
Nara Brahmini : నారా బ్రాహ్మిణి.. పరిచయం అక్కర్లేని పేరు. తనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకున్నారు ఆమె. చంద్రబాబు కోడలిగా, లోకేష్ భార్యగానే కాకుండా ఓ పారిశ్రామికవేత్తగా తనను తాను నిరూపించుకున్నారు. త్వరలో ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె ఓ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఇందుకు చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అదే వాస్తవమైతే 2024 ఎన్నికల్లో నందమూరి, నారా కుటుంబం నుంచి మరో వారసురాలు రాజకీయ యవనికపై వెలుగొందే చాన్స్ ఉంది.
2024 ఎన్నికలు టీడీపీకి, చంద్రబాబుకు కీలకం. ఒక విధంగా చెప్పాలంటే జీవన్మరణ సమస్య. అందుకే చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక వైపు లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్నారు. దాదాపు 400 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. మరోవైపు చంద్రబాబు ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ముందుగా లోక్ సభ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు వీలైనంత ఎక్కువగా ఎంపీ స్థానాలను గెలుచుకొని కేంద్రంలో యాక్టివ్ రోల్ పోషించాలని భావిస్తున్నారు. అందుకే ఎంపీ స్థానాల కోసం గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్నారు. తద్వారా పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలపై ప్రభావం చూపే నేతలను వెతికి పట్టుకునే పనిలో పడ్డారు.
ఈ నేపథ్యంలో విజయవాడ లోక్ సభ స్థానంపై చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనం వీచినా.. విజయవాడలో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయారు. అయితే ఎన్నికల అనంతరం ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి చర్చనీయాంశమైంది. చంద్రబాబుతో గ్యాప్ పెరిగింది. విజయవాడ, కృష్ణా జిల్లా టీడీపీ నేతలు కొందరితో ఆయనకు పొసగడం లేదు. దీంతో ఇక్కడ అభ్యర్థి మార్పుపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కేశినేని నాని సోదరుడు చిన్నికి ఇక్కడ టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఇంతలో అనూహ్యంగా నారా బ్రాహ్మిణి పేరు కూడా తెరపైకి వచ్చింది.
2019 ఎన్నికల్లో కూడా నారా బ్రాహ్మిణి పేరు వినిపించింది. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. అయితే తనకు బిజినెస్ అంటేనే ఇష్టమని..రాజకీయాలు, సినిమాలు ఇష్టముండవని అప్పట్లో తేల్చేశారు. అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ చేసిన బ్రాహ్మిణి హెరిటేజ్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. పరిశ్రమను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఆమె ఎంపీగా ఉంటే లోక్ సభలో టీడీపీకి ప్లస్ అవుతుందని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. అదే సమయంలో బ్రాహ్మిణి సైతం ప్రజాసేవకు సై అన్నారుట. అందుకే విజయవాడ పార్లమెంట్ స్థానం అయితే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారుట. అందుకే అక్కడ స్థితిగతులను ఎప్పటికప్పుడు సర్వే రూపంలో తెలుసుకుంటున్నారని టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కేశినేని నానిని తప్పించి.. ఆయన కుమార్తెను ఏదో ఒక అసెంబ్లీ సీటును సర్థుబాటు చేస్తారన్న ప్రచారం ఉంది. మొత్తానికైతే బ్రాహ్మిణి పొలిటికల్ ఎంట్రీ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.