
సొరంగ మార్గాల గురించి సినిమాల్లో చాలాసార్లు చూసే ఉంటాం. అయితే.. నిజ జీవితంలోనూ ఇలాంటి మార్గాలు ఉన్నాయి. పురాతన కాలంలో రాజులు ఇలాంటి వాటిని ఏర్పాటు చేసుకునేవారు. సంపదను దాచుకునేందుకు, యుద్ధాల సమయంలో తప్పించుకునేందుకు నేరుగా రాజమందిరాలకు అనుసంధానంగా సొరంగాలను నిర్మించుకునేవారు. ఇలాంటి ఓ సొరంగమే ఇప్పుడు దేశ రాజధానిలో బయటపడింది. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన ఈ సొరంగం కథేంటన్నది ఇప్పుడు చూద్దాం.
ఢిల్లీలో బయటపడిన సొరంగం బ్రిటీష్ కాలం నాటిదని పురావస్తు శాఖ అధికారులు తేల్చారు. భారత స్వాతంత్ర సమరయోధులను, ఆంగ్లేయుల ఆదేశాలను ఉల్లంఘించేవారిని తరలించడానికి బ్రిటీషర్లు ఈ సొరంగాన్ని ఉపయోగించేవారని తెలుస్తోంది. ఆంగ్లేయులు భారత్ ను ఆక్రమించుకున్నప్పుడు ప్రస్తుత పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా కేంద్రంగా పాలన సాగించేవారు. ఆ విధంగా బ్రిటీష్ ఇండియా రాజధాని కలకత్తా కొనసాగింంది. అయితే.. 1912లో కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చారు ఆంగ్లేయులు.
ఆ తర్వాత ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీని సెంట్రల్ కోర్టుగా మార్చారు. 1926లో ఈ మార్పు జరిగింది. అయితే.. అప్పటికే ఉన్న సొరంగాన్ని ఆంగ్లేయులు వినియోగించుకున్నట్టుగా చెబుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఈ సొరంగం ఎర్రకోట వరకు ఉందని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఈ లెక్కన షాజహాన్ కాలంలో ఈ సొరంగాన్ని తవ్వి ఉండొచ్చా? అనే చర్చ సాగుతోంది. బ్రిటీషర్లు మాత్రం స్వాతంత్ర సమరయోధులను, తమను వ్యతిరేకించే వారిపై దాడులు చేసేందుకు ఈ మార్గాన్ని వినియోగించుకునేవారని తెలుస్తోంది.
ఈ సొరంగం గురించి డిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ పలు వివరాలు వెల్లడించారు. ఈ సొరంగం గురించి తాను గతంలో విన్నానని చెప్పారు. 1993లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఈ విషయం గురించి తెలుసుకున్నట్టు చెప్పారు. అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు సొరంగ మార్గం ఉన్నట్టుచెప్పేవారని, అయితే.. దాని చరిత్ర తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. సమాచారం లభించలేదని అన్నారు.
ఇప్పుడు ఈ సొరంగాన్ని గుర్తించామని చెప్పిన రామ్ నివాస్.. దాన్ని ఇప్పుడు తవ్వడం లేదన్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో మెట్రో పిల్లర్లు మొదలు ఎన్నో నిర్మాణాలు ఉన్నాయన్నారు. అందువల్ల సొరంగాన్ని మళ్లీ తవ్వాలనే ఆలోచన లేదన్నారు. అయితే.. సాధ్యమైనంత వరకూ పునరుద్ధరించి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15లోపు ఈ పనులు పూర్తిచేయాలని భావిస్తున్నట్టు ఢిల్లీ స్పీకర్ తెలిపారు.