Munugode Bypoll Symbol: దుబ్బాకలో రోడ్డు రోలర్ కారును తొక్కేసింది. హుజరాబాద్ లో అదే సీన్ రిపీట్ అయింది. ఈసారి మునుగోడు లోను అదే రోడ్డు రోలర్ ఎదురు వచ్చింది. ముందే జాగ్రత్త పడిన కారు రోడ్డు రోలర్ ను తప్పించే ప్రయత్నం చేసింది. కానీ ఈ తతంగంలో ఆర్వో జగన్నాధ రావు పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు.. సంతకం చేస్తే ఎలక్షన్ కమిషన్ వేటు తప్పదు. చేయకపోతే పని చేసే పరిస్థితి ఉండదు. కన్నీరు పెట్టుకుంటూనే ఆయన గుర్తుల తొలగింపు జాబితా పై సంతకం పెట్టారు. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆయనపై వేటువేసింది.. ఉత్తర్వు తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కానీ దీని వెనక జరిగింది ఒక థ్రిల్లర్ సినిమా కంటే ఎక్కువ ఉంది.

దేశంలోనే ఖరీదైన ఉప ఎన్నిక
సాధారణంగా ఉప ఎన్నికలంటే పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ తెలంగాణలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దుబ్బాక నుంచి మొదలైన కాక ఇప్పుడు మునుగోడు వరకు మరింత పెరిగింది.. అధికార టీఆర్ఎస్, బిజెపి హోరాహోరీగా తలపడుతున్నాయి. విజయమో వీర స్వర్గమో అంటూ కత్తులు దూసుకుంటున్నాయి.. ఇదంతా ఒకవైపు అయితే.. మునుగోడు ఉప ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. కారు గుర్తును పోలి ఉందని టిఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసిన ఎన్నికల గుర్తు రోడ్డు రోలర్ ను బ్యాలెట్ నుంచి తొలగించడం వివాదాస్పదమైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ రిటర్నింగ్ అధికారి జగన్నాథరావును తొలగించింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఓ కీలక నేత జగన్నాధ రావు కు ఫోన్ చేశారు. ఆయన సూచనల మేరకే రోడ్డు రోలర్ గుర్తును బ్యాలెట్ పేపర్ నుంచి తొలగించినట్లు సమాచారం. ఈ క్రమంలో జగన్నాథరావు ఒత్తిడికి గురయ్యారు. స్వతంత్ర అధికారాలు కలిగి ఉన్న ఎన్నికల కమిషన్ నియమావళికి భిన్నంగా పనిచేస్తే తన ఉద్యోగం పోవడం ఖాయం అని, చేయకపోతే రాష్ట్రంలో ఉద్యోగం చేయలేమంటూ ఆయన చండూరులోని రిటర్నింగ్ అధికారి కార్యాలయ ఆవరణలో కన్నీటి పర్యంతమయ్యారు. ఉప ఎన్నిక ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ఆయన తనకు వచ్చే ప్రతి ఫోన్ కాల్ ని రికార్డు చేసే ఆప్షన్ పెట్టుకున్నాడు. వేటు తప్పదని తెలిసినా టిఆర్ఎస్ కీలక నేత ఒత్తిడి మేరకు కన్నీరు పెట్టుకుంటూనే గుర్తును తొలగించే సంబంధిత జాబితా పై ఆయన సంతకాలు చేశారు.. అయితే ఎన్నికల కమిషన్ అప్పట్లోనే ఈసీ, జగన్నాధరావును అర్వోగా తప్పించి మరో అధికారిని నియమించింది. తాజాగా నల్లగొండ ఆర్డీవో జగన్నాధ రావు పై కూడా వేటు వేసింది.. తక్షణం ఆయన సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని శుక్రవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీకి పంపాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆదేశాల ప్రకారం
ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లా అధికారులు సస్పెన్షన్ ఆర్డర్ ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు పంపారు. అయితే ఎన్నికల కమిషన్ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. జగన్నాధ రావు పై సస్పెన్షన్ వేటు తొలగింపునకు మూడు నుంచి నాలుగు సంవత్సరాల అయినా పడుతుందని విశ్రాంత ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు.. గుర్తు తొలగింపు నిర్ణయం వల్ల ఇప్పుడు ఆయన సర్వీస్ ప్రమాదంలో పడిందని సీనియర్ అధికారులు అంటున్నారు. ఈయన ఒక్కడే కాకుండా నల్లగొండ డిఎస్పి పై కూడా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు రోజు వచ్చిన ఎన్నికల సంఘం అధికారికి తగినంత భద్రత కల్పించడంలో నిర్లక్ష్యానికి నల్లగొండ డిఎస్పీని బాధ్యుడిని చేయాలని, ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే దీనిపై తమకు ఎటువంటి అధికారిక ఉత్తర్వు రాలేదని నలగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి చెబుతున్నారు. ఎన్నికలకు ముందే ఇలా ఉంటే.. మునుముందు పరిస్థితి మరింత రంజుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.