Tarakaratna- Nara Lokesh: నందమూరి తారకరత్న క్రియాశీలక రాజకీయాల వైపు అడుగులేస్తున్నారు. ఏపీ నుంచి పోటీ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. తాజాగా నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఇరువురి భేటీలో తాజా రాజకీయాంశాలతో పాటు, వచ్చే ఎన్నికల్లో పోటీ పై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తారకరత్న ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. గుడివాడా..? గన్నవరమా ? అన్న చర్చ జరుగుతోంది.

టీడీపీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ బాటలో ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ నడిచారు. బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో హరికృష్ణ హిందూపురం శాసనసభ్యుడిగా గెలిచారు. వీరిద్దరూ తప్ప ఎన్టీఆర్ కుటుంబం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎవరూ రాలేదు. కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. ప్రస్తుతం నందమూరి మోహనకృష్ణ తనయుడు తారకరత్న రాజకీయాల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. సినిమారంగంలో సక్సెస్ కాకపోయినప్పటికీ రాజకీయరంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు.
ఇటీవల నారా లోకేష్ తో నందమూరి తారకరత్న భేటీ అయ్యారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే తారకరత్న ఏపీలో పోటీ చేస్తానని ప్రకటించడంతో ఈ భేటీకి ప్రాచుర్యం దక్కింది. తారకరత్న గెటప్ కూడ రాజకీయ నాయకుడిని పోలి ఉంది. లోకేష్ తో భేటీ సందర్భంగా తారకరత్న ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న అంశం పై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమైన గుడివాడను ఎంచుకోవాలా, కృష్ణా జిల్లా గన్నవరం నుంచి పోటీ చేయాలా అన్న అంశం పై చర్చ జరిగినట్టు సమాచారం. అయితే లోకేష్ మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. పార్టీ నిర్ణయం ప్రకారం ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తామని తేల్చిచెప్పినట్టు వినికిడి.

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి కొరకరాని కొయ్యాలు. జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు అన్న ప్రచారం ఉంది. కొడాలి నాని, వంశీని దెబ్బ కొట్టాలని టీడీపీ ఎదురుచూస్తోంది. ఇదే అదునుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడిని వారి పై పోటీకి దింపనుందా ? లేదా వేరొక నియోజకవర్గం నుంచి తారకరత్నను బరిలోకి దింపనుందా ? అన్న చర్చ టీడీపీలో జరుగుతోంది.