Congress: ఆ ఎలక్ట్రానిక్ మీడియాను అలా వదిలిపెట్టండి. ఆ సోషల్ మీడియాను కొంతసేపు పక్కన పెట్టండి.. ఇవ్వాళ్టికి జనంలో కాస్తో కూస్తో క్రెడిబుల్టీ ఉంది ప్రింట్ మీడియాకే. యాజమాన్యాలు రాజకీయంగా రంగులు ప్రచురిస్తున్నా సరే జనం కొద్దో గొప్పో చూస్తున్నారు. కానీ కొన్ని పత్రికలు రాస్తున్న రాతలు ఉన్న ఆ కాస్త నమ్మకాన్ని దూరం చేసేలా ఉన్నాయి.. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే.. ఈరోజు ఉదయం పేపర్ తిరిగేస్తుంటే నమస్తే తెలంగాణలో ఒక వార్త కనిపించింది. అది కూడా బ్యానర్ స్థాయిలో.. “హైదరాబాద్ కు కార్నింగ్ గుడ్ బై.. చెన్నైకి తరలిపోయిన వెయ్యి కోట్ల ప్లాంట్… ది ఎకనామిక్ టైమ్స్ పత్రిక కథనంతో కలకలం.. తెలంగాణలో ఏర్పాటు పై సెప్టెంబర్ లో సంస్థ ప్రకటన.. అంతలోనే తమిళ నాడుకు ప్లాంట్ తరలింపు పై నిర్ణయం.. చెన్నైకి తరలిపోతున్నది తెలంగాణ ప్లాంటే అని కంపెనీ వర్గాలు అంటున్నాయి” అని రాసుకు వచ్చింది.. వాస్తవానికి ఈ ప్లాంట్ తరలిపోతోంది అని నమస్తే తెలంగాణ ఎకనామిక్ టైమ్స్ కథనం ఆధారంగా రాసింది. సరే ఇదంతా నిజమే అనుకుందాం.. అలాంటప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనే డేట్ లైన్ ఎందుకు.. అంటే ఇందులోనే ఏదో దాగి ఉందని.. వాస్తవానికి ఇలాంటి వార్తలను రాసేటప్పుడు.. ముఖ్యంగా బిజినెస్ కు సంబంధించిన వార్తలు రాసేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక డేట్ లైన్ పెడతారు. కానీ ఇక్కడ టాస్క్ ఫోర్స్ బ్యూరో అని పెట్టినప్పుడే నమస్తే తెలంగాణ అసలు అంతరార్థం ఏమిటో అర్థమైంది. నమస్తే తెలంగాణ రాసిన తర్వాత గూగుల్, ఎకనామిక్ టైమ్స్ లో పరిశీలిస్తే తేటతెల్లమైంది ఏంటంటే.. కాంగ్రెస్ మీద బురదజల్లే ప్రయత్నం అని..
అసలేం జరిగిందంటే
భారత రాష్ట్ర సమితి చెబుతున్నట్టు కార్నింగ్ అనేది ఐటీ కంపెనీ కాదు. నమస్తే తెలంగాణ రాసినట్టు అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేయదు. ఈ కంపెనీ కేవలం యాపిల్ ఐఫోన్లకు గొరిల్లా గ్లాస్ తయారుచేస్తుంది. ఈ కంపెనీ 1951 లో ప్రారంభమైంది. దీనికి కేంద్ర కార్యాలయం న్యూయార్క్ లో ఉంది. ఈ సంస్థలో దగ్గర 56,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సంవత్సరానికి రెవెన్యూ 1.2 లక్షల కోట్లు ఉంటుంది. ఇది ప్రధానంగా సిరామిక్ సంబంధిత మెటీరియల్స్, గాజు తయారీ, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన గొరిల్లా గ్లాస్ తయారు చేస్తూ ఉంటుంది. అయితే ఈ కంపెనీ గత సెప్టెంబర్ లో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తామని ప్రకటించింది. అప్పట్లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. ఇందుకుగాను 1000 కోట్ల రూపాయలతో ప్లాంట్ కూడా నెలకొల్పుతామని ఆ కంపెనీ ప్రకటించింది. కానీ ఈ లోగానే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే.. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం వల్లే వెయ్యికోట్ల ప్లాంట్ హైదరాబాద్ కు గుడ్ బై చెప్పిందని గులాబీ మీడియా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దీనికి ది ఎకనామిక్ టైమ్స్ అనే పత్రిక రాసిన కథనాన్ని ఆధారంగా చేసుకుని బ్యానర్ వార్తగా కుమ్మేసింది. కానీ ఇలా రాసేటప్పుడు వాస్తవాలు పరిశీలించుకోవాలి కదా..

ఆ కంపెనీ ఏం చెబుతోంది
నమస్తే తెలంగాణ లో కార్నింగ్ కంపెనీ ప్లాంట్ హైదరాబాదులో పెట్టాల్సింది చెన్నైకి తరలించుకుపోతున్నట్టు రాసేసింది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ కంపెనీ తెలంగాణలో తన ప్లాంట్ ఏర్పాటుకు ముందు చెన్నై లేదా హైదరాబాదులో తన కార్యకలాపాలు సాగిస్తానని ప్రకటించింది. ఒకవేళ హైదరాబాదులో ప్లాంటు ఏర్పాటు చేయాలి అనుకుంటే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసికంలో ఆ పని పూర్తి చేస్తామని ప్రకటించింది. కాకపోతే అప్పుడు ఆ కంపెనీ చెన్నైలో ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని ఎందుకు చెప్పిందంటే.. ఆపిల్ కంపెనీకి సంబంధించిన అసెంబ్లింగ్ యూనిట్ చెన్నైలో ఉంది. ఆ కంపెనీ ఫోన్లకు గొరిల్లా గ్లాసులు కార్నింగ్ సరఫరా చేస్తుంది. అసెంబ్లింగ్ యూనిట్ అక్కడే ఉంది కాబట్టి తన ప్లాంట్ కూడా అక్కడే ఏర్పాటు చేస్తే రవాణా చార్జీలు కలిసి వస్తాయని కార్నింగ్ కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తెర వెనుక ఇన్ని విషయాలు మర్చిపోయి కేవలం బురద చల్లడమే పనిగా నమస్తే అడ్డగోలుగా వార్త రాయడం జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి పక్షం రోజులు కాకముందే ఇలా ఎదురుదాడికి దిగడం ఎంతవరకు సమంజసం అని వారు అంటున్నారు. స్థూలంగా చూస్తే మేము బురద చల్లుతాం మీరు కడుక్కోండి అనే విధంగా ఉందని వారు చెబుతున్నారు. నమస్తే తెలంగాణ వార్తకు కాంగ్రెస్ శ్రేణులు ఏ విధమైన కౌంటర్ ఇస్తాయో వేచి చూడాల్సి ఉంది.