https://oktelugu.com/

వీడని మిస్టరీ.. సచిన్ వాజే, హిరెన్ మధ్య మంతనాలు.. సీసీ ఫుటేజీలో రికార్డు

ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసు జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగి విచారిస్తుండగా.. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్న సస్పెండ్ అయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజేకు చెందిన మరో రెండు లగ్జరీ కార్లను అధికారులు సీజ్ చేశారు. ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో స్కార్పియో వాహనాన్ని నిలిపి, బెదిరింపులకు దిగిన కేసులో సచిన్ వాజే కీలక నిందితుడు. అధికారులు సీజ్ చేసిన రెండు […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 19, 2021 / 02:15 PM IST
    Follow us on


    ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసు జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగి విచారిస్తుండగా.. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్న సస్పెండ్ అయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజేకు చెందిన మరో రెండు లగ్జరీ కార్లను అధికారులు సీజ్ చేశారు. ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో స్కార్పియో వాహనాన్ని నిలిపి, బెదిరింపులకు దిగిన కేసులో సచిన్ వాజే కీలక నిందితుడు. అధికారులు సీజ్ చేసిన రెండు కార్లలో ఒక కారు రత్నగిరికి చెందిన శివసేన నాయకుడు విజయ్ కుమార్ గణపట్ భోస్లే పేరుతో రిజిస్టర్ అయి ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది.

    Also Read: తమిళనాడులో తెలుగోళ్ల ఓటు ఎటు?

    ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో స్కార్పియో వాహన యజమానిగా పోలీసులు విచారించిన మన్సుఖ్ హిరెన్ హత్యకు గురికావడంతో, స్కార్పియో వాహనాన్ని ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే వినియోగించారని అతని భార్య ఆరోపించడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సచిన్ వాజేను అరెస్ట్ చేసిన పోలీసులు, ముకేశ్ అంబానీ ఇంటి ముందు కారు నిలిపి బాంబు బెదిరింపు కేసులో కూడా సచిన్ వాజేది కీలక పాత్ర అని నిర్ధారించారు.

    మూడు రోజుల క్రితం సచిన్ వాజేకు చెందిన మెర్సిడెస్ బెంజ్ కారు సీజ్ చేసిన అధికారులు ఈ కేసు దర్యాప్తు కావలసిన కీలక ఆధారాలను సేకరించారు. ముఖేష్ అంబానీ ఇంటి వద్ద నిలిపిన స్కార్పియో వాహన నంబర్ ప్లేట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఎన్ఐఏ అధికారులు ఫిబ్రవరి 17న హిరెన్‌ను సచిన్ వాజే కలిసినట్టు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించారు. పోర్టు వద్ద జీపీఓ సమీపంలో వారిద్దరూ కలిసినట్టు దాదాపు పది నిమిషాలు మాట్లాడుకున్నారని ఆ ఫుటేజీలో రికార్డయింది.

    Also Read: బీసీలకే ప్రాధాన్యం ఇస్తే.. బీసీ ఓట్లు ఎందుకు పడలే బాబు గారూ..!

    ఇక సచిన్ వాజే కదలికలను గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అధికారులు ముంబై పోలీసు ప్రధాన కార్యాలయం నుండి సచిన్ వాజే మన్సుఖ్ హిరెన్‌ను కలవడానికి వెళ్లినట్లుగా గుర్తించారు. ఫిబ్రవరి 17వ తేదీన తన వాహనంలో ముంబై పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి సీఎస్ఎంటీ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆపిన సచిన్ వాజే కారులో మన్సుఖ్ హిరెన్ ఎక్కారు. జీపీవో వద్ద ఆ వాహనాన్ని పార్క్ చేసి పది నిమిషాలపాటు మాట్లాడుకున్న తరువాత హిరెన్ కారు దిగి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో ములంద్ ఐరోలి రహదారిపై తన వాహనం పాడైందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా హిరెన్ పోలీసులకు తెలిపారు. కానీ.. సచిన్ వాజే విషయాన్ని మన్సుఖ్ హిరెన్ ఎక్కడా ప్రస్తావించలేదు. అంతకుముందు కూడా సచిన్ వాజే మన్సుఖ్ హిరెన్ ను తనను కలవడానికి రావాలని చెప్పగా ఓలా క్యాబ్ ఎక్కి హిరెన్ సచిన్ వాజేను కలవడానికి వెళ్లారు. ఈ లోపు ఐదుసార్లు వాజే హిరెన్ కు కాల్ చేశారని ఓలా క్యాబ్ డ్రైవర్ చెప్పారు. మొత్తంగా కేసు రోజుకో మలుపు తిరుగుతుండడంతో అటు ఎన్‌ఐఏ ఆఫీసర్లకు కూడా అంతుబట్టడంలేదు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్