కూటములు లేవు. ప్రచ్చన్న యుద్ధం నుంచి, ఏక శక్తి కేంద్రానికి, ఇప్పుడు అనేక శక్తి కేంద్రాలుగా మారటం జరిగింది. అప్పటి అయిదు దేశాలు అన్నీఇప్పుడు అత్యంత ప్రభావిత దేశాలు కావు. ఆ అయిదు శాశ్వత సభ్యదేశాలు ఈ రోజు వీటో అధికారం తో ప్రపంచ రాజకీయాల్ని శాసించటం మిగతా దేశాలకు నచ్చటం లేదు. భద్రతా సమితి లోని అయిదు శాశ్వత సభ్య దేశాల్లో మూడు దేశాలు ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. అదేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.
జనాభా పరంగా చూస్తే, అత్యధిక జనాభా కలిగిన 5 దేశాల్లో కేవలం 2 మాత్రమే ఇందులో వున్నాయి. ఆర్ధికపరంగా చూస్తే, మొదటి 5 దేశాల్లో కేవలం 2 మాత్రమే ఇందులో వున్నాయి ఖండాల పరంగా చూస్తే , కేవలం 10 శాతం జనాభా తో యూరప్ అయిదు శాశ్వత సభ్య దేశాల్లో మూడు స్థానాలు సంపాదించింది. అదే 60 శాతం జనాభా వున్న ఆసియా ఖండానికి ఒకే స్థానముంది. ఆఫ్రికా , దక్షిణ అమెరికాలకి అసలు చోటు లేదు.
మతపరంగా చూస్తే , మొత్తం అయిదు స్థానాల్లో నాలుగు ఒకే మతం మెజారిటీగా వున్న దేశాలే చోటు సంపాదించాయి. రెండో, మూడో అతి పెద్ద మతాలైన ఇస్లాం, హిందూ మతస్తులకు చెందిన దేశాలకు స్థానం లేదు. భాషాపరంగా చూస్తే , అత్యధికంగా మాట్లాడే అయిదు భాషాల్లో నాలుగు స్థానం సంపాదించాయి. మూడో అతిపెద్ద భాషయిన హిందుస్తానీ కి చోటు దక్కలేదు. ఆ విధంగా కూడా భారత్ కి అన్యాయం జరిగింది. నిధుల పరంగా చూస్తే , ఐక్యరాజ్యసమితి కి నిదులిచ్చే మొదటి అయిదు దేశాల్లో మూడింటికే చోటు చిక్కింది. రెండు, నాలుగు స్థానాల్లో వున్న జపాన్, జర్మనీ లకు స్థానం లేదు.డబ్బులు ఒకరివి షోకు ఇంకొకరిది గా వుంది. ఏ ఏ విధంగా చూసినా ఈ వీటో అధికారం అసంబద్ధంగా వుంది.
ఇక ఐక్యరాజ్యసమితి పనిచేసే కార్యాలయాలు, కేంద్రాలు చూసినా ఇది కేవలం యూరప్ కేంద్రంగా పనిచేసే సంస్థగా వుంది.అదేమిటో చూడండి.ప్రధాన అంగాలైన జనరల్ అసెంబ్లీ , భద్రతా సమితి, ఇంకా రెండు సంస్థలు న్యూయార్క్ నగరం లోనే వున్నాయి. మరో సంస్థ అంతర్జాతీయ న్యాయ స్థానం యూరప్ లోని హేగ్ నగరం లో వుంది.
అలాగే ఐక్యరాజ్యసమితికి సంబంధించిన మిగతా ప్రధాన కార్యాలయాలు జెనీవా,వియన్నా,నైరోబీలో వున్నాయి. మొదటి రెండు యూరప్ లో, మూడోది ఆఫ్రికాలో వుంది. వీటిల్లో న్యూయార్క్,జెనీవాలలో దాదాపు ఒక్కో దాంట్లో పదివేలమందికి పైగా పనిచేస్తుంటారు. మిగతా వాటిల్లో కూడా గణనీయమైన సంఖ్యలో సిబ్బంది పనిచేస్తున్నారు. ఆ స్థాయిలో వున్న ఒక్క కార్యాలయం కూడా ఆసియా ఖండపు దేశాల్లో లేదు.
ఐక్యరాజ్యసమితి కి వున్న 17 ప్రత్యేక సంస్థలూ (యునెస్కో , ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటి ) తమ ప్రధాన కార్యాలయాలను మూడు తప్ప అన్నింటినీ యూరప్ లోని దేశాల్లోనే నెలకొల్పాయి. మిగతా మూడింటిలో రెండు అమెరికా, ఒకటి కెనడాలో వున్నాయి.ఐక్యరాజ్యసమితి ఉప అంగమైన మానవ హక్కుల సమితి ని 2006 లో స్థాపించారు. అదీ యూరప్ లోనే పెట్టారు.
ఇవన్నీ 1945 లో స్థాపించిన వేవీ కాదు. ఆ తరవాత ఎన్నో సంస్థలు స్థాపించారు. ఇవి వికేంద్రీకరించకుండా యూరప్ లోనే పెట్టటం లో అంతర్యమేమిటి ?
అన్ని దేశాల్లోకి ఎక్కువగా దాదాపు 22 శాతం నిధుల్ని అమెరికానే ఖర్చుచేస్తుంది. అయినా ఐరాస వ్యవహారంపై పూర్తి అసంతృప్తిగా వుంది. యునెస్కో నుంచి ఎప్పుడో వైదొలగింది. దానికి నిధులు ఇవ్వటం మానేసింది. మానవ హక్కుల సమితి నుంచి కూడా ఇటీవల వైదొలగింది. వాస్తవానికి మానవహక్కుల సమితి మనకు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతుంది. అది పూర్తిగా పశ్చిమ ఆసియా , ఆఫ్రికా దేశాల సంస్థగా మారిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చైనా 10 లక్షల ముస్లింలను నిర్బంధంలో ఉంచితే దానిపై నోరువిప్పదు. అదే భారత అంతరంగిక విషయాలపై లేనిపోని ఆరోపణలు చేస్తుంది.
ఐరాస లో భాగంకాకుండా ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రపంచ వ్యాపార సంస్థ( WTO) 164 దేశాలతో 98 శాతం ప్రపంచ వ్యాపారాన్ని నియంత్రిస్తుంది. ఇది ఐరాసలో భాగం కాదు. అలాగే జి 7 , జి 20, ఒఇ సి డి , బ్రిక్స్ , ఎఫ్ఎటిఎఫ్ లాంటి ఉగ్రవాద వ్యతిరేక, అక్రమ నగదు చలామణి వ్యతిరేక సంస్థ , అలాగే పారిస్ వాతావరణ ఒప్పందం, అంతర్జాతీయ సోలార్ కూటమి లాంటి అనేక సంస్థలు, ఒప్పందాలు ఐరాస బయటనే వున్నాయి. వాటి భవిష్యత్తు ఐరాసతో ముడిపడి లేదు.
ఐరాస వైఫల్యాలు
ఐరాస పటిష్టమైన ప్రపంచ సంస్థ కాదని మొదట్నుంచి విమర్శలున్నాయి. యోగ్యతలపై కాకుండా కొన్ని దేశాల కనుసన్నలలో పనిచేస్తుందనే ఆరోపణలు రోజు రోజుకీ ఎక్కువవుతున్నాయి. ఉదాహరణకు మన కాశ్మీర్ సమస్యనే తీసుకుందాం. భారత్ తమ భూభాగంపై కొంతమంది ఆదివాసులు, పఠాన్లు దాడిచేసి ఆక్రమించుకున్నారని దానికి పొరుగుదేశం పాకిస్తాన్ మద్దత్తు వుందని ఐరాస కి కంప్లయింట్ చేస్తే ఆ భూభాగాన్ని మనకు తిరిగి ఇప్పించాల్సింది పోయి దురాక్రమణ దారున్ని, మనని కలిపి వివాదస్తులు గా మార్చి భారత్ కి అన్యాయం చేయటం తెలిసిందే. దానికి కారణం అప్పుడు ఐరాస బ్రిటీష్, అమెరికా కనుసన్నలలో పనిచేయటమే. అదే ఈ రోజు చైనాలోని జిన్జియాంగ్ ముస్లింల నిర్బంధం వ్యవహారం లో మిన్నకుండటం, దక్షిణ చైనాలో చైనా మిలిటరీ స్థావరాలు నిర్మించినా దానికి వ్యతిరేకంగా సమితి ఆమోదించిన తీర్మానాన్నే అమలుచేయలేకపోవటం చైనా ప్రభావం లో ఉండటమే.
