Minister Malla Reddy: భారత రాష్ట్ర సమితి పార్టీ దేశ రాజకీయాల్లోకి వెళ్లి వారం కూడా గడవకముందే అప్పుడే అసమ్మతి రాగం మొదలైంది. ఢిల్లీకి వెళ్లి చక్రాలు తిప్పుదామని అనుకుంటుంటే… స్వరాష్ట్రంలోనే కూసాలు విరుగుతున్నాయి.. ఏకంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మంత్రికి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు నిరసనగళం వినిపిస్తుండడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష పోకడతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. మంత్రి పదవులన్నీ తన సొంత నియోజకవర్గానికి ఇచ్చుకుంటున్నారు.. మల్కాజ్ గిరి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ ఎమ్మెల్యేలను అసలు లెక్కచేయడం లేదు.. అయితే పలు విషయాలపై అంతర్గతంగా చర్చించుకుందాం అని అనుకున్నప్పటికీ… మంత్రి మల్లారెడ్డి తమను కలుపుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అసమ్మతి ఎమ్మెల్యేలు అంటున్నారు.

గ్యాప్ నిజమే
మంత్రికి, జిల్లా ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉంది.. అయితే దీనిని పార్టీకి నష్టం జరగకుండా ఉండేందుకు చర్చించుకోవాలని అనుకున్నప్పటికీ.. అధిష్టానం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో గతి లేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలకు పదవులు ఇస్తామని అప్పట్లో ఈ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు.. అయితే ఈ పదవులు మొత్తం మంత్రి మల్లారెడ్డి తన అనుచరులకే కట్టబెట్టుకున్నారు.. ఈ విషయంలో ఈ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలను ఆయన పెదగా లెక్క చేయలేదు. ఇలా పలు సందర్భాల్లో ఎమ్మెల్యేలు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఆయన బుట్ట దాఖలు చేశారు.. దీంతో ఆ ఎమ్మెల్యేలపై స్థానికంగా ఒత్తిడి పెరుగుతోంది. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే అనే అభిప్రాయానికి వారు వచ్చారు.. దీంతో దూలపల్లి లోని మంత్రి నివాసంలో భేటీ అయ్యారు.
కోల్డ్ వార్ సాగుతోంది
మంత్రి మల్లారెడ్డి, ఇతర ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ సాగుతోంది.. ఆదివారం ఓ వివాహ వేడుకలో మల్లారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు మధ్య నామినేటెడ్ పదవుల అంశంపై సీరియస్ గా చర్చ సాగింది.. మరుసటి రోజే ఎమ్మెల్యేలు సమావేశం కావడం చర్చనీయాంశమైంది. అయితే అధిష్టానం ఆదేశాలతోనే ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు అనే ప్రచారం కూడా జరిగింది. అయితే మేడ్చల్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ వివాదం ముదిరేందుకు కారణమైనట్టు తెలుస్తుంది.. ఇప్పటివరకు చైర్మన్ గా ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన రవి యాదవ్ పదవి కాలం పూర్తి కావచ్చిన నేపథ్యంలో ఆ పదవి భర్తీపై ఎమ్మెల్యేలకు మంత్రికి మధ్య వివాదం రేగింది.. మంత్రి తన నియోజకవర్గానికి చెందిన వారికే ఇప్పించుకుంటున్నారంటూ ఎమ్మెల్యేలు కేటీఆర్ దృష్టి కూడా తీసుకెళ్లారు.. దీనిపై అందరం కలిసి నిర్ణయం తీసుకుందామని అనుకున్నారు.. కానీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ కు చెందిన భాస్కర్ యాదవ్ కు ఆదివారం హడావిడిగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం ఇప్పించారు.. సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ఆదేశించారు.. ఈ విషయం తెలిసిన జిల్లా ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మంత్రి తీరును తీవ్రంగా నిరసించారు.

అధిష్టానం పాత్ర ఎంతుంది
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం అధిష్టానానికి తెలిసే జరిగినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.. మంత్రి మల్లారెడ్డి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో… నాకు ప్రాధేయనం తగ్గించాలని, లేదా పూర్తిగా వదిలించుకోవాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించినట్టు తెలుస్తోంది.. అందులో భాగంగానే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలతో అసమ్మతి రాగం వినిపించినట్టు తెలుస్తోంది. అయితే గతంలో ఎప్పుడు కూడా మీడియా ముందుకు రాని ఈ ఎమ్మెల్యేలు ఇంత ధైర్యంగా మాట్లాడటం ఇదే మొదటిసారి. సాధారణంగా భారత రాష్ట్ర సమితిలో ప్రజాప్రతినిధులకు ఈ స్థాయిలో స్వేచ్ఛ ఉండదు. కానీ దీని వెనుక అధిష్టానం ఉండే ఉంటుందని చర్చ జరుగుతున్నది.. మరోవైపు మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలి ఇటీవల వరుస వివాదాలకు దారితీస్తోంది.. ఘట్ కేసర్ లో నిర్వహించిన రెడ్డి సంఘం సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు వివాదానికి కారణమైంది. ఐటీ అధికారుల దాడుల సమయంలో వ్యవహరించిన తీరు, మెడికల్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో రెడ్డి అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలు, భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని చేసిన వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి పై తొడగొడుతూ సవాల్ చేయడం వంటి చేష్టలతో మల్లారెడ్డి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.. ఆయనపై భూ వివాదాలు కూడా ఉన్నాయి.. మరోవైపు భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుతో నూ మంత్రి మల్లారెడ్డి కి పసుగడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.. ఈ అసమ్మతి మునుముందు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది.