https://oktelugu.com/

Muthireddy Yadagirireddy : ముత్తిరెడ్డి కన్నీరు కేసీఆర్‌ను కరిగిస్తుందా? కదిలిస్తుందా?

తాజాగా తన అనుచరులతో ముత్తిరెడ్డి సమావేశం నిర్వహించారు. శనివారం జనగామ శివారులోని ఓ మామిడితోటలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా బీఆర్‌ఎస్‌ నేతలు వచ్చారు.

Written By:
  • Rocky
  • , Updated On : August 19, 2023 / 10:13 PM IST
    Follow us on

    Muthireddy Yadagirireddy : ‘అధికారంతమున చూడాలి ఆయ్యవారి చిత్రాలు’ అని ఓ సామెత ఉంది. ఇప్పుడు ఎన్నికల కాలం కావడంతో దీనిని అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిజం చేసి చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇన్‌ డైరెక్ట్‌గా సంకేతాలు ఇచ్చారో తెలియదు గాని చాలా నియోజకవర్గాల్లో అధికార బీఆర్‌ఎస్‌లో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. టిక్కెట్‌ ఇస్తే ఓడిస్తామని కార్యకర్తలు అధిష్ఠానానికే సవాల్‌ విసురుతున్నారు. ఇలా సొంత పార్టీ కార్యకర్తల నిరసన ఎదుర్కొంటున్న వారిలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఒకరు.

    కొంతకాలంగా ఆయన సొంత నియోజకవర్గంలో తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. భూమి ఆక్రమణకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆ భూమిని సొంత కూతురు తుల్జా భవానీ రెడ్డి మీద రిజిస్ట్రేషన్‌ చేయించడం, అది కాస్తా వివాదంగా మారడంతో యాదగిరి రెడ్డి ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆ మధ్య జనగామలోని పెద్ద చెరువు కంఠం భూమిని ఆక్రమించినట్టు ఆరోపణలు రావడంతో అధికార పార్టీని ఇరుకున పెట్టింది. తాజాగా ఆయన అసెంబ్లీ సీటుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎసరు పెట్టారని వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులతోనే రాజేశ్వర్‌రెడ్డి అసమ్మతిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే కేసీఆర్‌ మాత్రం తన వైపే ఉన్నారని ముత్తిరెడ్డి చెబుతున్నారు.

    తాజాగా తన అనుచరులతో ముత్తిరెడ్డి సమావేశం నిర్వహించారు. శనివారం జనగామ శివారులోని ఓ మామిడితోటలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా బీఆర్‌ఎస్‌ నేతలు వచ్చారు. ఈసందర్భంగా ఓ మహిళా సర్పంచ్‌ యాదగిరి రెడ్డి మీద పడి బోరున విలపించింది. ‘బాపూ నేను దళిత బిడ్డను. నన్ను సర్పంచ్‌ను చేసినవు. ఇదేంది బాపూ ఇంత అన్యాలం అయిపోయిదంటూ’ విలపించింది. దీంతో ముత్తిరెడ్డి కూడా కంట నీరు పెట్టుకున్నారు. ‘ ఏం కాదు బిడ్డా.. నాకు టిక్కెట్‌ ఇస్తారు. కేసీఆర్‌ సార్‌ మనకు అన్యాలం చేయరు’ అంటూ ఆమెను అనునయించారు. కాగా, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారు ముత్తిరెడ్డి కన్నీరు కేసీఆర్‌ను కరిగిస్తుందా? కదిలిస్తుందా? అని కామెంట్లు చేస్తున్నారు.