Nara Lokesh Padayatra
Nara Lokesh Padayatra: నారా లోకేష్ పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది.తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఈ ఘనత సాధించారు. 219 రోజుల్లో 3006 కిలోమీటర్లు నడిచి లోకేష్ రికార్డు సృష్టించారు. నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో అడుగుపెట్టనున్నారు. దాదాపు మరో ఆరు రోజులు పాటు నడిచి భీమిలిలో తన యాత్ర ముగించనున్నారు.
ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. తొలుత రాయలసీమలో యాత్ర పూర్తి చేసుకున్నారు. తరువాత కోస్తాలో అడుగుపెట్టారు. అయితే ఎన్నెన్నో అవరోధాలను దాటుకొని ముందుకు సాగారు. తొలి రోజు తారకరత్న అనారోగ్యానికి గురయ్యారు. అక్కడకు కొద్ది రోజులకే చనిపోయారు. ఆ సమయంలో ఒకరోజు పాటు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. మధ్యలో రెండు సార్లు కోర్టు విచారణకు హాజరయ్యే క్రమంలో పాదయాత్ర బ్రేక్ పడింది. అయితే చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో సెప్టెంబర్ 9న కోనసీమ జిల్లాలో లోకేష్ పాదయాత్ర నిలిచిపోయింది. చంద్రబాబు అరెస్ట్, బెయిల్ తదనంతర పరిణామాలతో దాదాపు రెండు నెలలకు పైగా లోకేష్ పాదయాత్ర నిలిచిపోవడం విశేషం. గత నెల 24న పాదయాత్ర తిరిగి ప్రారంభించిన లోకేష్.. షెడ్యూల్ ను కుదించారు. నాలుగు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాల్సి ఉన్నా.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కొనసాగించాల్సి ఉన్నా.. షెడ్యూల్ కుదించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.
అయితే తనను తాను ఒక నాయకుడిగా క్రియేట్ చేసేందుకు ఈ పాదయాత్ర లోకేష్ కు ఎంతగానో దోహద పడింది. ప్రారంభ సమయంలో పనిగట్టుకొని నీలి మీడియాతో పాటు కూలి మీడియా ప్రచారం కల్పించింది. వందలాదిమంది ఇంటలిజెన్స్ పోలీసుల నిరంతర నిఘా, 1500 మందితో వైసిపి సోషల్ మీడియా, లోకేష్ మాటల్లో చిన్నపాటి తేడా వస్తే రోల్ చేయడం, ఆయన ఇమేజ్ ను దిగజార్చేందుకు ప్రయత్నించడం వంటివి.. లోకేష్ కు ఎనలేని ప్రచారాన్ని తీసుకొచ్చాయి. దారి పొడవునా వైసీపీ నేతలు ఇబ్బందులు పెట్టినా.. ఆయనకు సహనాన్ని నేర్పించాయి. మంచి అనుభవాన్ని ఇచ్చాయి. చంద్రబాబు తర్వాత పార్టీలో లోకేష్ అని గుర్తించుకునే స్థాయికి ఆయన తాపత్రయపడ్డారు. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యారు.
గతంలో జగన్ తో పాటు ఆయన సోదరి షర్మిల పాదయాత్ర చేశారు. అయితే జగన్ స్థాయిలో లోకేష్ పాదయాత్రకు రెస్పాన్స్ రాలేదని టిడిపి శ్రేణులే చర్చించుకుంటున్నాయి. ఇది ప్రతికూల ప్రభావం చూపుతోంది. పార్టీ శ్రేణులను తట్టి లేపే ప్రసంగాలు కానీ, ప్రజలను ఆలోచింపజేసే మాటలు కానీ.. లోకేష్ చెప్పలేకపోయారని ఒక ప్రచారం మాత్రం ఉంది. అయితే టిడిపికి భావి నాయకుడిగా చూపించడానికి చంద్రబాబు లోకేష్ తో పాదయాత్ర చేయించారని.. ఈ సుదీర్ఘ పాదయాత్రతో పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని టిడిపి సీనియర్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో లోకేష్ పాస్ మార్కులు అయితే వచ్చాయి కానీ.. అంతకుమించి ప్రశంసలు రాకపోవడం లోటే.