
రాష్ట్రంలో రాజకీయ అలజడి రేపిన ఈ.ఎస్.ఐ స్కామ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు చుట్టుకోనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐకి సంబంధించి మందులు, పరికరాలు, టెలీమెడిసిన్ వంటి విషయాల్లో టెండర్లు పిలువ కుండా నామినేషన్ పద్దతిలో పనులు కేటాయించడం వల్ల నాయకులు అధికారులు ఆర్ధికంగా లబ్ధిపొందారనేది ఏసీబీ విచారణలో తేలిందని అధికారులు చెబుతున్నారు. ఈ స్కామ్ లో రూ.150 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ వెల్లడించింది. ఇందులో 19 మంది ప్రమేయం ఉందని తేల్చారు. నామినేషన్ల విధానంలో పనులు కేటాయించే విషయంలో అచ్చెన్నాయుడితో పాటుగా మరో మాజీ మంత్రి ప్రమేయం ఉన్నట్టు అధికారులు వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది.
నామినేటెడ్ పనులు డి.ఐ. ఎం.ఎఫ్ డైరెక్టర్లు రమేష్ కుమార్ కు చెందిన సంస్థ తోపాటు, ఇతర సంస్థకు కేటాయించి తద్వారా హవాలా ద్వారా నగదు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. నామినేటెడ్ పనులు తాను చెప్పిన సంస్థకు ఇవ్వండి అని మాజీ మంత్రి లోకేష్ చెప్పారని చర్చ జరుగుతోంది. మరోవైపు అచ్చెన్న ఆదేశాల మేరకు తాము డీఐఎంఎస్ డైరెక్టర్ అయిన రమేష్ కుమార్ కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చినట్టు విచారణలో ఈ.ఎస్.ఐ ఉన్నతాధికారులు అంగీకరించినట్లు సమాచారం.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంలో ఇంత తీవ్రంగా స్పందించడానికి ఇదే కారణమటున్నారు. బాబు అచ్చెన్న వ్యవహారాన్ని కిడ్నాప్ గా అభివర్ణించడం, బీసీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వెనుక ఈ కేసు విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా ఉంటుందనే భావిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అచ్చెన్నాయుడుకు, అయన కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడే ప్రయత్నం చేసినా సాద్యం కాలేదు.
ఈ.ఎస్.ఐ కేసులో కాకపోయినా మాజీ మంత్రి నారా లోకేష్ ను ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులోనైనా లోకేష్ అరెస్ట్ తప్పదనే వాదనలు ఉన్నాయి. ఫైబర్ గ్రిడ్ టెండర్లు, పనుల్లో అప్పట్లో ఐటి శాఖ మంత్రిగా పని చేసిన లోకేష్ కేంద్ర బిందువుగా ఉన్నారు. చైనా నుంచి సెటాప్ బాక్స్ లు కొనుగోలు చేసిన సమయంలో అధిక ధరలు చెల్లించారని అప్పతో అసెంబ్లీలో సైతం వైసీపీ ఈ అంశాన్ని లేవనెత్తింది. ఫైబర్ గ్రిడ్ పనుల్లో అవినీతి చోటు చేసుకుందని నిర్ధారించిన మంత్రి వర్గ ఉపసంఘం తన నివేదికను నిన్నే ముఖ్యమంత్రి జగన్ కు అందజేసింది. ఈ అంశంపై దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.