Homeజాతీయ వార్తలుTelangana Politics: జనవరి 18 తర్వాత తెలంగాణలో సరికొత్త రాజకీయాలు!! 

Telangana Politics: జనవరి 18 తర్వాత తెలంగాణలో సరికొత్త రాజకీయాలు!! 

Telangana Politics: దాదాపు ఏడాదిన్నరగా తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య సై అంటే సై అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. ఒకరికి మించి మరొకరు ఎత్తుకు పైఎత్తు వేస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నారు. చివరకు దర్యాప్తు సంస్థలను ప్రయోగించే వరకూ వెళ్లాయి. ఈ క్రమంలో కొన్ని రోజులుగా రెండు పార్టీలు సైలెంట్‌ అయ్యాయి. రాజకీయాలు స్తబ్దుగా కనిపిస్తున్నాయి. జనవరి 18 తర్వాత ఒక్కసారిగా వేడెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంగా సుడి తిరుగుతున్న తెలంగాణ రాజకీయాల్లో 18వ తేదీ కీలకంగా కనిపిస్తోంది. జాతీయ పార్టీగా మారిన భారత రాష్ట్ర సమితి తమ తొలి భారీ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా కేంద్రాన్ని వేదికగా చేసుకుంది. అయితే ఖమ్మం జిల్లాను ఎంపిక చేసుకునే విషయంలో గులాబీ బాస్‌ కేసీఆఆర్‌ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లుగా భావించాలి. 2014లో వైయస్సార్‌సీపీ తరఫున ఎంపీగా గెలిచి, ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా మారిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. గత కొంతకాలంగా తనకు గులాబీ పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదని, ఉద్దేశపూర్వకంగా పార్టీ అధిష్టానం తనను పక్కన పెడుతుందని.. నిర్లక్ష్యం చేస్తుందని భావిస్తున్నారు. ఈమేరకు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. గులాబీ పార్టీని వీడే దిశగా మంతనాలు ప్రారంభించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీఅర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం. బీఆర్‌ఎస్‌ కోణంలో ఆలోచిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు నాయకులు ఎమ్మెల్యే టికెట్లు ఆశించే పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఏర్పడినప్పటి నుంచి పని చేస్తున్న వారు కొందరైతే.. 2014 పరిణామాల తర్వాత పార్టీలో చేరిన తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల నేతలు మరికొందరు. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో ఇద్దరికి మించి అభ్యర్థులు కనిపిస్తున్నారు.

Telangana Politics
Telangana Politics

2014 తర్వాత గ్రూపులు..
ముఖ్యంగా 2014 తర్వాత జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీలో గ్రూపులు పెరిగిపోవడానికి కారణమైంది. అయితే ఈ గ్రూపు నాయకులెవరు పార్టీ అధిష్టానానికి తెలియకుండా పూచిక పుల్ల కూడా కదిపే పరిస్థితి లేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి టీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేదు. కాంగ్రెస్, టీడీపీ హవానే కొనసాగింది. కానీ ఎప్పుడైతే టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ తర్వాత కేసీఆర్‌ వ్యూహాత్మక విధానాలతో కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్‌ పంచన చేరారు. దాంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఖమ్మం జిల్లాలో బలపడింది.

పొంగులేటి వెంట వైఎస్సార్‌సీపీ శ్రేణులు..
2014లో వైయస్సార్సీపీ తరఫున ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో ఆయన వెంట వైఎస్సార్సీపీతోపాటు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకున్నాయి. ఒక దశలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తిరుగులేని నేతగా కనిపించారు. కానీ ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. పువ్వాడ అజయ్‌కుమార్‌ మంత్రి కావడం, ఆ తర్వాత తనపై 2014లో పోటీ చేసి ఓడిపోయిన నామా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి 2019లో పొంగులేటికి టికెట్‌ రాకుండా చేయడంతో జిల్లాలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కేసీఆర్‌ తమ పార్టీలోకి చేర్చుకున్నారు. అసాధారణ రీతిలో ఏకంగా మంత్రిని చేశారు. ఆ తర్వాత మంత్రి పదవిని కాపాడటానికి తొలుత ఎమ్మెల్సీని చేశారు. 2016లో పాలేరు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో తుమ్మలను బరిలోకి దింపి ఆ సీటును కాంగ్రెస్‌ ఖాతాలోంచి టీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలోకి మళ్లించారు కేసీఆర్‌. అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచే పోటీచేసి అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఆయనపై విజయం సాధించిన కందాడి ఉపేందర్‌రెడ్డి ఆ తర్వాత జరిగిన పరిణామాలలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావుకు ఆ నియోజకవర్గంలో ప్రాధాన్యత క్రమంగా తగ్గింది.

పొంగులేటికి బీజేపీ గాలం..
తాజాగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి భారతీయ జనతా పార్టీ గాలం వేస్తున్న నేపథ్యంలో ఆయన, ఆయన అనుచరగణం కాషాయతీర్థం పుచ్చుకుంటున్నారన్న సంకేతాలు వెలబడ్డాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌ జిల్లాలో కీలకంగా ఉన్న గులాబీ నేతలను అప్రమత్తం చేశారు. చాలాకాలంగా టచ్‌లో లేని తుమ్మల నాగేశ్వరరావును మళ్లీ అక్కున చేర్చుకున్నారు. ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలను పంపించారు. ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు. జాతీయ పార్టీగా మారిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఖమ్మం జిల్లాను వేదిక చేసుకోవడం వెనుక కేసీఆర్‌ వ్యూహం చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీని ఎస్టాబ్లిష్‌ చేయాలని చూస్తున్న కేసీఆర్‌ ఇటీవలనే ఏపీ రాష్ట్ర బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించే సందర్భంలో ఇటు తెలంగాణ పొరుగు జిల్లాలతో పాటు అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పొరుగు జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేయడం ద్వారా దేశానికి ఒక సందేశం ఇవ్వాలన్నది కేసీఆర్‌ వ్యూహంగా కనిపిస్తుంది.

మూడు జిల్లాల నుంచి జన సమీకరణ..
ఖమ్మం సభకు ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేయడం ద్వారా ఏపీలో తమ పార్టీకి క్యాడర్‌ ఉంది అని చాటుకునేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. అదే సందర్భంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొందరు నేతలు పార్టీని వీడనుండడంతో మిగిలిన నేతలతోనే ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉందని చాటాలని భావిస్తున్నారు. అందుకే ఖమ్మం జిల్లా కేంద్రంగా నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ఐదు లక్షల మందిని తరలించాలని పార్టీ నేతలను ఆదేశించారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకునేలా జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లాలో కీలక నేత తుమ్మల నాగేశ్వరరావును అప్రమత్తం చేశారు. వీరిద్దరి మధ్య సమన్వయంతోపాటు.. పొంగులేటి శ్రీనివాస్‌ వెంట తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కువ స్థాయిలో వెళ్లకుండా నివారించే బాధ్యతలను ట్రబుల్‌ షూ, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు అప్పగించారు కేసీఆర్‌. ఈ నేపథ్యంలో జరుగుతున్న జనవరి 18 ఖమ్మం బహిరంగ సభ కేసీఆర్‌ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది.

Telangana Politics
Telangana Politics

కాలుదువ్వుతున్న కమలం..
ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని వెనక్కి నెట్టి కేసీఆర్‌తో తలపడే సత్తా తమకే ఉందని చాటుకుంటున్న భారతీయ జనతా పార్టీ నేతలు కూడా తాజా పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను లక్ష్యంగా చేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో పేరు, పట్టు, ప్రజల్లో అభిమానం ఉందని భావిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకుంటే ఆయన వెంట పలు నియోజకవర్గం పలువురు పార్టీలో చేరతారని కమలనాథులు భావిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయాలని, అందుకోసం వివిధ పార్టీల్లో ఉన్న బలమైన నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఆ బాధ్యతలను మాజీ మంత్రి, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌కు అప్పగించింది. చాలా కాలంగా ఈటల రాజేందర్‌ ఇదే పని మీద ఉన్నారు. అదే క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాను ఊపేసిన మునుగోడు ఉప ఎన్నిక రావడం, జిల్లాలో బాగా పట్టున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమలం తీర్థం పుచ్చుకోవడం జరిగిపోయాయి. ఆ తర్వాత కమలనాథుల దృష్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద పడింది. కేసీఆర్‌ పార్టీలోనే కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చాలాకాలంగా కినుక వహించినట్లు గుర్తించింది బీజేపీ. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పార్టీ టికెట్‌ నిరాకరించడంతో ఆయన అప్పట్లోనే పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కానీ గత నాలుగు సంవత్సరాలుగా తనకు పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికీ పొంగులేటి గులాబీ పార్టీలోనే కొనసాగారు. తాజాగా కేసీఆర్‌ తనను పూర్తిగా పట్టించుకోవడం లేదని, ఇంకోవైపు తమ పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ నేతలు క్రమం తప్పకుండా వెంటపడుతూ ఉండడంతో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం శ్రీనివాస్‌రెడ్డికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీవైపు మొగ్గు చూపుతున్నట్లు గత వారం రోజుల పరిణామాలు చాటిచెబుతున్నాయి. ఇందులో భాగంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జనవరి 18న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ష తో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. అమిత్‌షాతో భేటీ అయిన తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఇక లాంఛనమే అంటున్నారు. ఆయన వెంట పలువురు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని చెబుతున్నారు. ఇదే జరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బీజేపీకి అభ్యర్థుల కొరత తీరినట్లేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు గులాబీ బాస్‌ జనవరి 18న జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం, అదే రోజు న్యూఢిల్లీలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరుగణంతో భారతీయ జనతా పార్టీలో చేరుతుండడంతో ఆ తర్వాత జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కి అవకాశాలు కనిపిస్తున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular