Nara Lokesh Padayatra: నారా లోకేష్ పాదయాత్రం వంద కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. భారీ జనసందోహం నడుమ యాత్ర సాగుతోంది. ప్రజల ముందు తనను తాను ఆవిష్కరించడంతో పాటు టీడీపీని అధికారంలోకి తేవాలన్న కసితో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ప్రభుత్వం ఎక్కడికక్కడే ఆంక్షల రూపంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. దారిపొడవునా ఎక్కడికక్కడే కేసులు కూడా నమోదు చేయిస్తోంది. అయితే ఈ విషయంలో వైసీపీ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. పాదయాత్ర ఫలాలు టీడీపీకి దక్కకుండా చేయాలని ఒక పద్ధతి ప్రకారం లోకేష్ ను డీ గ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అటు వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు, నేతల ఎదురుదాడి చూస్తే ఇది ఇట్టే అర్ధమైపోతోంది. ఈ విషయంలో లోకేష్ కానీ జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం పాదయాత్ర ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆది నుంచి లోకేష్ ను ఎన్నివిధాలా డీగ్రేడ్ చేయ్యాలో అన్నిరకాలుగా చేశారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం అయితే ఆయన ఫొటోలు, వ్యాఖ్యలను మార్షింగ్ చేసి మరీ ప్రజల్లో ఒకరకమైన అనుమానాలను ప్రేరిపించగలిగింది. అయినా వాటన్నింటినీ తట్టుకొని లోకేష్ నిలబడగలిగారు. ముందుగా తనను తాను ఆవిష్కరించుకుంటే తప్ప.. ఈ విమర్శలకు చెక్ చెప్పలేనని భావించి పాదయాత్రకు సిద్ధమయ్యారు. సుమారు 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయాలన్న సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడే వైసీపీ తన వ్యూహం ప్రారంభించింది. పాదయాత్రలో దారిపొడవునా లోకేష్ చేసే విమర్శలు ప్రజల్లోకి డైవర్ట్ కాకుండా జాగ్రత్త పడుతోంది. లోకేష్ పై వ్యక్తిగత విమర్శల దాడిని ప్రారంభించింది. వాటికి లోకేష్ కౌంటర్ ఇచ్చేలా ప్లాన్ రూపొందించింది. ఫలితంగా ప్రజా సమస్యలు లైమ్ లైట్ లోకి రాకూడదన్నది వైసీపీ నేతల భావన.
ప్రస్తుతం వైసీపీ సర్కారుపై ప్రజా వ్యతిరేకత పెల్లుబికుతున్న మాట వాస్తవం. టీడీపీ అధినేత కుమారుడిగా, భావి నాయకుడిగా లోకేష్ ను తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన పాదయాత్ర చేస్తుండడంతో విపరీతమైన ప్రజాదరణ రావడం సర్వ సాధారణం. అందుకే ఇటువంటి సమయంలో వీలైనంత త్వరగా ప్రసంగాల జోలికి లోకేష్ వెళ్లకపోవడమే మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు, జగన్ లతో పోల్చుకుంటే లోకేష్ వక్త కాదు. పైగా మాట్లాడే క్రమంలో డొల్లతనం బయటపడుతుంది. దానినే ప్రత్యర్థి సోషల్ మీడియా హైప్ చేస్తుంది. అందుకే దారిపొడవునా తనకు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజల ఇతిబాధలు తెలుసుకొని భరోసా ఇవ్వాలే కానీ.. ప్రసంగాలు చేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని, కొడాలి నాని లోకేష్ పాదయాత్రను చిన్నదిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. లోకేష్ కామెంట్స్ ను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒక నాయకుడే కాదన్న స్థితిలో మాట్లాడుతున్నారు. అయితే వారు యధాలాపంగా అన్న మాటలు కావు. ఒక వ్యూహత్మకంగా లోకేష్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. గతం నుంచి లోకేష్ విషయంలో అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగిస్తున్నారు. ఇటువంటి సమయంలో లోకేష్ నుంచి వచ్చే ప్రతీ మాట విలువైనదే. అందుకే చంద్రబాబు ఈ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.