Narender Reddy
Narender Reddy : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి భవిష్యత్ కార్యచరణ ఏంటనే విషయం రాజకీయవర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎన్నికల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేందర్ రెడ్డి పార్టీ పరిస్థితిపై వ్యక్తీకరించిన కొన్ని అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే ఆయన భవిష్యత్ కార్యచరణ లీలగా గోచరిస్తుంది. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ, పార్టీ పటిష్టతకు పాటుపడుతానని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల సంరంభంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో అనుకున్న స్థాయిలో నాయకులు, కార్యకర్తల్లో జోష్ కనిపించలేదని, అందుకు ప్రధానంగా నాయకత్వ లేమి కారణమని నర్మగర్భంగా తెలిపారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే కరీంనగర్ లో ఆ వాతావరణం కనిపించలేదని అన్నారు. ఆ లోటు పూడ్చేందుకు కరీంనగర్ కు ప్రాతినిధ్యం వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఉటంకించిన కొన్నిఅంశాలను పరిశీలిస్తే ఆయన ఎంత బలంగా అడుగులు వేస్తున్నారో తెలిసిపోతుంది. ఏ ప్రాంతంలో పార్టీలో లొసుగులు ఏమేరకు ఉన్నాయనే విషయంలో అనుభవపూర్వకంగా పరిశీలించిన ఆయన ఒక నివేదికను అధిష్టానానికి అందజేస్తున్నట్లు ప్రకటించడం వెనుక ఆంతర్యం బోధపడుతుంది. నివేదికపై అధిష్టానం స్పందించే తీరుపై ఆయన భవిష్యత్ ఆధారపడి ఉంటుందనేది నిర్వివాదంశం. అయితే పార్టీ నరేందర్ రెడ్డిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చనేది నివేదిక అందించిన అనంతరం తేలిపోతుంది.
ఈ ఓటమి ఎవరికి లాభం.?
Also Read : కాంగ్రెస్‌కు అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి ప్లస్సా? మైనస్సా?ఈ ఎన్నికల వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం కన్నా, నాయకత్వ లేమితో కకావికలమైన కరీంనగర్ సెగ్మెంట్ కు మాత్రం నరేందర్ రెడ్డి రూపంలో ఒక బలమైన నాయకుడిని పరిచయం చేసింది. ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి అధిష్టానం తప్పు చేసిందని భావించిన వారి చెంప చెల్లుమనిపించేలా తన సత్తా ఏంటో చూపించాడు. గెలుపు చివరి అంచుల వరకు వెళ్లి సాంకేతిక కారణాలతో ఓటమి పాలయ్యారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, నాయకుల తీరుతెన్నులు, కార్యకర్తల మనోభావాలు మాత్రం అధిష్ఠానానికి తేటతెల్లమయ్యాయి. గెలుపోటములు పక్కనబెడితే ఈ ఎన్నికలు అభ్యర్థికి ఎనలేని అనుభవాన్ని తెచ్చిపెట్టింది. నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో ఏవిధంగా మెలగాలో పాఠాలు నేర్పింది. నాయకుడిగా ఏవిధంగా ముందుకు వెళ్లాలో దిక్సూచిగా నిలిచింది. పోల్ మేనేజ్ మెంట్ లో చేసిన చిన్న, చిన్న తప్పిదాలను భవిష్యత్ లో ఎలా అధిగమించాలో ప్రయోగాత్మకంగా చూపించింది. ఎన్నికలు జరిగిన మిగతా జిల్లాలలోని నియోజకవర్గాలతో పోలిస్తే కరీంనగర్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఇటు అభ్యర్థి, అటు పార్టీ పెద్దలు కూడా గ్రహించారు. కరీంనగర్ లో నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశలో నరేందర్ రెడ్డికి పార్టీ అధిష్టానం ఆ బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలంటే ఒక బలమైన నాయకుడు అవసరమని అధిష్టానం భావిస్తోంది. ఈ తరుణంలో ఆ బాధ్యతలను నరేందర్ రెడ్డికి అప్పగిస్తారా అనే విషయమై పార్టీ క్యాడర్ లో చర్చ ఊపందుకుంది. ఇరువర్గాలను సమన్వయం చేసుకుంటూ భవిష్యత్ లో పార్టీని బలోపేతం చేయగలిగే నేర్పు ఉండాలి. ఒకవైపు బీజేపీ ఎంపీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, మరోవైపు సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాయకత్వాలను సవాల్ చేస్తూ పార్టీ క్యాడర్ ను ముందుకు నడిపించగలిగే సత్తా ఉండాలి. రాబోయే స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఏ విధమైన వ్యూహరచనతో ముందుకు వెళతారనే దానిపై మాత్రమే అధిష్ఠానం ఆ బాధ్యతలను ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి అప్పగించే అవకాశాలుంటాయి. అయితే ప్రస్తుతం కరీంనగర్ కు పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు అనుకున్న స్థాయిలో తమ ప్రాభవాన్ని చాటుకోలేకపోవడంతోనే పార్టీ ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకుల అభిప్రాయం. ఆ లోపాలు సరిదిద్దే ప్రక్రియలో భాగంగా నాయకులు వరుసగా చేస్తున్న ప్రయత్నాలు, ప్రయోగాలు ఫలితాలను ఇవ్వడం లేదు. అందరిని ఒకేతాటిపై తీసుకువచ్చేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన నాయకున్ని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ఎప్పటి నుంచో మొదలయ్యాయి. అందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయ్యినట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో పార్టీ ఏవిధంగా నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
Also Read : ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు -?