Munugode By Election Rajagopal Reddy: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అక్కడి టిఆర్ఎస్ పార్టీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. ఆయన ప్రచారం చేసే మార్గంలో నిరసన వ్యక్తం చేస్తూ ” 18 వేల కోట్లకు అమ్ముడు పోయావంటూ” తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కోమటిరెడ్డి సోదరులు కాంట్రాక్టుల కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బిజెపి నాయకుల కాళ్ళ ఎదుట తాకట్టు పెట్టారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లపురం గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించగా.. ” నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని గెలిపిస్తే.. కేవలం కాంట్రాక్టు పనుల కోసం అమ్ముడు పోయావంటూ” టిఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. మొదట్లో ఈ నిరసనను స్థానికులే చేశారని బిజెపి నాయకులు అనుకున్నారు. కానీ వారు రాజగోపాల్ రెడ్డిని దూషిస్తూ, కారు గుర్తుకు ఓటెయ్యాలని నినాదాలు చేయడంతో వారంతా టిఆర్ఎస్ కార్యకర్తలని తేలిపోయింది. వాస్తవానికి గత ఎన్నికల్లో అల్లపురం గ్రామంలో రాజగోపాల్ రెడ్డికి మెజార్టీ ఓట్లు వచ్చాయి. అప్పటినుంచి ఇక్కడి టిఆర్ఎస్ నాయకత్వం ఏదో ఒక రూపంలో రాజగోపాల్ రెడ్డి వర్గీయులపై దాష్టీకం ప్రదర్శిస్తూ వస్తోంది. పైగా కోమటిరెడ్డి వర్గీయులకు పింఛన్లు రాకుండా అడ్డుకున్నది. ఇటీవలి రేషన్ కార్డుల మంజూరులోనూ అదే పంథా కొనసాగించింది. దీనిపై ఇక్కడి ప్రజలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకెళ్తే.. ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

అడుగడుగునా అడ్డంకులు
అల్లపురం గ్రామంలో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారంతా మంత్రి జగదీష్ రెడ్డి వర్గీయులు అని తెలుస్తోంది. ” రాజగోపాల్ రెడ్డి గెలుపును తట్టుకోలేక టిఆర్ఎస్ నాయకులు ఇలాంటి కుయుక్తులకు తెలలేపుతున్నారని” బిజెపి నాయకులు అంటున్నారు. కాక రాజగోపాల్ రెడ్డి పై టిఆర్ఎస్ నాయకుల వ్యతిరేక ప్రచారం ఇది కొత్త కాదు. ఎప్పుడైతే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో అప్పటినుంచి టిఆర్ఎస్ నాయకులు, వారి సొంత మీడియాలో ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారు. నాయకులు కూడా నోటికి ఎంత వస్తే అంత తీరుగా విమర్శిస్తున్నారు. ఇటీవల చుండూరు గ్రామంలో “కాంట్రాక్ట్ పే” పేరిట రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. దీనిని అధికార టీఆర్ఎస్ సొంత మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పించారు. పైగా దీని వెనుక ఉన్నది టిఆర్ఎస్ నాయకులే అని ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని బిజెపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పైగా అధికార యంత్రాంగమంతా టిఆర్ఎస్ కను సన్నల్లో నడుస్తోందని బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు.

” వాస్తవానికి అల్లపురం గ్రామంలో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారంతా టిఆర్ఎస్ కార్యకర్తలు. 2018 ఎన్నికల్లో వారు పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేశారు. అధికారంలో ఉన్నది వాళ్ల టిఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఇచ్చినట్లు మునుగోడుకు కూడా నిధులు మంజూరు చేస్తే అభివృద్ధి ఎందుకు జరగదు?, మునుగోడుపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నందునే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. అంతిమ విజయం మాత్రం రాజగోపాల్ రెడ్డి దే అని” బిజెపి కార్యకర్తలు అంటున్నారు. గత ఏడాది హుజరాబాద్ లో కూడా అధికార దౌర్జన్యానికి టిఆర్ఎస్ పాల్పడిందని, తర్వాత వెల్లడైన ఫలితాలు బిజెపికి అనుకూలంగా వచ్చాయని ఆ పార్టీ నాయకులు ఉదహరిస్తున్నారు. ఇప్పుడు మునుగోడులో కూడా అదే జరగబోతుందని వారు జోస్యం చెబుతున్నారు. కాగా అల్లపురం గ్రామాల్లో టిఆర్ఎస్ కార్యకర్తలు తనకు గంగా నినాదాలు చేసినా రాజగోపాల్ రెడ్డి ప్రచారం కొనసాగించారు. తాను ఎవరి బెదిరింపులకు భయపడబోనని, 2018 ఎన్నికల్లో వచ్చిన ఫలితమే, ఇప్పుడు ఉప ఎన్నికల్లోనూ వస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. అయితే టిఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.