Margadarsi Case: మార్గదర్శి విషయంలో కొత్త కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి.. ఇప్పటివరకు ఖాతాదారులు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో తమ సంస్థ సుద్ద పూస అని రామోజీరావు పదేపదే చెప్పుకుంటూ వచ్చాడు. కానీ సిఐడి అధికారులు చెబుతున్న సమాచారం మాత్రం విస్తు గొలుపే విధంగా ఉంది. వాస్తవానికి ఖాతాదారుల నుంచి సేకరించిన డిపాజిట్ల విషయంలో 50% మార్గదర్శి ఖాతాల్లో, మిగతా 50 శాతం ఫోర్ మెన్( బ్రాంచ్ మేనేజర్) ఖాతాల్లో జమ చేసినట్టు తెలుస్తోంది. అయితే బ్రాంచ్ మేనేజర్ల ఖాతాల్లో జమ చేసిన సొమ్ముకు తమ అజమాయిషీ లేదని మార్గదర్శి సంస్థ వాదిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఖాతాదారులు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు కాబట్టి తమ మీద చర్యలు తీసుకునే అధికారం ఎవరికీ లేదని మార్గదర్శి చెబుతుండడం విస్మయానికి గురిచేస్తోందని వారు అంటున్నారు. “అగ్రిగోల్డ్, సహారా, సత్యం వంటి సంస్థల మీద ఎటువంటి ఫిర్యాదులు అందలేదు. అలాంటప్పుడు ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా ఉన్నాయా? లేకుంటే ఆ సంస్థలకు ప్రత్యేకమైన అధికారాలు ఏమైనా ఉంటాయా? ఎటువంటి ఫిర్యాదులు లేకపోయినప్పటికీ అందులో జరిగిన ఆర్థిక అవకతవకలను గుర్తించి దర్యాప్తు సంస్థలు నిజాలు బయటపెట్టాయి. అలాంటి వాటిపై చర్యలు తీసుకున్నప్పుడే మిగతా సంస్థలు ఆర్థిక అక్రమాలకు పాల్పడవు.” అని పలుగురు ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇలాంటప్పుడు మార్గదర్శి కూడా తాను వసూలు చేసిన డిపాజిట్లు మొత్తం స్టాక్ మార్కెట్లో అత్యధికంగా రిస్క్ ఉండే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
కొత్త చట్టం గాని తీసుకొచ్చారా?
వాస్తవానికి చిట్ఫండ్ వ్యాపారం నిర్వహించే సంస్థలు కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు కచ్చితంగా పాటిస్తాయి. కానీ మార్గదర్శి ఈ విషయంలో మాత్రం ఆ నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తమ సంస్థలపై ఎటువంటి ఫిర్యాదు లేనందువల్ల ప్రభుత్వానికి చర్యలు తీసుకునే అవకాశం లేదని మార్గదర్శి చెబుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆర్థికవేత్తలు అంటున్నారు. అలాంటప్పుడు బోర్డు తిప్పేసిన అనేక కంపెనీల మీద ఎటువంటి ఫిర్యాదులు ప్రభుత్వానికి అందలేదు. కానీ తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడం వల్ల అవి రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేశాయి. అలాంటప్పుడు వారిని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.. కానీ ఈ విషయంలో మార్గదర్శి అడ్డంగా వాదిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. సంస్థ డిపాజిట్లు సేకరిస్తుంది, అందులో 50% తన సొంత ఖాతాలోకి మళ్లించుకుంటుంది. మిగతా 50 శాతం సొమ్మును బ్రాంచ్ మేనేజర్ల ఖాతాలోకి బదిలీ చేస్తున్నది. అంటే 50% సొమ్ముకు మాత్రమే గ్యారెంటీ ఇస్తోంది.. మరి మిగతా 50 శాతం సొమ్ము పరిస్థితి ఏంటని అడిగితే నీళ్లు నములుతోందని ఏపీ సిఐడి అధికారులు చెబుతున్నారు. ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడనప్పుడు సంస్థ డిపాజిట్లు సేకరించడం లో అర్థం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు.
పొలో మంటూ డబ్బులు ఇవ్వాలా?
“మార్గదర్శి చెప్పినప్పుడు ఖాతాదారులు పొలోమంటూ డబ్బులు డిపాజిట్ చేయాలి. వారు చెప్పినట్టు తీసుకోవాలి. అవసరానికి అడిగితే డబ్బులు ఇవ్వరు. ఇలాంటప్పుడు ఎవరికీ ఫిర్యాదు చేయకూడదు. ప్రభుత్వాలు చర్యలు తీసుకోకూడదు. ఎటువంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. రామోజీరావు పద్మ విభూషణ్ తీసుకున్నారు కాబట్టి ఆయనకు ఖచ్చితమైన అధికారాలు ఉంటాయి. వాటిని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు” అనే రీతిగా వ్యవహారం సాగుతోందని చిట్ ఫండ్ రంగ నిపుణులు అంటున్నారు. ఇలాంటప్పుడు ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడటం ప్రభుత్వ విధి అని, అందు గురించే రంగంలోకి దిగి విచారణ చేస్తున్నదని వారు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించి మార్గదర్శి సంస్థకు ఏమైనా అభ్యంతరాలు గనక ఉండి ఉంటే దానిని కోర్టులో చెప్పాలని వారు హితవు పలుకుతున్నారు. అంతేగాని మార్గదర్శ సంస్థకు ప్రత్యేకమైన అధికారాలు అంటూ ఉండవని వారు స్పష్టం చేస్తున్నారు. కొద్దిరోజులు హడావిడి తర్వాత మళ్లీ చర్చలోకి రావడంతో.. హైకోర్టు మార్గదర్శి కేసుకు విచారణ జరపనున్న నేపథ్యంలో .. ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంది.