Nara Lokesh Vs Posani
Nara Lokesh Vs Posani: తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలపై నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరి నేతలపై పరువు నష్టం దావా వేశారు. తాజాగా పోసాని కృష్ణ మురళితో పాటు సింగళూరు శాంతి ప్రసాద్ అనే వ్యక్తిపై కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు లోకేష్ శుక్రవారం మంగళగిరి కోర్టు హాజరుకానున్నారు. దీంతో ఒక్కరోజు పాటు యువగళం పాదయాత్రకు బ్రేక్ తీసుకోనున్నారు.
గత కొద్ది రోజులుగా లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ వైసీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొందరైతే వ్యక్తిగత కామెంట్లకు సైతం దిగుతున్నారు. లోకేష్ కు చెడు అలవాట్లు ఉన్నాయని కూడా ఆరోపిస్తున్న వారు ఉన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత ఇదే మాదిరిగా ఆరోపణలు చేశారు. లోకేష్ కు మద్యం అలవాటు ఉందని కూడా చెప్పుకొచ్చారు. దీంతో గత నెలలో పోతుల సునీతతో పాటు మరో వైసీపీ నేతపై న్యాయ పోరాటానికి దిగారు. అప్పట్లోవాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు హాజరయ్యారు.
ఇటీవల పోసాని కృష్ణ మురళి గ్రేట్ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కంతేరు లో నారా లోకేష్ 14 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపించారు. దీనిపై లోకేష్ స్పందించారు. తనకు కంతేరులో అర ఎకరం భూమి కూడా లేదని.. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని క్షమాపణ చెప్పాలని తన లాయర్ ద్వారా నారా లోకేష్ నోటీసులు పంపారు. ఇలా రెండు సార్లు పంపిన నోటీసులకు పోసాని నుంచి ఎటువంటి సమాధానం లేదు. దీంతో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు లోకేష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
చుండూరు సాయి ప్రైమ్ 9యూట్యూబ్ ఛానల్ లో నిర్వహించిన ఒక చర్చ కార్యక్రమంలో సింగలూరు శాంతి ప్రసాద్ అనే వ్యక్తి లోకేష్ పై ఆరోపణలు చేశారు.ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ఏజెన్సీ నుంచి లోకేష్ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.ఆ విషయం తన స్నేహితుడి ద్వారా తెలిసిందని చెప్పుకొచ్చారు.దీనిపై కూడా శాంతి ప్రసాద్కు లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. ఎటువంటి వివరణ, క్షమాపణ చెప్పకపోవడంతో లోకేష్ కోర్టును ఆశ్రయించారు.
ఈ రెండు కేసుల్లో ఫిర్యాదుదారుడుగా నారా లోకేష్ ఉన్నారు. దీంతో ఆయన వాంగ్మూలం ఇచ్చేందుకు మంగళగిరి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరు కానున్నారు. కోర్టుకు హాజరవుతున్న దృష్ట్యా లోకేష్ తన పాదయాత్రకు ఒక్కరోజు విరామం ప్రకటించారు. తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తే న్యాయ పోరాటం చేస్తానని లోకేష్ గతంలో ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కోర్టులో కేసులు వేస్తున్నారు.