Viral Video: బాలకృష్ణది ఫ్రెండ్లీ నేచర్ అంటారు. తోటి వారితో ఎంతో సరదాగా గడుపుతారు. సినిమా షూటింగ్ సమయంలో మిగతా యూనిట్ సభ్యులతో సందడి చేస్తారని పేరు ఉంది. కానీ ఇటీవల ఆయన అభిమానులపై కోపంతో రగిలిపోతున్నారు. వారు ఏ చిన్న తప్పు చేసినా చెంప చెల్లుమనిపిస్తున్నారు. చివరకు టిడిపి కార్యకర్తలకు సైతం బాలకృష్ణ దెబ్బల బెడద తప్పలేదు. తాజాగా ఓ దళిత కార్యకర్తపై బాలకృష్ణ దాడి చేసినంత పని చేశారని ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజెన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. బాలకృష్ణను తప్పుపడుతున్నారు.
అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఆ నియోజికవర్గం నుంచి బాలకృష్ణ పోటీ చేసి గెలుపొందారు. మూడోసారి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తరచూ ఆ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా కొద్ది రోజుల కిందట నియోజకవర్గంలో పర్యటించారు. ఓ ఇంట్లో కార్యకర్తలు, నేతలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి వీడియోలు తీశాడు. బాలకృష్ణకు అడ్డు తగిలాడు. దీంతో బాలకృష్ణ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సదరు కార్యకర్తపై చేయి చేసుకున్నారు. మాట్లాడుతుంటే అడ్డు తగులుతున్నావు ఎందుకు అంటూ ఆయనపై దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒకానొక దశలో దాడి చేసినంత పని చేశారు. అక్కడే ఉన్న నాయకులు వారించడంతో శాంతించారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలకృష్ణ దాడి చేసింది ఓ దళిత నేతపై అని వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. అయితే దీనిని ఎవరూ ధ్రువీకరించలేదని.. అటువంటప్పుడు దళిత నేత అని ఎలా చెబుతారని ప్రశ్నలు వస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల ముంగిట పాత వీడియోలను తీసి.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. అయితే ఇదే సమయంలో బాలకృష్ణ దూకుడు గురించి అంత చర్చ నడుస్తోంది. ఆయన పర్యటనలో భాగంగా అభిమానులతో పాటు టిడిపి శ్రేణులకు చెంప దెబ్బలు తప్పడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయన ఎక్కడికి వెళ్తున్నా ఈ తరహా ఆరోపణలు రావడం రివాజుగా మారిందని టిడిపి శ్రేణులు బాధపడుతున్నాయి. ఎన్నికల ముంగిట ఈ తరహా దూకుడు తగ్గించుకోవాలని కోరుతున్నాయి. అయితే ఒకరు చెబితే వినిపించే రకం బాలకృష్ణది కాదు. అందుకే ఆయన దూకుడు తగ్గించుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
ఒక దళితుడిని పట్టుకొని కొడుతున్న మెంటల్ బాలయ్య pic.twitter.com/GhrqHpaFEW
— Anitha Reddy (@Anithareddyatp) January 28, 2024