AP New Ministers Controversies: జర్నలిస్టులు సీఎం జగన్ ను ఆరాధించండి..కానీ ఆరా తీయకండి అని ఒకరు.. కోర్టులో నకలిపత్రాల చోరీ వివాదంలో మరొకరు.. నడి రోడ్డుపై సొంత పార్టీ కార్యకర్తనే చెంప చెల్లుమనిపించిన ఇంకొకరు.. శ్రీకాళహస్తిలో భక్తులకు నాలుగు గంటల పాటు నరకం చూపించినంది ఒకరు.. కొనసీమ రోడ్లుపై కరెన్సీ నోట్లు విసిరింది ఒకరు.. అత్యవసరంగా వెళుతున్న అంబులెన్షను దారివ్వక చిన్నారి మరణానికి కారణం మరొకరు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. కొత్తగా మంత్రులుగా చేరిన వారు ప్రజలకు చుక్కలు చూపించారు. అమాత్యులైన ఆనందంలో ప్రజా జీవితానికి భంగం కలిగించారు.
తొలి రోజుల్లోనే ప్రతాపం చూపించారు. తమ రెండున్నరేళ్ల పాలన ఎలా ఉంటుందో హెచ్చరికలు పంపారు. వారి నిర్వాకాన్ని చూసిన ప్రజలు వీరేం అమాత్యులంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా జగన్ కొత్తగా 14 మందిని కేబినెట్ లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల కిందట ప్రమాణస్వీకారం చేసిన వారు అమరావతిలో బాధ్యతలు తీసుకున్నారు. సరైన ముహూర్తం చేసుకొని మందీ మార్భలంతో, భారీ కాన్వాయ్ లతో వారు సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. వైసీపీ శ్రేణులు వారికి భారీ స్వాగత కార్యక్రమాలు ఏర్పాటుచేశాయి. ఈ క్రమంలో ఎక్కడికక్కడే అపశ్రుతులు ఎదురయ్యాయి. ప్రజల నుంచి ఛీత్కారాలను ఎదుర్కొన్నారు.
Also Read: Secretariat Employees: మూడు పుటలా హాజరు వేయాల్సిందే.. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్
దేవాదాయ శాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. తొలిసారిగా శ్రీశైలం మల్లన్నను కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయన వెంట అనుచరులు, అధికార పార్టీ నేతలు పదుల సంఖ్యలో విచ్చేశారు. దాదాపు ఆయన ప్రత్యేక పూజల కోసం ఆలయవర్గాలు నాలుగు గంటల పాటు వెచ్చించాయి. అప్పటికే క్యూలైన్ లో ఉన్న భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చిన్నారులు, మహిళలు ఆపసోపాలు పడ్డారు. దీంతో మంత్రి వైఖరిపై బాహటంగానే విమర్శలు గుప్పించారు. నిలదీసినంత పనిచేశారు. దేవదాయ శాఖ మంత్రి అయిన మీరే భక్తుల గురించి పట్టించుకోవడం లేదంటూ నిలదీశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా నెల్లూరు జిల్లాకు చెందిన కాకాని గోవర్థన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల తరువాత ఆయనపై అభియోగం మోపబడి కోర్టులో నడుస్తున్న కేసుకు సంబంధించి పత్రాలు చోరీకి గురయ్యాయి.
అదే జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్నారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారని.. విదేశాల్లో ఆస్తులు కొన్నారని విపక్షంలో ఉన్నప్పుడు కాకాని కొన్ని పత్రాలు చూపించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో విడుదల చేశారు. అయితే అవి నకిలీ పత్రాలంటూ సోమిరెడ్డి తిరిగి కాకానిపై కేసు పెట్టారు. పోలీసుల విచారణలో ఫేక్ అని తేలడంతో కాకానిని ఏ1 ముద్దాయిగా చేర్చుతూ కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసు నెల్లూరు కోర్టు పరిధిలో నడుస్తోంది. మంత్రిగా కాకాని బాధ్యతలు తీసుకున్న తరువాత కేసునకు సంబంధించి పత్రాలు చోరీ కావడం, కొన్ని కోర్టు ఆవరణలో కనిపించడంతో ఇప్పుడు కాకాని చుట్టూ వివాదం నడుస్తోంది.
స్త్రీశిశు సంక్షెమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి ఉష తన సొంత నియోజకవర్గంలో వందలాది వాహనాలు, మందీ మార్భలంతో యాత్ర నిర్వహించారు. వెనుక అత్యవసర అనారోగ్యం నిమిత్తం వస్తున్న అంబులెన్స్ ను సైతం నిలిపివేశారు. నాలుగు గంటల పాటు ట్రాపిక్ అంబులెన్స్ చిక్కుకోవడంతో అందులో అత్యవసర వైద్యం అందాల్సిన నాలుగేళ్ల చిన్నారి ప్రాణం పోయింది. మంత్రి నిర్లక్ష్య వైఖరితోనే రవచిన్నారి ప్రాణాలు కోల్పోయాయంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
రవాణా శాఖ మంత్రిగా విశ్వరూప్ బాధ్యతలు స్వీకరించారు. తొలిసారిగా తన సొంత ప్రాంతంలో అడుగు పెట్టడంతో కోనసీమలో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రోడ్డుపై బుల్లెట్ల సైరన్ మోతతో హోరెత్తించారు. చెవులకు చిల్లుపడేలా అత్యధిక డెసిబుల్ సామర్థ్యంతో మోత మోగించారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై కరెన్సీ నోట్లు వేసి గందరగోళం స్రుష్టించారు. అక్కడున్న వారు నోట్లను ఏరుకునేందుకు రోడ్డుపై గుంపుగా వాలిపోవడం, ఆ ద్రుశ్యాలు చూసిన మంత్రి ముసిముసి నవ్వులు నవ్వడం విమర్శలకు దారితీసింది. ఇదేం చోద్యమంటూ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. రెవెన్యూ మంత్రిగా సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. తమ నాయకుడికి సుదీర్ఘ కాలం తరువాత మంత్రి పదవి దక్కడంతో ఆయన అభిమానులు ఎంతగానో ఆనందించారు. స్వాగత కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు.
ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఆవేశానికి గురైన ధర్మాన ఒక కార్యకర్త చెంపను చెల్లుమనిపించారు. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అభిమానంతో చెయ్యి అందిస్తే కొట్టడమేమిటని ప్రశ్నించారు. ఒకవేళ కరచాలనం చేయడానికి ఇష్టం లేకుంటే చిరునవ్వుతో స్పందించి ఉంటే సరిపోయేదని చెబుతున్నారు.
సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చెల్లుబోయిన వేణుగోపాల్ తొలి రోజే జర్నలిస్టులకు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను వెల్లడించే కీలక మంత్రి తొలిరోజే తడబడ్డారు. జర్నలిస్టులకు ఉచిత సలహా ఇచ్చారు. మీకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు కావాలంటే సీఎం జగన్ ను ఆరాధించాలని సెలవు ఇచ్చారు. తాను ఆరాధించాను కాబట్టే అమాత్య పదవి వచ్చిందని గుర్తుచేశారు. అంతటితో ఆగకుండా మీరు ఆరాధించడంతో పాటు ఆయన గురించి ఆరా తీయ్యవద్దంటూ బదులిచ్చారు.
దీంతో అక్కడున్న జర్నలిస్టులు నొచ్చుకున్నారు. తొలి రోజే అయ్యగారు ప్రతాపం ఇలా చూపారని.. ముందు ముందు ఇలాంటి వ్యాఖ్యలు ఎన్ని వినాల్సి వస్తుందోనని గుసగుసలాడుకున్నారు. ఇలా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తొలినాళ్లోనే ప్రజల ద్రుష్టిలో పలుచనైపోవడం అమాత్యులకు భావ్యం కాదు. ఉన్న రెండేళ్లయినా బాధ్యతలు తెలుసుకొని ప్రవర్తించాల్సిన అవసరముంది.