
Nara Lokesh- Brahmani: యువగళం పాదయాత్రంలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మన స్టార్స్ అనే యూట్యూబ్ చానల్ నిర్వహించిన ఓపెన్ డిబేట్ లో పాల్గొన్న ఆయన తన సతీమణి బ్రహ్మణీకి ఎలా దొరికిపోయోరో వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. పోలీసులు ప్రస్తుతం ఆయన యాత్రకు బ్రేక్ వేశారు. ఈ క్రమంలో మన స్టార్స్ అనే యూ ట్యూబ్ చానల్ ఓపెన్ డిబేట్ నిర్వహించింది. ఆయన స్వవిషయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికల గురించి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.
ముఖ్యంగా ఆయన బరువు తగ్గి నాజుగ్గా కనబడుతున్నారని, దీనికి కారణమేంటి అని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. ‘‘ లాక్ డౌన్ లో నారా బ్రహ్మణీకి దొరికిపోయా. ఆమె నా డైట్ గురించి చాలా కేర్ తీసుకుంది. ఇంతకు ముందు ఏదిపడితే అది తినేసేవాడిని. అప్పడు అలా కుదరలేదు. నేను ఇలా తయారవ్వడానికి కారణం ఆమె. నాలో చాలా మార్పు తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు వాట్సాప్ లో అలెర్ట్ చేస్తుంటుంది. నిన్న చాలా తినేశారు. ఈ రోజు కంట్రోల్ చేయండి అని చెప్తుంటుంది’ అని సమాధానమిచ్చారు.

ఇక, తనపై రాష్ట్రం గురించి బాధ్యత పెరిగిందని అన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉందని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అవినీతి అరాచకాలు ఎక్కువై పోయాయని, దాదాపు 12 లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. దీనిపై సంవత్సరానికి అయ్యే వడ్డీని ప్రజలపై వేస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. యువతకు ఉద్యోగాల్లేవని, ధరలు మండిపోతున్నాయని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పుకొచ్చారు. పాలిచ్చే ఆవును కాదనుకొని, తన్నే దున్నపోతును ఆంధ్ర రాష్ట్రంలో తెచ్చుకున్నామని ఎద్దేవా చేశారు.