Nara Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారు. గత కొద్దిరోజులుగా లోకేష్ పాదయాత్ర చేస్తారని ప్రచారం జరుగుతూ వస్తోంది. అక్టోబరు 2న గాంధీ జయంతి నాడు ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారని కూడా టాక్ నడిచింది. గతంలో చంద్రబాబు గాంధీ జయంతి నాడే తన పాదయాత్రను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. తండ్రి యాత్రకు కొనసాగింపుగా లోకేష్ అదే రోజు నుంచి పాదయాత్ర చేస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు షెడ్యూల్ మారింది. దానికి కాస్తా అటు ఇటుగా ముహూర్తం చూసి లోకేష్ పాదయాత్రకు టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వెలువడ్డాయి. సీఎం జగన్ ముందస్తుకు వెళుతున్న సన్నాహాలు కనిపించాయి. ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచన లేనట్టు కనిపిస్తోంది. దీంతో లోకేష్ పాదయాత్రపై టీడీపీ నేతలు పునరాలోచనలోపడ్డారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లే అవకాశముండడంతో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటి వరకూ లోకేష్ పాదయాత్ర ఉండాలని భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంతో పాదయాత్ర ముగించడానికి ప్లాన్ చేస్తున్నారు.

సుదీర్ఘంగా ఉండేలా ప్లాన్…
ఏపీలో లోకేష్ సుదీర్ఘ పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుం వరకూ దాదాపు 450 రోజుల పాటు పాదయాత్ర చేయాలని సంకల్పించారు. ఈ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేసే పనిలో టీడీపీ నాయకులు ఉన్నారు. 2023 జనవరిలో యాత్ర ప్రారంభించి 2024 మార్చిలో ముగించేందుకు వీలుగా.. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కవరయ్యే విధంగా రూట్ మ్యాప్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభానికి మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. నాడు జగన్ తన తండ్రి సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన పులివెందుల నుంచి పాదయాత్ర ప్రారంభించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా లోకేష్ అదే సెంటిమెంట్ ను ఫాలో కావడం విశేషం.
జనవరి 26న ప్రారంభం
2024 జనవరి 26న అంటే రిపబ్లిక్ దినోత్సవం నాడు లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. కుప్పం టూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ సుదీర్ఘ కాలం పాటు యాత్ర కొనసాగనుంది. టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో ఎక్కువ రోజు షెడ్యూల్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. నియోజకవర్గంలోపరిస్థితులపై అధ్యయనం.. అవసరమైన సలహాలు, సూచనలు అందేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అటు పార్టీ పరంగా వెనుకబడిన నియోజకవర్గాలపై కూడా లోకేష్ ఫోకస్ పెంచనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఎన్నికలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.పార్లమెంట్ జిల్లాల వారీగా ప్రచారం పూర్తిచేశారు. బాదుడే బాదుడు, మినీ మహానాడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన దృష్టంతా లోకేష్ పాదయాత్రపైనే పెట్టారు. రూట్ మ్యాప్ సిద్ధం చేయడంలో తలమునకలై ఉన్నారు.

జగన్ రికార్డులు చెరిపే యత్నం…
లోకేష్ తన పాదయాత్రతో సీఎం జగన్ రికార్డులను చెరిపేయ్యాలన్న ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. నాడు విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాదయాత్ర చేశారు. దాదాపు 134 నియోజకవర్గాలను కవర్ చేస్తూ…341 రోజుల్లో 3,648 రోజుల పాటు పాదయాత్ర చేశారు. కడప జిల్లాలోని పులివెందులలో ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించారు. రికార్డు క్రియేట్ చేసుకున్నారు. 2019 ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకూ పాదయాత్ర కొనసాగింది. కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభల్లో జగన్ పాల్గొన్నారు. ఇప్పుడు లోకేష్ కూడా అదే ఫాలవ్వనున్నారు. జగన్ కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పాదయాత్రతో పాటు ఎక్కువ దూరం ఉండేలా చూసుకుంటున్నారు. 450 రోజుల పాటు పాదయాత్ర జరిపేలా ప్లాన్ చేస్తున్నారు. పార్టీలో పట్టు పెంచుకునేందుకు లోకేష్ కు ఇదో మంచి అవకాశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలతో మమేకం కావడం, వారి పరిస్థితులను క్షేత్రస్తాయిలో తెలుసుకోవడం, కీలక ప్రసంగాలు చేయడం వంటి వాటితో లోకేష్ రాజకీయ పరిపక్వత సాధిస్తారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అక్టోబరు నుంచి పవన్ బస్సు యాత్ర, జనవరి నుంచి లోకేష్ పాదయాత్రతో ఎన్నికలకు ఏడాది ముందే ఏపీలో రాజకీయాలు హీటెక్కించనున్నాయి.