Nara Lokesh: పోయిన చోటే వెతుక్కోవాలంటారు.ఎక్కడ పడ్డామో అక్కడే నిలబడాలంటారు. అయితే గత ఎన్నికల్లో మంగళగిరిలో అపజయం పాలైన నారా లోకేష్ ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి మరోసారి బరిలో దిగేందుకు నిర్ణయించుకున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని కసితో ప్రయత్నిస్తున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నా.. ఏదో సమయంలో మంగళగిరిని మాత్రం వదలడం లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీచేసిన లోకేష్ కు ఓటమి తప్పలేదు. సాక్షాత్ ముఖ్యమంత్రి తనయుడిగా, మంత్రిగా బరిలో దిగినా ఫలితం లేకపోయింది. అయితే ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ ఎదుగుదలకు ఓటమి ఒక అడ్డంకిగా నిలిచింది. తొలిసారి పోటీచేసి ఓడిపోయిన లోకేష్ అంటే ఒకరకమైన చులకన భావం ఏర్పడింది. ఎన్నో రకాల అవమానాలు, రకరకాల వ్యాఖ్యలు అయితే మాత్రం వేదించాయి. వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డ లోకేష్ తన నాయకత్వ పటిమను పెంచుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు. అదే సమయంలో తాను వచ్చే ఎన్నికల్లో పోటీచేయనున్న మంగళగిరిపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే లోకేష్ లో పరిణితి కనిపిస్తున్నా.. చంద్రబాబులా చొరవ మాత్రం కనిపించకపోవడం మైనస్ గా మారింది.
Nara Lokesh
మంగళగిరిలో యువనేత బిజీబిజీ
తాజాగా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రజలను నేరుగా కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న మట్టి, బురద రహదారులు,వీధులను దాటుకుంటూ ఆయన పర్యటన సాగింది. వృద్ధులు, మహిళలు ఆయనతో ఫోటోలు, సెల్పీలు దిగేందుకు ఆసక్తికనబరిచారు. లోకేష్ కూడా వారితో మమేకమయ్యేందుకు ప్రయత్నించారు. ఓపికగా వారితో గడిపారు. వారికి కుశల ప్రశ్నలు వేసి ముచ్చటించారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు కొంతమంది తమ సమస్యలను ఏకరవు పెట్టారు. ఈ సమయంలో స్పందించిన లోకేష్ వెంటవెంటనే తోపుడు బళ్లు తెప్పించారు. వారికి అందించారు. దీంతో చిరు వ్యాపారులు ఎంతగానో సంతోషించారు. కానీ అక్కడున్న వారిలో మాత్రం భిన్న స్పందన కనిపించింది. రాష్ట్ర స్థాయి నేత సమస్యలపై స్పందించినప్పుడు, దాతృత్వం చూపించినప్పుడు స్థాయిని చూపించాలి. కానీ ఒక ఐదారు తోపుడు బళ్లు తెప్పించి ఇవ్వడం చర్చనీయాంశమైంది. లోకేష్ తీరుపై సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పనిచేసేటప్పుడు తమ స్థాయి చూసుకోవాల్సిన అవసరముంటుందని.. కానీ లోకేష్ చిరు వ్యాపారుల విషయంలోస్పందించడం అభినందనీయమే కానీ.. వందలాది మంది సమస్యలను వదిలి.. ఐదారుగురికి ఇవ్వడమేమిటన్న ప్రశ్న అయితే మాత్రం ఉత్పన్నమవుతోంది.
గత అనుభవాలతో…
అయితే లోకేష్ ను మాత్రం మంగళగిరి ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. గడిచిన ఎన్నికల్లో లోకేష్ ను ఓడించామన్న బాధ మాత్రం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. రాజధాని ప్రాంతీయులుగా తప్పుచేశామన్న బాధ మాత్రం వారిలో వ్యక్తమవుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పరిణామాలను వారు గుర్తు చేసుకుంటున్నారు. జగన్ సర్కారు తమ ఆశలను తుంచేసిందన్న ఆక్రోషంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ మంగళగిరిపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచారు. ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో లోకేష్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో చేనేత కుటుంబాలు అధికం, వారిని ప్రభుత్వం ఏ విధంగా దగా చేస్తుందో లోకేష్ వివరిస్తున్నారు.వారి అభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో కొంతవరకూ సఫలీకృతమయ్యారు.