Chandrababu :టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ అసెంబ్లీ సాక్షిగా సంచలన శపథం చేశారు. నిండు సభలో తనను, తన భార్యను అవమానించేలా మాట్లాడిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తూ సంచలన ప్రకటన చేశారు. ఇక తాను మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తానని.. అప్పటివరకూ అసెంబ్లీలో అడుగు పెట్టనని శపథం చేశారు.
చంద్రబాబు భార్యను వ్యక్తిగతంగా కించపరుస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శలు చేయడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోయారు. దీనిపై తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాక పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు.. లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంట్లో మహిళలను కూడా వదలకుండా వ్యక్తిగత దాడిచేయడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పాలిట జగన్ భస్మాసురుడిగా మారారని చంద్రబాబు విమర్శించారు. ప్రజల కోసం తాను ఇంటికి రాకుండా ఎంత కాలం పనిచేసినా తన భార్య ప్రోత్సహిస్తోందని చెప్పారు.
ఇక తన ప్రవర్తనపై సభాపతి తమ్మినేని కూడా ఆలోచించాలని.. తన మైక్ కట్ చేస్తున్నారని.. తన కింద మంత్రిగా చేసిన గౌరవం కూడా లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవంగా బతికే వాళ్లను అవమానిస్తారా? అని ఆవేదన చెందారు. అవతలివారు బూతులు తిడుతున్నా సంయమనం పాటిస్తున్నామన్న చంద్రబాబు తనకు బూతులు రాక తిట్టలేక కాదు.. అది తమ విధానం కాదని కన్నీళ్ల పర్యంతం అయ్యారు.
తన రాజకీయ జీవితంలో ఇంత బాధ ఎప్పుడూ భరించలేదని చంద్రబాబు ఏడ్చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తాను ఎవరిని కించపరచలేదని.. ప్రతిపక్షంలో కూర్చుండబెట్టినా బాధ్యతగా భావించానని వివరించారు. ఇది కౌరవ సభ.. గౌరవం లేని సభ అంటూ తీవ్ర ఆవేదనతో మాట్లాడారు. గతంలో వైఎస్ తన తల్లిని అవమానించి సారీ చెప్పాడని.. ఇప్పుడు తన భార్యను జగన్ ఎమ్మెల్యేలు అవమానించారని చంద్రబాబు ఆవేదన చెందారు.