Neera Cafe Hyderabad: గ్రామీణులకు మాత్రమే దొరికే తాజా తాటి నీరా.. నేటి నుంచి హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లో నిర్మించిన నీరా కేఫ్‌ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. ఈ కేఫ్ నిర్మాణానికి దాదాపు రూ.13 కోట్లు ఖర్చు చేశారు. నగర వాసులతోపాటు పర్యాటకుల కోసం నీరా కేఫ్ ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
500 మంది కూర్చునేలా..
ఈ నీటా కేఫ్‌లో దాదాపు 300 నుంచి 500 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ఏడు స్టాల్స్ అందుబాటులో ఉంచనుండగా.. వీటిల్లో తాటి, ఈట చెట్ల నుంచి తీసిన స్వచ్ఛమైన నీరాను విక్రయిస్తారు. గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా కేఫ్ పైకప్పును తాటి ఆకు ఆకారం వచ్చేలా తయారుచేశారు. కేఫ్ చుట్టూ తాటి చెట్లను పెట్టడంతోపాటు వాటికి మట్టి కుండలను కట్టారు. అలాగే కేఫ్ దగ్గర బోటింగ్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. నీరా కేఫ్ నుంచి బుద్ధుడి విగ్రహం వరకు బోటింగ్ ఏర్పాటు చేశారు.
టేక్ అవే కూడా..
ఈ నీరా కేఫ్‌లో టేక్ అవే సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ తొలి నీరా కేఫ్ నగర వాసులకు సరికొత్త అనుభూతికి అందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేఫ్‌లో స్టాల్స్ నిర్వహణ బాధ్యతలను గౌడ సంఘం నేతలకు మాత్రమే ప్రభుత్వం అప్పగించనుంది. దీని ద్వారా గీత కార్మికులు ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారని ప్రభుత్వం ఆశిస్తోంది. గౌడ కులవృత్తిని అందరికీ తెలియజేసేలా చేయడంతోపాటు వారి అభివృద్ధికి తోడ్పడేందుకు తొలిసారి ఎక్కడా లేని విధంగా నీరా కేఫ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
చాలా మందికి ఇష్టం..
తాటి, ఈత చెట్ల నుంచి ప్రకృతి సిద్ధంగా వచ్చే నీరాను తాగేందుకు చాలామంది ఇష్టపడతారు. సహజసిద్ధంగా ఏర్పడే ఈ పానీయాన్ని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఎన్నో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. క్యాల్షియం, ఐరన్, పాస్పరస్, పోటాషియం, ప్రోటీన్, షుగర్, విటమిన్ సి లాంటి ఎన్నో పోషక విలువలు నీరాలో ఉంటాయి. ఇవి తీసుకోవడం ద్వారా మధుమేహం, కొవ్వు, కాలేయం, గుండె సమస్యలు తొలగిపోతాయని అంటారు. నగరవాసులకు నీరాను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ కేఫ్‌ను ఏర్పాటు చేసింది.