Muslim Singer Farmani Naaz: హర్ హర్ శంభూ.. శివ శంభూ.. అంటూ గంభీరమైన గొంతుతో ఓ యువతి భక్తితో, తన్మయత్వంతో నిండైన శివభక్తురాలి రూపంలో పాడిన పాట ఇప్పుడు యూట్యూబ్ సెన్షేన్‌గా మారింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శివభక్తుల వాట్పాప్ స్టేటస్‌లలో మార్మోగుతోంది. ఇంతటి క్రేజ్ వచ్చిన శివయ్య పాటపాడింది ఒక ముస్లిం యువతి. శివభక్తురాలిగా వస్త్రధారణ చేసి శివనామస్మరణతో పాడిన పాట ప్రతీ హిందువను పులకించేలా చేసింది యూట్యూబ్ సెన్సేషన్, ఇండియన్ ఐడల్ ఫేమ్ ఫర్మానీ నాజ్. అయితే ఈ పాటపాడినందుకు ముస్లిం మతపెద్దలు ఫర్మానీపై మండిపడుతున్నారు. హిందువల దైవం శివుడి మీద పాట పాడిందన్న కారణంతో ముస్లిం సంఘాలు ఫర్మానీ నాజ్‌పై ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. ఇది ఇస్లాం వ్యతిరేక చర్య అంటూ ఫత్వా సైతం జారీ చేయడంతో వివాదానికి కేంద్ర బిందువు అయింది. ఈ చేష్టను ఇస్లాం వ్యతిరేక చర్యగా ఆరోపిస్తున్నారు. ముస్లిం మతపెద్దలు.. ఇస్లాంలో, అందునా మహిళలు ఇలాంటి పనులు చేయడం మత విరుద్ధమేనని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్ దియోబంద్‌ను చెందిన మతపెద్ద అసద్ ఖ్వాస్మీ దీనిని ‘పాపం’గా, ఘోరమైన నేరంగా అభివర్ణిస్తున్నారు. సంగీతానికి ఆమె దూరంగా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. స్టూడియోలో రికార్డింగ్ వెర్షన్‌ను ఆమె యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. శ్రావణ మాసం సందర్భంగా పాటను రిలీజ్ చేయగా.. హిందూ సంఘాలు, మరికొందరు అభినందిస్తుండగా, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎవరీ ఫర్మానీ నాజ్?
ఉత్తర ప్రదేశ్ ముజఫర్‌నగర్‌కు చెందిన యువతి ఫర్మానీ నాజ్.. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె యూట్యూబ్ చానెల్‌కు 3.84 మిలియన్లకు పైగా సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. ఇండియన్ ఐడల్ సీజన్ 12లో పాల్గొనడం ద్వారా ఆమెకు ఒక స్టార్ డమ్ దక్కింది. ఫర్మానీకి 2017లో వివాహం అయింది. అయితే కొడుకు పుట్టడం, ఆ కొడుక్కి జబ్బు చేయడంతో భర్త కుటుంబం ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించింది. దీంతో బిడ్డను తీసుకుని ఆమె తన పుట్టింటికి వెళ్లి.. కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
ఓ కుర్రాడి చొరవతో క్రేజ్..
ఆమె గొంతు బాగుండడంతో ఫర్మానీ తరచూ పాటలు పాడేది. ఆమె పాడే పాటలను స్థానికంగా ఉండే ఓ కుర్రాడు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. అలా యూట్యూబ్ సెన్సేషన్‌గా, ఇ–సెలబ్రిటీగా గుర్తింపు పొందింది. ఆపై ఇండియన్ ఐడల్‌లో పాల్గొనే చాన్స్ వచ్చింది. అయితే కొడుకు ఆరోగ్యం క్షీణించడంతో ఇండియన్ ఐడల్ మధ్యలోనే వెనక్కి వచ్చేశారు. అయినా కూడా ఆమె కెరీర్ ముందుకు సాగిపోతూ వచ్చింది.
ఆపదలో ఉన్నప్పుడు ఎటుపోయారు?
శివయ్యపై తాను పాడిన పాటను తప్పు పడుతున్న ముస్లిం సంఘాలు, మత పెద్దలపై ఫర్మానీ స్పందించింది. తనది పేద కుటుంబం అని, ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ సాయానికి ముందుకు రాలేదు కానీ, తన మానాన తాను బతుకుతుంటే.. ఇప్పుడు అడ్డుకోవాలని చూడడం, విమర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ఆమె. అన్నింటికి మించి కళాకారులకు మతంతో సంబంధం ఉండదని గుర్తించాలని సూచిస్తున్నారు. ‘అలా అనుకుంటే.. సలీం, మోహమ్మద్ రఫీ లాంటి వాళ్లు భజన, హిందూ భక్తి పాటలు ఆలపించేవాళ్లు కాదు కదా.. దయచేసి హిందూ మతానికి, సంగీతానికి ముడిపెట్టొద్దు’ అని విజ్ఞప్తి చేస్తున్నారామె. అంతేకాదు తనకున్న రెండు చానెల్స్‌లో ఒకటి భక్తి గీతాల చానెల్ అని, అందులో కచ్చితంగా అన్ని మతాలకు సంబంధించిన ఆల్బమ్స్ అప్‌లోడ్ చేసి తీరతానని, అల్లా ఆశీస్సులు తనపై ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు ఫర్మానీ.
హిందూ సంఘాల మద్దతు
ఇక తాజాగా శివుడి మీద పాట వైరల్ కావడంతో.. ఆమె మీద పలువురి అభినందలు సైతం కురుస్తున్నాయి. బీజేపీ నేత సంజీవ్ బాల్యన్.. ఆమె కొడుకు ట్రీట్‌మెంట్‌కు అవసరమయ్యే సాయం అందిస్తానని మాటిచ్చారు. మరోవైపు ముస్లిం సంఘాలు ఫర్మానీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేయడంపై వీహెచ్‌పీ మండిపడింది. ‘వాళ్లు(ముస్లిం సంఘాలు) పేదలు, నిస్సహాయులకు మాత్రమే ఫత్వా జారీ చేస్తారు. ఇంతకాలం ఆమె యూట్యూబ్ ద్వారా పాడిన సంగతి మరిచిపోయినట్లు ఉన్నారు’ అంటూ ముస్లిం మత పెద్దలపై విమర్శలు గుప్పిస్తోంది. ఏది ఏమైనా ఫర్మానీ పాడిన శివయ్య పాటకు మాత్రం శివభక్తులు పరవశం పొందుతున్నారు. తన్మయంతో శివనామస్మరణ చేస్తున్నారు. భక్తిభావంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ పాట ద్వారా ఫర్మానీకి మంచి గుర్తింపు వచ్చిందనడంలో సందేహం లేదు.