Nadendla Manohar criticized the YCP plenary : వైసీపీ ప్లీనరీని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కడిగిపారేశారు. అది పార్టీ ప్లీనరీ కాదని.. సర్కస్ కంపెనీ అంటూ గాలి తీసేశారు. రైతులను అంతగా ఆదుకుంటుంటే 3వేల మంది ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిలో అసహనం, అభద్రతాభావంతో మాట్లాడుతున్నారని.. గడప గడపకు కార్యక్రమం విజయవంతం చేయాలని బతిమిలాడుకుంటున్నారని అన్నారు.
వైసీపీ రెండు రోజుల ప్లీనరీ సర్కస్ కంపెనీ వ్యవహారాన్ని తలపించేలా సాగిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మూడేళ్ల తర్వాత చేసుకుంటున్న కార్యక్రమం కాబట్టి ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి చెప్పుకొని వాళ్ల పార్టీకి మార్గనిర్ధేశం చేసుకుంటారు అనుకుంటే పరనిందకే సీఎం జగన్ పరిమితమయ్యారని ఆఱోపించారు.
గతంలో గ్రేట్ ఇండియన్ సర్కస్ ఉండేదని.. ఆసర్కస్ కంపెనీ మాదిరి పెద్ద పెద్ద టెంట్లు వేసుకొని పులులు, సింహాలు అంటూ ప్రసంగాలు సాగించారని విమర్శించారు. వైసీపీ పాలనలో సంక్షేమం గోబెల్స్ ప్రచారానికే పరిమితమన్నారు. దమ్ముంటే ఎన్నికలకు వెళదాం రండి అంటూ మండిపడ్డారు.
రేపు విజయవాడలో జనసేన రెండో విడత జనవాణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. జనసేన భరోసా కల్పిస్తుందని నాదెండ్ల తెలిపారు. వైసీపీ వైఫల్యాలు ప్రజలకు అర్థమవుతున్నాయనే భయపడుతున్నారని విమర్శించారు.
జనసేనలోకి పలువురు వైసీపీ నాయకులు చేరడం విశేషంగా మారింది. కృష్ణ జిల్లా, గుడివాడ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు వెంకటకృష్ణ సారథిబాబు, పారిశ్రామికవేత్త పాలంకి వెంకటకృష్ణ మోహన్ బాబు జనసేన పార్టీలో చేరారు. నాదెండ్ల మనోహర్ వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.