అలాగే ఉగ్రవాద మూకల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ని కట్టడి చేయలేకపోవటం, సిరియా, యెమెన్ సంక్షోభంలో ప్రేక్షకపాత్ర వహించటం, ఇరాక్ పై అమెరికా దాడి చేసి సద్దాం హుసేన్ ప్రభుత్వాన్ని కూల్చటానికి చూపించిన కారణాలు అబద్ధమని తేలినా అమెరికా పై పల్లెత్తుమాట అనకపోవటం లాంటి అనేక సమస్యల్లో ఐరాస విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే పలుదేశాధి నేతలు కొత్త ప్రపంచ వ్యవస్థ రావాలని కోరుకుంటున్నారు. విశేషమేమంటే అమెరికా కూడా ఐరాస పై గుర్రుగా వుంది. అదివరకటిలాగా తనమాట చెల్లకపోవటంతో అమెరికా కూడా ఈ వరసలో కొత్త ప్రపంచ వ్యవస్థ రావాలని కోరుకుంటుంది.
భారత్ ప్రయోజనాలకి వ్యతిరేకంగా చైనా
1949 లో ప్రజా చైనా ఏర్పడినప్పటినుంచీ భారత్ చైనా అనుకూల వైఖరి తీసుకుంది. ఐరాస లో తైవాన్ స్థానంలో ప్రజా చైనా కు శాశ్వత సభ్యత్వం కావాలని కోరింది. అయినా చైనా ఎప్పుడూ మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కి మద్దతిస్తూనే వచ్చింది. 1971 లో ఐరాస లో చేరిన దగ్గర్నుంచి కూడా ఇదేతంతు కొనసాగుతుంది. ఐరాస లో సంస్థాగత మార్పులకు ససేమిరా ఒప్పుకోవటంలేదు. రెండో అతి పెద్ద జనాభా కలిగి, అయిదో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా వున్న భారత్ కి భద్రతా సమితి లో శాశ్వత సభ్యత్వం రాకుండా మోకాలడ్డుతుంది. మనకి చెందిన పాక్ ఆక్రమిత భూభాగంలో ఆర్ధిక నడవా నిర్మిస్తుంది. మన భూభాగాన్ని అన్యాయంగా ఆక్రమించటమే కాకుండా ఎటువంటి అధికారం లేని పాకిస్తాన్ ద్వారా మరికొంత భూభాగాన్ని చేజిక్కించుకుంది. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదులకు అంతర్జాతీయ సంస్థల్లో రక్షణ కల్పిస్తుంది.
ఈరోజు మనకొక అవకాశం వచ్చింది. చైనాకి వ్యతిరేకంగా ప్రాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా ముందుండి కొట్లాడుతుంది. ఇటీవలి పరిణామాల్లో ముఖ్యంగా కరోనా మహమ్మారి వ్యవహారంలో చైనా పాత్రపై ప్రపంచం మొత్తం గుర్రుగా వుంది. అదే సమయంలో చైనాకి ఐరాసలో వీటో అధికారం ఉండటంతో సంస్థాగత మార్పులకి ఎటువంటి అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో భారత్ ప్రయోజనాలు నెరవేరాలంటే మనమూ మిగతా దేశాలతో కలిసి కొత్త ప్రపంచ వ్యవస్థ నిర్మాణానికి కృషి చేయాలి. అందుకు ప్రస్తుత అమెరికా సానుకూల ధోరణిని ఉపయోగించుకో గలగాలి. అయితే అందులో చైనాతో సహా అన్నిదేశాలకు సమ న్యాయం జరినప్పుడే అది ఫలప్రదమవుతుంది. అది ఒక్క రోజులో జరిగేపనికాదు, ఇప్పట్నుంచీ జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ముందుకు సాగాల్సివుంటుంది. ప్రపంచ చరిత్ర లో ఒకనాటి గౌరవాన్ని తిరిగి పునరుద్ధరించుకోవటమే ఆశయంగా భారత్ పనిచేస్తుందని ఆశిద్దాం.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: New world order is the need of hour
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com