Nara Lokesh Padayatra: నారా లోకేష్ యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో కొనసాగుతోంది. కుప్పంలో జనవరి 27న యాత్ర ప్రారంభించిన లోకేష్ 200 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.
లోకేష్ నడవలేరు అన్నారు. ఆయనకు అంత సీన్ లేదని తేల్చేశారు. మధ్యలో యాత్ర ఆగిపోతుందని ప్రచారం చేశారు. అయినా సరే మొక్కవోని దీక్షతో లోకేష్ యాత్ర నిర్విరామంగా ముందుకు కొనసాగుతుండడం విశేషం.ఇప్పటివరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 185 మండలాలు, 1675 గ్రామాల మీదుగా 2710 కిలోమీటర్ల మేర యాత్రను పూర్తి చేశారు. రోజుకు సగటున 13.5 కిలోమీటర్ల దూరం నడుస్తూ ముందుకు సాగుతున్నారు లోకేష్.
తెలుగు నాట ఎంతోమంది పాదయాత్రలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి,చంద్రబాబు నాయుడు,షర్మిల, జగన్ ఇలా అందరూ నడిచారు. ఎవరికి వారుగా తమ ముద్ర వేసుకున్నారు. అటు తర్వాత పాదయాత్రకు దిగిన లోకేష్ పై ఎన్నెన్నో సెటైర్లు పడ్డాయి. కానీ ఆయన అదరలేదు బెదరలేదు.. ముందుకు సాగుతూనే ఉన్నారు. విపక్ష నేతగా ఉన్న జగన్ పాదయాత్ర వారానికి ఐదు రోజులు మాత్రమే సాగేది. ఒకరోజు కోర్టుకు, మరో రోజు విశ్రాంతికి.. మధ్యలో కాళ్ల బొబ్బల కథలు, వాటికి వైద్యులు చేస్తున్న ట్రీట్మెంట్ల ను కథలుగా చెప్పుకునేవారు. కానీ అందుకు విరుద్ధంగా లోకేష్ యాత్ర కొనసాగుతోంది. నిర్విరామంగా ముందుకు కదులుతోంది. అసలు పాదయాత్ర చేయలేడు అన్న లోకేష్.. 2700 కిలోమీటర్ల నడిచి చూపించారు. అసలు మాట్లాడడం రాదన్న లోకేష్ ఘాటైన ప్రసంగాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. పాదయాత్రకు ఆశించిన స్థాయిలో ఆదరణ రాకపోయినా
.. లోకేష్ తనపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు.