Nara Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం క్టిష్ట పరిస్థితుల్లో ఉంది. గతంలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2024 ఎన్నికలు చావో రేవో అన్నట్టు ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని భావిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. చంద్రబాబు వయసు పైబడుతోంది. కుమారుడు లోకేష్ ఉన్నా ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. దీంతో చంద్రబాబుకు చేయి అందించే వారే లేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పాత రాజకీయ చతురతను చంద్రబాబు పదును పెడుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీని ఏకతాటిపైకి తీసుకు రావడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలని భావిస్తున్నారు.
మరోవైపు పొత్తులకు పావులు కదుపుతున్నారు. నేను ఒక్కడిని కాదు నా వెంట నందమూరి కుటుంబం ఉంది అని ప్రజలకు తెలియజెప్పడం ద్వారా రాజకీయ మైలేజీ పెంచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు ఎదుర్కొన్న సవాళ్లు, సంక్షోభాలు, విజయాలు ఆయన మొక్కవోని ధైర్యం నుంచి వచ్చినవే. ఒక్క చంద్రబాబు. ఏం చేయగలడు అని నాడు ఎన్టీఆర్ భావించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చంద్రబాబుతో పాటు కొంతమంది నాయకులను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే అక్కడికి వారం రోజుల్లోనే చంద్రబాబు సీఎం పీఠంపై కూర్చున్నారు. నాడు చంద్రబాబుకు అంత నైతిక రాజకీయ బలం రావడం వెనక నందమూరి ఫ్యామిలీ మొత్తం వెంట ఉంది. ఉప్పూ నిప్పులా ఉండే అల్లుళ్ళు ఇద్దరూ కలిశారు.
Also Read: JD Laxminarayana: సీబీఐ మాజీ జేడీ దారెటు?
కుమారులూ కుమార్తెలు కూడా ఆ వైపునకు వచ్చారు. దాంతో ఎన్టీయార్ ఒంటరి అయ్యారు. పొలిటికల్ గేమ్ మారింది అంతే. అయితే సుమారు 27 సంవత్సరాల తరువాత ఇప్పుడు మరోసారి నందమూరి కుటుంబసభ్యుల అవసరం చంద్రబాబుకు పడింది. దీంతో చకచకా ఆయన పావులు కదపడం ప్రారంభించారు. అందర్నీ ఒకేతాటిపైకి తీసుకునే ప్రయత్నాలను వియ్యంకుడు, బావ మరిది నందమూరి బాలక్రిష్టకు అప్పగించారు.
‘కమ్మ’ పెద్దల ప్రయత్నం
అది ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కనుక అక్కడ చంద్రబాబు ఉన్నారా? లేదా మరొకరా? అన్నది చూడకూడదని కమ్మ సామాజికవర్గ పెద్దలు కొందరు కీలకంగా మారి నందమూరి కుటుంబసభ్యులతో చర్చలు జరుపుతున్నారు. ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఆయన భార్య పురందేశ్వరి బీజేపీ నాయకురాలిగా కొనసాగుతున్నారు. దీంతో 2024లో వెంకటేశ్వరరావును టీడీపీ వైపు మొగ్గు చూపేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన కొంత ఆసక్తి కనబరుచుతున్నట్టు సమాచారం. ఒకవేళ చంద్రబాబు ఆశిస్తున్నట్టు బీజేపీతో పొత్తు చిగురిస్తే పురందేశ్వరి ఎలాగూ టీడీపీకి దగ్గరైనట్టే. ఎన్టీయార్ కుమారులలో బాలయ్య ఇప్పటికే టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మిగిలిన వారు కూడా సరైన సమయంలో బయటకు వస్తారు అంటున్నారు. కుమార్తెలలో భువనేశ్వరి ఈసారి కీలక పాత్ర పోషిస్తారు అని అంటున్నారు.
అలాగే మనవళ్లలో హరిక్రిష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ జై టీడీపీ అంటున్నారు. జయక్రిష్ణ కుమారుడు చైతన్య క్రిష్ణ. మోహనక్రిష్ణ కుమారుడు తారక రత్న వంటి వారు ప్రచార పర్వంలోకి దూకుతారు అని చెబుతున్నారు. ఇప్పుడు కానీ పార్టీ గెలవకుంటే గడ్డు రోజులు దాపురిస్తాయని.. అసలు ఎన్టీఆర్ అన్న మాటే ఉండదని.. ఆయన స్థాపించిన పార్టీ ఉనికి లేకుండా పోతుందని కమ్మ సామాజికవర్గ పెద్దలు కుటుంబసభ్యులకు హితబోధ చేస్తున్నారు. ఇవి సత్ఫలితాలనిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భువనేశ్వరిపై ఇటీవల వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నందమూరి కుటుంబసభ్యులు ముక్తకంఠంతో తిప్పికొట్టారు. అప్పటి నుంచే ఆ కుటుంబం ఒక అభిప్రాయానికి వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ ప్రాపకానికి ప్రయత్నాలు
ఇక ఎన్నికల సమయానికి జూనియర్ ఎన్టీయార్ కూడా ఈ వైపునకు వచ్చేలా ఒక బలమైన సామాజికవర్గం నుంచి పావులు కదుపుతున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని.. పనిచేయాలని టీడీపీ మెజార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. కానీ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి ఉలుకూ లేదు.. పలుకూ లేదు. ప్రస్తుతం నా మనసంతా సినిమాలపై పెట్టానని ఎప్పటికప్పుడు ఇదే మాటను చెప్పి తప్పించుకుంటున్నారు.
పైగా వైసీపీలో కీలక నేతలుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలు జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులే. వారిద్దరూ ఇప్పుడు టీడీపీ, చంద్రబాబుపై ఒంటి కాలిపై లేస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేశారు. ఇదంతా జూనియర్ ఎన్టీఆర్ కి తెలియదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్నారన్న వార్తలు గుప్పు మంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన టీడీపీ వైపు వచ్చేందుకు ఒప్పుకుంటారా? అన్నది ప్రశ్నార్థకమే.
Also Read:AP Cabinet Expansion: క్యాబినెట్ నుంచి అవుట్?.. మంత్రి అవంతికి ఇక్కట్లు