ఉద్యమపార్టీగా అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లుగా రాజ్యమేలుతున్న టీఆర్ఎస్ అంటే ప్రజల్లో కొంత నైరాశ్యం ఏర్పడుతోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు.. తరువాత అన్న విధంగా అధికార పార్టీ.. ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఉందని ప్రజలు అనుకుంటున్నారు. మొదటి ఐదేళ్లు విజయవంతంగా సర్కారును నడిపించిన గులాబీ అండ్ టీం ప్రస్తుత పీరియడ్లో కొంత ఆందోళనకు గురవుతుందనే చెప్పవచ్చు. ఈనేపథ్యంలో తెలంగాణలో కొత్తపార్టీల హడావుడి పెరిగిపోతోందని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే షర్మిల పార్టీ రావడం ఖాయమైంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో నిరాధారణకు గురవుతున్న ఉద్యమ బ్యాచ్లోని కొంతమంది ముఖ్యనేతలు కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Also Read: కోవిడ్ టీకా తీసుకున్న ప్రధాని మోడీ.. ఆయనకు వేసిన టీకా ఏదంటే?
ఇదే విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. తెలంగాణలో కొందరు పార్టీ పెట్టాలని చూస్తున్నారని.. వేరే పార్టీలకు ఇక్కడ అవకాశం లేదని… తెలంగాణను తాము రాజకీయ పట్టా చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. 90శాతం మంది ప్రజలు టీఆర్ఎస్ వెంట ఉన్నారని.. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆస్తి అని తేల్చేశారు. టీఆర్ఎస్ లో కొత్తపార్టీలపై ఎక్కువగా గంగుల కమలాకరే స్పందిస్తున్నారు.బహుశా ఆయనకు మాత్రమే హైకమాండ్ ఇలాంటి విషయాలు మాట్లాడాలని అనుమతి ఇచ్చి ఉంటుందని పలువురు అంటున్నారు.
షర్మిల పార్టీపై ఇప్పటికే ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు ఏ పార్టీ గురించి గంగుల కమలాకర్ మాట్లాడారన్నది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ లో కొంతమంది కొత్త పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారని బయట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఈటల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. దీన్ని బట్టి ఈటల రాజేందర్ పార్టీపై టీఆర్ఎస్ లోనూ క్లారిటీ ఉందన్న చర్చ జరుగుతోంది.
Also Read: రసకందాయంలో టెక్కలి నియోజకవర్గం..!
ప్రస్తుతం టీఆర్ఎస్ లో బంగారు తెలంగాణ భజన బ్యాచ్ హవా నడుస్తోంది. ఉద్యమ తెలంగాణ నేతలకు నిరాదరణ ఎదురవుతోంది. ఉద్యమం చేసి తెలంగాణ సాధించించింది తామయితే.. ఫలాలు.. బంగారు తెలంగాణ పేరుతో టీఆర్ఎస్లో చేరిన వారు పదవులను అనుభవిస్తున్నారని చాలా మంది అంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయం అంత సాఫీగా ఉండబోవడం లేదని.. కొన్ని కొత్త పార్టీలు తెరపైకి రావడం ఖాయమన్న ప్రచారం మంత్రి గంగుల కమలాకర్ మాటలతో మరింత ఊపందుకుంటోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్