https://oktelugu.com/

Telangana state: సమిష్టి పనితనం … తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంస్కృతి.. అహ్వానిద్దాం!

ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా సీఎం రేవంత్, మంత్రులు కలిసి చర్చించి.. తర్వాత నిర్ణయానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 28 నుంచి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు.

Written By:
  • NARESH
  • , Updated On : January 8, 2024 3:42 pm
    New-culture-in-Telangana-st
    Follow us on

    Telangana state: ‘తెలంగాణలో గడీల పాలన పోయింది.. ప్రజా పాలన ప్రారంభమైంది. ప్రజల మాటకు విలువనిచ్చే ప్రభుత్వం వచ్చింది. సలహాలు, సూచనలు స్వీకరిస్తా.. సమస్యలు పరిష్కరిస్తాం. సమష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం’ ఇవీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రమాణస్వీకారం రోజు చెప్పిన మాటలు. చెప్పినట్లుగానే తెలంగాణ పాలనలో మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీని సరిగ్గా(జనవరి 7 నాటికి) నెల రోజులు. నెల రోజుల పాలనలోనే ప్రజలకు సంతృప్తికరమైన పాలనా విధానం కనిపించింది. ప్రమాణ స్వీకారం రోజే ప్రగతి భవన్‌ గేట్లు బద్ధలు కొట్టడం.. మహాతా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌గా పేరు మార్చడం.. యావత్‌ తెలంగాణ సమాజం స్వాగతించింది. ఇందులో ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ నేతలూ ఉన్నారు. ఇక, కొలువు దీరిన రెండు రోజులకే ఎన్నికల సమయంలో ఇచ్చిన రెండు హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించారు. ఇక, వారంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఇందులో రాష్ట్రంలో ఇప్పటి వరకు నెలకొన్న పరిస్థితులపై స్వేత పత్రాలు విడుదల చేశారు. ఆర్థిక పరిస్థితి, విద్యుత్‌ అంశాలను కీలకంగా తీసుకున్న ప్రభుత్వం ఈ రెండింటిపై ప్రత్యేక దృష్టిసారించింది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో సభ ముందు పెట్టారు. అప్పులు ఇందులో ప్రధానంగా మారాయి. ఇక విద్యుత్‌ సంస్థలను కేసీఆర్‌ సర్కార్‌ ఎలా దివాలా తీయించింది.. ఎన్నికోట్లు అప్పులు చేసింది. ఎన్ని కోట్లు బకాయిలు ఉంది అని వివరించింది. తద్వారా పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్‌రెడ్డి.

    సమష్టిగా నిర్ణయాలు..
    ఇదిలా ఉండగా ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా సీఎం రేవంత్, మంత్రులు కలిసి చర్చించి.. తర్వాత నిర్ణయానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 28 నుంచి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు. ఇందుకు అంతా సమావేశమై చర్చించి విధి విధానాలకు ఆమోదం తెలిపారు. ఇక ఎన్నికల ముందు కుంగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులను తీసుకుని మేడిగడ్డకు వెళ్లారు. ప్రాజెక్టును సందర్శించి అక్కడే ప్రాజెక్టు తాజా పరిస్థితిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ చేయించారు. దీంతో ప్రాజెక్టుపై ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేశారు.

    ఉప ముఖ్యమంత్రితో కలిసి ప్రధాని వద్దకు..
    ఇక తెలంగాణలో మరో కొత్త సంప్రదాయానికి రేవంత్‌ శ్రీకారం చుట్టారు. గతం సీఎం కేసీఆర్‌ ప్రధాన మంత్రి వద్దకు వెళ్లడానికే వెనుకాడారు. ఆయనకు ముఖం చూపించలేకపోయారు. రేవంత్‌రెడ్డి మాత్రం తాను సీఎం అయిన నెల రోజుల్లోనే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ ప్రాజెక్టులు, విభజన హామీలపై చర్చించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విశేషం ఏమిటంటే రేవంత్‌ ఒక్కరే ఢిల్లీ వెళ్లకుండా తన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా తీసుకెళ్లారు. గతంలో కేసీఆర్‌ పదేళ్లలో ఒక్క రోజు కూడా ఉప ముఖ్యమంత్రులను తీసుకెళ్లిన దాఖలాలు లేవు.

    మంత్రులతో కలిసి మళ్లీ..
    తాజాగా రెండోసారి ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌ ఈసారి మంత్రులు, అధికారులను తీసుకెళ్లారు. ఈసారి హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు యూపీఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ను కలిశారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా, పెండింగ్‌ నిధుల మంజూరు, టీఎస్‌పీఎస్పీ ప్రక్షాళణ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి ఐపీఎస్‌లు కావాలని అమిత్‌షాను కలిసి కోరారు. రక్షణ మంత్రి రాజనాథ్‌సింగ్‌ను కలిసి కంటోన్‌మెంట్‌ భూములపై చర్చించారు. సైనిక్‌ స్కూల్‌ మంజూరు చేయాలని కోరారు.

    పారిశ్రామిక వేత్తలతో సమావేశం..
    రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక వేత్తలతో కూడా రేవంత్‌రెడ్డి ఒక్కరే సమావేశం కావడంలేదు. ఈ సమావేశానికి కూడా మంత్రులను పిలుస్తున్నారు. ఇటీవల ఫాక్స్‌కాన్‌ ప్రతినిధితోపాటు సీఐఐ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పారిశ్రామికాభివృద్ధికి, పెట్టుబడులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

    ‘సీతారామ’పై సమీక్ష..
    తాజాగా ఆదివారం సీతారామ ప్రాజెక్టుపైనా మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 1.60 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని, ఇందుకు రూ.70 కోట్లు ఖర్చవుతాయని లెక్కలు వేశారు. ఈ సమీక్షలో మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ఈ ఎన్ సీ మురళీధర్‌ తదితరుల పాల్గొన్నారు.

    = కొమురవెళ్లి మల్లన్న కళ్యాణానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు.

    = కేసీఆర్‌ ఆస్పత్రిలో ఉంటే.. సీఎం రేవంత్‌ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయన జారిపడిన రోజు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటు చేయించారు. ఆరోగ్య శాఖ కమిషనర్‌ను అప్రమత్తం చేసి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు.

    ఇలా పాలనతో సమిష్టితత్వం ప్రదర్శిస్తూ రేవంత్‌ నెల రోజుల పాలన ప్రజలను సంతృప్తిపర్చిందని చెప్పవచ్చు.

    నెల రోజుల పాలనపై ట్వీట్‌..
    ఇదిలా ఉండగా తన నెల రోజుల పాలనపై రేవంత్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ‘రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తాను’ అని పేర్కొన్నారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం సంతృప్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ, పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, అన్నగా నేనున్నానని రేవం త్‌ భరోసా ఇచ్చారు. నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. మన ఆడబిడ్డల ముఖాల్లో ఆనందాలు చూస్తూ, రైతుకు భరోసా ఇస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందన్నారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ, మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.