Citizenship: ఉన్నత చదువుల కోసం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వెళ్తున్నవారు.. తర్వాత అక్కడే పార్ట్‌టైం జాబ్ చేసుకుంటున్నారు. చదువు పూర్తి కాదానే.. ఉద్యోగవేటలో పడుతున్నారు. మంచి ఉద్యోగం వచ్చిన వారు అక్కడే స్థిరపడే ఆలోచన చేస్తున్నారు. ఇక కొందరు కంపెనీ వీసాలపై విదేశాలకు వెళ్తున్నారు. నాలుగైదేళ్లు రాకపోకలు సాగిస్తూ ఉద్యోగం చేస్తున్నారు. తర్వాత అక్కడే స్థిరపడాలని భావిస్తున్నారు. దీంతో ఏడేళ్లుగా భారత్‌ను వీడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గడచిన ఐదేళ్లలో సుమారు 9 లక్షల మంది భారతీయ పౌరసత్వం వదులుకోవడమే ఇందుకు నిదర్శనం.
2020 నుంచి ఇలా..
2020లో 85,256 మంది నుంచి 2022లో 2.25 లక్షల మంది వరకు భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2023లో 2.16 లక్షలు, 2024లో 2.06 లక్షల మంది భారతీయ పౌరసత్వం రద్దు చేసుకున్నారు. ఐదేళ్లలో మొత్తం 8.97 లక్షల మంది భారతీయులు విదేశీ పౌరసత్వాలు స్వీకరించారు. కోవిడ్ తర్వాత ఈ లెక్కలు రెట్టింపు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రధాన కారణాలు ఇవీ..
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఉన్న అధిక జీతాలు, మెరుగైన జీవన ప్రమాణాలు యువతను ఆకర్షిస్తున్నాయి. భారతదేశంలో ఉన్న 1.4% సూపర్ రిచ్ తరగతి కూడా డ్యూయల్ సిటిజన్‌షిప్ లేకపోవడం, గ్లోబల్ మొబిలిటీ కోసం పౌరసత్వం వదులుకుంటున్నారు. టీసీఏ (ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్) వంటి విధానాలు ఎన్నారైలపై ఒత్తిడి పెంచాయి.
ఆర్థిక ప్రభావం..
ఐటీ, హెల్త్‌కేర్, ఇంజినీరింగ్ వృత్తుల్లో నైపుణ్యాలు కోల్పోతున్నామని ఆందోళన. అయితే 100 బిలియన్ డాలర్ల్ల రెమిటెన్స్‌లు ఆర్థికానికి మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రతిభావంతులు విదేశాల్లో భారత్ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు. లాంగ్ టర్మ్‌లో ఆర్–డీ, స్టార్టప్ ఇన్నోవేషన్‌లు తగ్గే ప్రమాదం ఉంది.
ప్రభుత్వ చర్యలు..
ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులు డ్యూయల్ లాభాలు కల్పిస్తున్నాయి. ’ప్రవాసి భారతీయ దివస్’ వంటి కార్యక్రమాలు ఎమోషనల్ కనెక్షన్‌ను బలోపేతం చేస్తున్నాయి. అయితే పౌరసత్వ చట్ట సవరణలు, ట్యాక్స్ సర్సెషన్‌లు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.