రెడ్ ‘క్యాప్సూల్’.. రేటు కోటి రూపాయలు

తెలంగాణలో కొందరు కోట్లు కుమ్మరిస్తున్నారు.   “రెడ్ మెర్క్యూరీ” కోసం టీవీ మెకానిక్ షాపుల్లో పాత టీవీలు, పాత రేడియోల కోసం వెతికి  ఒక్కో పాత టీవీ, పాత రేడియోకు లక్షలు పోసి కొంటున్నారు.  ఐదు సంవత్సరాలు కష్టపడితే కోటి రూపాయలు సంపాదించవచ్చని  చెప్పిన వ్యక్తి మాట కంటే…. ఐదు నిముషాల్లో కోటి రూపాయలు సంపాయించే ఉపాయం నా దగ్గర ఉందనే  వ్యక్తి మాటనే కొందరు పూర్తిగా నమ్ముతారు. ఇటువంటి  వారే 420 గాళ్ల చేతిలో దారుణంగా మోసపోతుంటారు. […]

Written By: NARESH, Updated On : September 23, 2020 10:14 pm
Follow us on

తెలంగాణలో కొందరు కోట్లు కుమ్మరిస్తున్నారు.   “రెడ్ మెర్క్యూరీ” కోసం టీవీ మెకానిక్ షాపుల్లో పాత టీవీలు, పాత రేడియోల కోసం వెతికి  ఒక్కో పాత టీవీ, పాత రేడియోకు లక్షలు పోసి కొంటున్నారు.  ఐదు సంవత్సరాలు కష్టపడితే కోటి రూపాయలు సంపాదించవచ్చని  చెప్పిన వ్యక్తి మాట కంటే…. ఐదు నిముషాల్లో కోటి రూపాయలు సంపాయించే ఉపాయం నా దగ్గర ఉందనే  వ్యక్తి మాటనే కొందరు పూర్తిగా నమ్ముతారు. ఇటువంటి  వారే 420 గాళ్ల చేతిలో దారుణంగా మోసపోతుంటారు.

అడ్డదారుల్లో కోట్లు సంపాదించాలనుకునే వారు,  రాత్రికి రాత్రే కోట్లు కూడబెట్టుకోవాలనుకునే అత్యాశా పరులు ఉన్నంత కాలం… మోసగాళ్ల మోసాలకు ఢోకా ఉండదు. కష్టపడకుండానే కోట్లు సంపాదించాలనుకునే వారి మానసిక బలహీనతే,ఈ  మోసగాళ్ల బలం. ఎరకు చేప చిక్కి నట్టు… అప్పనంగా కోట్లు సంపాదించాలనుకునే బలహీనత ఉన్నవారే మోసగాళ్లకు చిక్కు తుంటారు. ఈ మోసగాళ్లే రోజుకో  రకం కొత్త  మోసాన్ని తెరపైకి తెస్తూ మోసాలను యదేచ్చగా  కొనసాగిస్తుంటారు.
ఇప్పటి వరకు గుప్త నిధులు, లంకె బిందెల పేరిట క్షుద్ర పూజలు చేసే వారిని, బంగారు పూత పూసిన ఇనుప కడ్డీలను అమ్మేవారిని, లాటరీలో 50లక్షలు తగిలాయని  ఆన్లైన్ మోసాలకు పాల్పడేవారిని, రైస్ పుల్లింగ్ తో బంగారం ఆకర్షించబడుతుందని, అంజనం తో పిల్లికండ్ల వారికి నిధులు కన్పిస్తాయని, ఆదివారం అమావాస్య  అర్ధరాత్రి దిగంబర పూజలతో అతీత శక్తులు సిద్ధిస్తాయని, నల్లపసుపు, నల్లవాయిలి, ఎర్రకలబంద, నల్లకుందేలు, పొర్లుగాని తో,చెట్ల కొమ్మల్లోని వజినిక  తో ధనం దొరుకుతుందని… వీటికోసం తిరిగి,  రకరకాల మోసాలకు గురై ఇళ్ళమ్ముకున్న వారు, ఉద్యోగాలు ఊడ గొట్టుకున్న వారు, ఆస్తులు పోగొట్టుకున్న వారు, అప్పులపాలై ఆత్మ హత్యలు చేసుకున్నవారు ఎందరో. ఇండియా లో ఐతే ఈ ముఠాల వెనక ఒక భూతవైద్యుడు తప్పకుండా ఉంటాడు.
భూతవైద్యులు తమ మోసాలను అమలు చేసేందుకు  ఒక్కొక్కడు ఒక్కో రకమైన ప్రచారాన్ని  తమ అనుచరుల ద్వారా ప్రచారం చేయి స్తుంటాడు. రాత్రికి రాత్రే  కోటీశ్వరులం కావాలనుకునే మానసిక దౌర్భల్యం ఉన్నవారు, అత్యాశాపరులే  వీరి టార్గెట్. అటువంటి వారే వీరి 420 ప్రచారాలను గుడ్డిగా నమ్మి వీటి కోసం తిరిగి తిరిగి  వారి బుట్టలో పడతారు.  వీరి  ఆశ  ఒక్కటే… వీటి ద్వారా స్వల్ప వ్యవధిలోనే  కోటీశ్వర్లమై పోవాలని.
ఇప్పుడు ఈ కోవకే  చెందిన ఒక కొత్త మోసం తెరమీదకు వచ్చింది. అదే… కోట్లు కుమ్మరించే  “రెడ్ మెర్క్యూ రి  కాప్ సూల్” . 40ఏళ్ల క్రితం నాటి పాత టీవీ, రేడియో, ఫోన్ లలో ఎర్రటి ద్రావణం గల కాప్సూల్ ఉంటుందని…ఈ ద్రావణం చాలా ఖరీదైందని  , దీన్ని అంతరిక్ష ప్రయోగాల్లో, అణు బాంబుల  తయారీలో ఉపయోగిస్తారని,ఇది ఎక్కడా దొరకదని,  దీనితో “కరోనా” క్షణాల్లో తగ్గుతుందని…దీని ఖరీదు కోట్లలో ఉంటుందని  కొన్ని నెలల క్రితం కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది.

దీంతో యాభై ఏళ్ల క్రితం నాటి పాత టీవీలు, రేడియోలు, టెలిఫోన్ ల లో “ఎర్రటి ద్రావణం (రెడ్ మెర్క్యూరీ )ఉండే”  కాప్ సూల్  కోసం  పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పాత టీవీలు, రేడియోలు, టెలిఫోన్లకోసం జనాలు వెతుకులాటలో మునిగారు.ముఖ్యంగా యువత ఈ క్యాప్సూల్ కోసం పాత టీవీలు,పాత రేడియోల కోసం మెకానిక్ షాపుల్లో వెతుకుతున్నారు. చదువు రానివారే కాక  చదువుకున్న వారు, ఉద్యోగులు, విద్యావంతులు, బడా బడా రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కోటీశ్వరులు, కొందరు పోలీసులు కూడా… ఈ అవివేకపు ప్రచారాన్ని నమ్మి “రెడ్ క్యాప్సూల్ ” కోసం వెతుకుతున్నారు. మూడేండ్ల కిందటే కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో “రెడ్ మెర్క్యూరీ” వైరలయ్యింది.

* రెడ్ మెర్క్యూరీ అనేది ఉందా ?
మెర్క్యూరీ (పాదరసం) ఉంది. కానీ రెడ్ మెర్క్యూరీ అనేది లేదు. ఇది వట్టి బూటకం. ఆఫ్గనిస్తాన్ కేంద్రంగా పనిచేసే కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులు భారీగా నిధులు సమీకరించుకునేందుకు, రెడ్ మెర్క్యూరీని “ఆటం బాంబు”తయారీలో ఉపయోగిస్తారని  2000 సంవత్సరంలో గల్ఫ్ దేశాల్లో  మోసపూరితంగా తెరపైకి తెచ్చిన కల్పిత ప్రచారం. రెడ్ మెర్క్యూరీ అనేది లేదని, టెర్రరిస్టులు సృష్టించిన అభూతకల్పన అని అమెరికా అంతర్జాతీయ రక్షణ విభాగంలో పనిచేసే జాన్ అర్ బోల్టన్ 2002లో జరిగిన “న్యూక్లియర్ అండ్ రేడియోలాజికల్ సెక్యూరిటీ “సమావేశంలో స్పష్టం చేశారు. అప్పటినుండి రెడ్ మెర్క్యూరీ కథ క్రమక్రమంగా ప్రపంచంలోని అన్నిదేశాలకూ పాకింది.

రెడ్ మెర్క్యూరీ ముఠా బారినపడి బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ 35 లక్షలు పోగొట్టుకున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన ఓ ప్రజాప్రతినిధి గుప్త నిధుల వేటలో 20ఎకరాల భూమిని పోగొట్టుకున్నాడు. రవీంద్రఖని -బొక్కలగుట్ట వద్ద ఉన్న గాంధారి మైసమ్మ గుట్ట వద్ద గుప్త నిధుల వేటగాళ్లు నిత్యం సంచరిస్తుంటారు. వరంగల్ కు చెందిన ఓ మాజీ ఉద్యోగి లంకె బిందెల కోసం తవ్వి తవ్వి 10లక్షలు మునిగాడు. మందమర్రి లో నెలకు లక్ష రూపాయల జీతం ఉన్న ఓ సింగరేణి ఉద్యోగి బంగారం కోసం గుట్టల వెంట, పాడుబడిన గుళ్ల వెంట తిరిగి తిరిగి అప్పులపాలయ్యాడు.
అప్పనంగా సంపాదించుకుందామనుకునే వారున్నంత కాలం… మోసగాళ్ల పంటపండుతూనే ఉంటది.
–శ్రీరాముల కొంరయ్య