MLA quota MLC : ఏపీలో( Andhra Pradesh) ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నడుస్తోంది. ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో మూడు ఎమ్మెల్సీ పదవులు కూటమికే దక్కనున్నాయి. ఇప్పటికే జనసేన అభ్యర్థిగా మెగా బ్రదర్ నాగబాబు నామినేషన్ వేశారు. మరోవైపు టిడిపి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో బిజెపికి ఒక ఎమ్మెల్సీ పదవిని కేటాయించింది. అయితే ఆ పార్టీలో విపరీతమైన ఆశావాహులు ఉన్నారు. దీంతో పదవి దక్కించుకునేందుకు వారు పావులు కదుపుతున్నారు.
Also Read : ఇండియన్ టీంతో జనసేనకు పోలిక.. నాగబాబు సంచలన కామెంట్స్!
* తెరపైకి పివిఎన్ మాధవ్ పేరు
అయితే ప్రధానంగా ఉత్తరాంధ్రాకు చెందిన పివిఎన్ మాధవ్( pvn Madhav) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీసీ వర్గానికి చెందిన ఆయనకు చాన్స్ తప్పకుండా దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీగా పదవి ఆశిస్తున్నారు. ఆయనకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ హై కమాండ్ సైతం ఆయన విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
* హై కమాండ్ కు విన్నపం
మరోవైపు ఎమ్మెల్సీగా సోము వీర్రాజు( Somu Veerraju ) తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని హై కమాండ్ కు విన్నవిస్తున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రాజమండ్రి ఎంపీ స్థానాన్ని ఆశించారు. కానీ చివరి నిమిషంలో అక్కడ బిజెపి రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి పోటీ చేశారు. అటు అసెంబ్లీ సీటు ఇచ్చినట్టే ఇచ్చి.. వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల్లో సైతం సోము వీర్రాజు పేరు బయటకు రాలేదు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలు ఉన్న సోము వీర్రాజు ఎట్టి పరిస్థితుల్లో తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే సోము వీర్రాజు విషయంలో టిడిపి నుంచి అనేక అభ్యంతరాలు ఉన్నాయి.
* టిడిపి వ్యతిరేక ముద్ర..
బిజెపి రాష్ట్ర చీఫ్( BJP AP chief ) గా సోము వీర్రాజు వ్యవహరించారు. ఆ సమయంలో టిడిపిని దారుణంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమన్న ముద్ర పడిపోయారు. ఈ క్రమంలోనే మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ విషయంలో సైతం ఆయన చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. గతంలో టిడిపి హయాంలోనే ఆయనకు ఆ పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్సీ పదవిని కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల టిడిపికి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు. పైగా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు తెలిసిన బిజెపి పెద్దల ద్వారా ఎమ్మెల్సీ పదవి పొందేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు సోము వీర్రాజు. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Also Read : ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ ముగ్గురు.. చంద్రబాబు సంచలనం.. ఆ నిర్ణయాలు వెనుక కారణం అదే!