New Trend Of Political Parties: తాజాగా రాజకీయ పార్టీలు కొత్త పంథాతో ముందుకు సాగుతున్నాయి. పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తున్నాయి. అందులో సోషల్ మీడియా విభాగానికి పెద్దపీట వేస్తున్నాయి. ఎన్నడూ లేనంతంగా సోషల్ మీడియా సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ వార్‌కు సన్నద్ధమవుతున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలు సోషల్ మీడియా విభాగాలను ఏర్పాటు చేశాయి. అటు ఫేస్‌బుక్, ఇటు ట్విట్టర్, మరోవైపు వాట్సాప్, ఇంకోవైపు యూట్యూబ్ ఇలా ప్రసార మాధ్యమాల ద్వారా పార్టీ వాయిస్ ను ప్రచారం చేస్తున్నాయి. అధికార పక్షం ప్రభుత్వ విధానాలను, విపక్షాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేస్తూ సినీడైలాగులతో కూడిన పొలిటికల్ పంచ్‌లు పేలుస్తున్నారు.
అంతటితో ఆగకుండా జూమ్ మీటింగ్‌లు, టెలీ కాన్ఫరెన్స్‌లతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఒక పొలిటికల్ యుద్ధమే నిర్వహిస్తున్నారు. ఇలా ప్రజల మధ్య తిరగకుండా సోషల్ మీడియా వేదికగా రాజకీయాలను నడుపుతున్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తలు, అభిమానులు సైతం సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వేడిని పెంచుతున్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరికొందరైతే శృతి మించి విమర్శలు చేస్తూ జైలుపాలవుతున్నారు. విలేఖర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కంటే.. సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలే పాపులర్ అవుతున్నాయి. ప్రజలకు సూటిగా చేరుతున్నాయి. సెలబ్రిటీలుగా మార్చుతున్నాయి.
Also Read: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల కలెక్టరేట్లు ఇవే.. ఏ జిల్లా ఆఫీస్ ఎక్కడంటే?
యుద్ధ వాతావరణం
ప్రస్తుతం రాష్ట్రంలో అసలు ఎన్నికలే లేవు. ఇంకా ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉంది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని రాజకీయ సెగ తగులుతునే ఉంది. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడని శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో టీడీపీ నాయకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విషయమేమిటంటే ఏడాది కిందట వైసీపీ నేతపై పెట్టిన కామెంట్లపై పోలీసులు స్పందించి కేసు నమోదుచేశారు. దీంతో ఆ టీడీపీ నాయకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అదే నియోజకవర్గంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకరు టీడీపీ సానుభూతిపరుడు. ఆయన తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ లో టీడీపీ అనుకూల ఫొటో పెట్టారని ఏకంగా విధుల నుంచి తొలగించారు.
టెక్కలి నియోజకవర్గంలో స్థానికి వైసీపీ నేతకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారంటూ జనసేన కార్యకర్తను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రతీరోజూ సోషల్ మీడియా రగడ ఘటనలు వెలుగుచూస్తునే ఉన్నాయి. పొలిటికల్ పార్టీల నడుమ సోషల్ సమరం పతాకస్థాయికి చేరుకుంది అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఆయా పార్టీల అధ్యక్షుల దగ్గర నుంచి అభ్యర్థుల వరకు అంతా సోషల్ మీడియానే విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రతి నేత ఒక సోషల్ మీడియా టీంను ప్రత్యేకంగా నియమించుకుంటున్నారు. ఆ టీంతో చేసేది గోరంత పబ్లిసిటీ చేసుకునేది కొండంత అన్న చందంగా నేతలు తయారయ్యారు. రాష్ట్రంలో ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగించేవారి సంఖ్య నాలుగు కోట్లకుపైనే ఉందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో యువతను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా అన్ని పొలిటికల్ పార్టీలు సోషల్ మీడియాను అడ్డాగా మార్చుకున్నాయి. యువతను, అలాగే పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఆకట్టుకునేందుకు చేసే పోస్టులు, ట్వీట్లు ఆద్యంతం ఆసక్తిరేపుతూనే ఉంటున్నాయి. ఇక కొంతమంది నాయకులు అయితే ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి మరీ పొలిటికల్ రగడ సృష్టిస్తున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్తే ఇప్పుడు అన్ని పార్టీలు వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి ఏం చెప్పదలచుకుందో వాటిని సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై వదిలేస్తున్నాయి.
వైసీపీకి విజయం..సోషల్ మీడియా పుణ్యం
గత ఎన్నికల్లో వైసీపీ గెలుపులో సోషల్ మీడియాదే కీలక పాత్ర. వైసీపీ సోషల్ మీడియా అహోరాత్రులు శ్రమించింది. నాడు వైసీపీ సోషల్ మీడియా వింగ్ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కథనాలు ప్రజలకు చేరువ చేయడంలో సక్సెస్ అయ్యింది. టీడీపీ ప్రభుత్వ లోపాలను తప్పుపట్టడమే కాకుండా.. వైసీపీ అధికారంలోకి వస్తే నవరత్నాలు, పథకాలు ఎలా అందించగమో వివరించారు. ఫలితంగానే ఈ భారీ విజయం. నాటి సోషల్ మీడియా ప్రచారమే వైసీపీ గెలుపు సునాయాసంగా మారిందని ఇప్పటికీ ఆ పార్టీ నేతలు చెప్తూ ఉంటారు. ఓ వైపు వైసీపీ అధినేత జగన్ నియోజక వర్గాలను చుట్టేస్తుంటే.. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా వింగ్ ప్రభుత్వ లొసుగులు, పొరపాట్లను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమైంది.
ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాడు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ‘రావాలి జగన్’.. పాట ఒక కుదుపు కుదుపేసింది.. ముఖ్యంగా వైఎస్ జగన్ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ సంస్థ సోషల్ మీడియా ప్రచార నిర్వహణను పర్యవేక్షించేది. ప్రశాంత్ కిశోర్ తన అనుభవాన్ని రంగరిస్తూ సోషల్‌మీడియాలో ప్రచారాన్ని హోరెత్తించారు. చంద్రబాబు వైఫల్యాలను ఎండగడుతూ యువతను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. అలాగే ఐప్యాక్ టీం వైసీపీకి సంబంధించిన స్లోగన్‌లను ఐటీ నిపుణుల ద్వారా.. సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. నిన్ను నమ్మం బాబు, బైబై బాబు, ఏపీ విత్ వైఎస్ఆర్‌సీపీ హ్యాష్ ట్యాగ్‌లతో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో విస్తృత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు నుంచే టీడీపీ సోషల్ మీడియాను వినియోగిస్తున్నా ప్రశాంత్ కిశోర్ ఐ ప్యాక్ టీం వద్ద పాచిక పారలేదు. అందుకే 2024 ఎన్నికలకు టీడీపీ సోషల్ మీడియాను బలోపేతం చేసే పనిలో పడింది.
Also Read: Nara Chandrababu Naidu: ఏకతాటిపైకి ‘అన్న’గారి కుటుంబం… చంద్రబాబు ప్రయత్నం