Ashok Gajapathi Raju: తమవి కాదన్న వ్యవహారంలో తలదూర్చడం.. అనక మొట్టికాయలు తినడం ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఈ మూడేళ్ల కాలంలో గిల్లికజ్జాలు అన్నీఇన్నీకావు. రాజకీయంగా తమకు ప్రతికూలమైన వారు ఎవరైనా? ఎంతటివారైనా అనవసరం. వారిని ఇబ్బంది పెట్టి రాక్షస ఆనందం పొందడం పాలకుల వంతైంది. రాజైనా.. కింకరుడైనా తాము కనిపిస్తే మొకరిల్లాల్సిందే. తమ పల్లకిని మోయాల్సిందే. లేకుంటే ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికలతో సాగింది ఈ మూడేళ్ల పాలన. న్యాయస్థానాలు ఉన్నాయి కదా సరిపోయింది. లేకపోతే ప్రభుత్వ పెద్దల బాధితులు వేలాదిగా పెరిగిపోయేవారు.

వారికి భరోసా ఇచ్చేవారు..ఓదార్చే వారు సైతం కరువయ్యేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రథమ బాధితుడు విజయగనం రాజవంశీయుడు పూసపాటి అశోక్ గజపతిరాజు. టీడీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారన్న అక్కసుతోనో.. మ్రధుస్వభావి కనుక భయపడతారనో..లేకపోతే వేల కోట్ల ఆస్తులు ఉన్న మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అనో ఎందుకో అశోక్ గజపతిరాజును ఇబ్బంది పెట్టాలని చూశారు. ఏకంగా దొడ్డిదారి జీవోతో ఆయనను ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి తొలగించేశారు. అంతటితో ఆగకుండా సింహాచలం, రామతీర్థం దేవస్థానం ధర్మకర్తలి మండలి అనువంశిక చైర్మన్ పదవి నుంచి తొలగించారు. అనూహ్యంగా అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు కుమార్తె అంటూ సంచాయిత అనే మహిళను తెరపైకి తెచ్చారు. రాత్రికి రాత్రే ఆమెను మాన్సాస్ ట్రస్ట్ తో పాటు సింహాచలం దేవస్థానం ధర్మకర్తలి మండలి అనువంశిక చైర్ పర్సన్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Also Read: IAS Officers: ఆ సేవా శిక్ష మావల్ల కాదు.. కోర్టును ఆశ్రయించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు
ఇది నిబంధనలకు విరుద్ధమని అశోక్ గజపతిరాజు చెప్పినా… బైలాకు వ్యతిరేకమని న్యాయ నిపుణులు హెచ్చరించినా ప్రభుత్వం వినలేదు సరికదా.. ఎనిమది పదుల వయసుకు దగ్గరగా ఉన్న అశోక్ గజపతిరాజును ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్నిరకాలుగా సెగచూపింది వైసీపీ ప్రభుత్వం. పాలకులు తెగ ఆనందపడిపోయారు అశోక్ కళ్లలో ఆనందం దూరం చేశామని. కానీ వారికి తెలియదు ఆయనో రాజ వంశీయుడని.. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా సాధారణ జీవితం అనుభవిస్తారని. న్యాయం ఆయన పక్కన ఉందని. వాస్తవానికి బైలా ప్రకారం రాజ వంశంలో మగ సంతానం ఉంటే వారే ట్రస్టీగా ఉంటారని నిపుణులు చెప్పుకొస్తున్నా.. కిందపడినా తమదే గెలుపు అన్నట్టు ప్రభుత్వ పాలకులు వ్యవహరించారు. చివరకు న్యాయ స్థానంలో మొట్టికాయలు తిని రాజుగారికి తిరిగి పదవి బాధ్యతలు అప్పగించారు. సంచయిత ఢిల్లీ వెళ్లిపోగా.. ప్రభుత్వ పెద్దలు పలాయనం చిత్తగించారు.

విశాఖ రాజధానిగా ప్రకటించిన తరువాత ప్రభుత్వ పెద్దలకు సింహాచలం దేవస్థానం భూములు కనిపించాయి. అయితే ధర్మకర్తల మండలి అనువంశిక చైర్మన్ గా అశోక్ గజపతిరాజు ఉన్నారు. ఆయన ఉండగా తమ పాచిక పారదన్న విషయం తెలుసు. అందుకే కొత్త పన్నాగానికి దిగారు. రాజుగారి కుటుంబ నేపథ్యం తెలుసుకునే పనిలో పడ్డారు. అశోక్ సోదరుడు ఆనందగజపతిరాజు మొదటి భార్య ఢిల్లీలో ఉన్నారని తెలుసుకున్నారు. ఆమెకు ఒక కుమార్తె ఉందని తెలుసుకొని సంచయితను తీసుకొచ్చి సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ పీఠంపై కూర్చోబెట్టారు. ఆమె రాజవంశీయురాలు కానే కాదని.. ఆమె తన తండ్రి పేరు ఆనందగజపతిరాజు అని ఎప్పుడూ చెప్పలేదని..ఆమెలో రాజవంశీయురాలి కంటే పాశ్చత్య పోకడలే అధికమని విమర్శలు, ఆరోపణలు వచ్చినా వినలేదు.
ఎలాగైనా అశోక్ ను దించాలంటే ఆమె తప్పించి ఎవరూ లేరని భావించి ఏరికోరి ఆమెను మాన్సాస్ ట్రస్ట్ తో పాటు సింహాచలం దేవస్థానం బోర్డు చైర్ పర్సన్గా నియమించారు. దశాబ్దాలుగా విద్య, వైద్య సేవలందిస్తూ వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యగో, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న మాన్సాస్ ట్రస్ట్ ప్రక్షాళన పేరుతో ఆమె చేసిన ఆగడాలను చూసి విజయనగరం వాసులు విసిగి వేశారిపోయారు. అశోక్ గజపతిరాజుకు ఈ పరిస్థితి ఏమిటని రాజకీయాలకతీతంగా బాధపడ్డారు. ఇంతలో కోర్టు రూపంలో భగవంతుడు కరుణించాడు. తిరిగి అశోక్ ను మాన్సాస్ పీఠంపై కూర్చోబెట్టాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొంత వెనక్కి తగ్గింది. శ్రీ వరాహా లక్ష్మినరసింహ స్వామి సింహాచలం దేవస్ధానం ట్రస్టు బోర్డును నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మకర్తల మండలి అనువంశిక ఛైర్మన్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు, సభ్యులుగా 14 మందిని నియిమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులిచ్చింది. ట్రస్టులో ఎక్స్ అఫిషీయో మెంబర్‌గా ఆలయ ప్రధాన అర్చకులు ఉంటారని, రెండేళ్ళ పాటు పాలకమండలి కొనసాగుతుందని పేర్కొంటూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్ లాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read:Second Chance: క్యాబినేట్ కూర్పులో ‘కొత్త’ ట్వీస్ట్.. వారందరికీ సెకండ్ ఛాన్స్ దక్కనుందా?