Janasena : రాష్ట్రంలో బాధ్యత లేని ప్రభుత్వం..మానవత్వం లేని ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చేశారన్నారు. వరదలతో ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయి సంవత్సరం గడుస్తున్నా.. ముఖ్యమంత్రి ఇఛ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. వైసీపీ నాయకుల ఇసుక దోపిడీలోని ఒక్క రోజు ఆదాయాన్ని కేటాయిస్తే అన్నమయ్య డ్యాం జల విలయం బాధిత గ్రామాల ప్రజలు కోలుకునేవారు అన్నారు. అన్నమయ్య డ్యాం కూలిపోయి వరద ముంచెత్తి శనివారం నాటికి ఏడాది అయింది. జల విలయం ప్రభావిత గ్రామాల్లో నాదెండ్ల మనోహర్ , పార్టీ నేతలు పర్యటించి బాధిత ప్రజలను కలిశారు. దిగువ మందపల్లె, ఎగువ మందపల్లె, పులపుత్తూరు గ్రామాలలో పర్యటన సాగింది. ఆనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “వరద బాధితుల సమస్యల నేటికీ తీరలేదు. ఇక్కడి ప్రజలను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం చూపుతోంది. ఇక్కడి ప్రజల కష్టాలను ప్రపంచానికి తెలియ చెప్పేందుకు జనసేన పార్టీ తరఫున డిజిటల్ క్యాంపెయిన్ చేపడతాం. డిజిటల్ క్యాంపెయిన్ తర్వాత కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి బాధిత గ్రామాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.

• ఏ ఇంటికి వెళ్ళినా బాధలే…
ఏడాది క్రితం వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించాం. వాస్తవాలు ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లేందుకు మేము చేసిన ప్రయత్నానికి చాలా మంది స్పందించారు. ముందుకు వచ్చి దాతలుగా నిలబడ్డారు. మా జన సైనికులు కూడా బాధిత గ్రామాలకు అండగా నిలబడ్డారు. వరదలు వచ్చి సంవత్సరం పూర్తయ్యింది. ఇప్పటికీ వీరి జీవితాల్లో కనీసం ఒక భరోసా లేదు. కొంచం అయినా వెలుగు వచ్చేలా ప్రభుత్వం స్పందించలేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలా వ్యవహరిస్తుంటే పరిపాలన ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవాలి. ఏ ఇంటికి వెళ్లినా బాధలే వినబడుతున్నాయి.
ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కష్టాలు చెప్పుకొందామంటే 25 అడుగుల దూరంలో బాధితుల్ని పెట్టి మాట్లాడారు. ఆపదలో ఉన్నప్పుడు సమస్య ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవాలని మహిళలు ఎదురు చూశారు. వారి ఆవేదన వింటుంటే ఎంతో అవమానకరంగా ఉంది.
అన్నమయ్య డ్యాం జల విలయానికి ఏడాది అయినా ప్రభావిత గ్రామాల ప్రజలు నేటికీ తేరుకోలేదు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శనివారం ఎగువ మందపల్లె గ్రామంలో పర్యటించి బాధిత ప్రజలను పరామర్శించారు.#YCPBetrayedAPFloodVictims pic.twitter.com/9eAg3hgWGg
— JanaSena Party (@JanaSenaParty) November 19, 2022
• జనసేన పర్యటన అనగానే సాయం అంటూ హడావిడి
స్వయంగా ముఖ్యమంత్రి మూడు నెలల్లో ఇళ్లు కట్టించి మీకు తాళాలు ఇస్తామని చెప్పి కనబడకుండా పోతే ఏమనుకోవాలి. ఈ రోజుకీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇచ్చిన దాతల సాయంతోనే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు బతుకుతున్నారు. ఆకలి బాధలు పెరిగితే అసాంఘిక కార్యక్రమాలు, దోపిడీలు జరిగిపోయేవి. 9 మందిని కోల్పోయిన కుటుంబాన్ని కూడా ఆదుకోలేనప్పుడు ఈ ప్రభుత్వం దేనికి.. లక్ష కోట్ల బడ్జెట్ ఎందుకు?
* ఇసుక దోచే వైసీపీ ప్రజా ప్రతినిధులు ఒక్క ఇల్లూ కట్టించలేదు
ఇసుక దోపిడి చేసి బతికే ప్రజా ప్రతినిధులు నాడు వారి కంపెనీ ప్రతినిధులతో రూ.10 వేలు పంపి సరిపెట్టారు. వరదలు వచ్చి సంవత్సరం అయ్యింది ఒక్క ఇల్లు కట్టలేదు. ఈ రోజున మా పర్యటన ఉందని తెలిసి రాత్రికి రాత్రి రూ. లక్షా 40 వేలు వారి ఖాతాల్లో వేస్తున్నట్టు ప్రకటించారు.
• కొత్త కలెక్టరేట్ కట్టారు
ఏడాది నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు. అధికారులకు కూడా కొత్త కలెక్టరేట్ కట్టించారు. సొంత భవనాలు కట్టించారు. మరి వరద బాధితులు ఏం తప్పు చేశారు. మా జీవితాలు మేము నడుపుకుంటామని చెబుతున్నా స్పందన లేకపోతే ఎలా? అని బాధితులు వాపోతున్నారు. మూడు పంటలు పండే ప్రాంతాన్ని ఎడారిగా మార్చేశారు. ఇసుక మేటలు కూడా తీయనీయడం లేదు. అధికార యంత్రాంగం కూడా బెదిరిస్తోంది. ముఖ్యమంత్రి వచ్చి యువతకు పది రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కనబడడం లేదు. పట్టాలు ఇస్తామన్నారు ఇవ్వలేదు. హెక్టారుకు రూ. 12,500 ఇసుక తరలించుకోవడానికి ఇస్తామన్నారు అదీ లేదు.. రుణమాఫీ అన్నారు అదీ లేదు. వీరిని నిలబెట్టాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. అన్నమయ్య డ్యాం వరద బాధితులకు అండగా పవన్ కళ్యాణ్నాయకత్వంలో పోరాటం చేస్తాం” అన్నారు.
ఈ పర్యటనలో జనసేన పార్టీ నేతలు తాతంశెట్టి నాగేంద్ర, డా.పి.హరిప్రసాద్, శ్రీ పెదపూడి విజయ్ కుమార్, శ్రీ టి.సి.వరుణ్, శ్రీ మనుక్రాంత్ రెడ్డి, శ్రీ పందిటి మల్హోత్రా, శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీ అతికారి దినేష్, శ్రీ అతికారి కృష్ణ, శ్రీ జోగినేని మణి, శ్రీ పగడాల వెంకటేష్, శ్రీ కేతుబోయిన సురేష్ బాబు, శ్రీ పెండ్యాల హరి, శ్రీమతి సంయుక్త, శ్రీ చెంగారి శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.