Munugode By Election- TRS vs BJP: మునుగోడు ఉప ఎన్నిక.. బీజేపీ, కేసీఆర్ ల మధ్య ప్రత్యక్ష యుద్ధాన్ని తలపించింది. నెల రోజులు జరిగిన ఈ యుద్ధంలో ఓటరు గెలిచేది లేదనేది సుస్పష్టం. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా భావిస్తున్న మునుగోడులో డబ్బులే గెలుస్తాయన్నది వాస్తవం. ఇక్కడ విజయం కోసం టీఆర్‌ఎస్, బీజేపీ పోటా పోటీగా డబ్బులు ఖర్చు పెట్టాయి. సుమారు వెయ్యికోట్ల వరకు ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఖర్చు చేసినట్లు ఒక అంచనా. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్.., కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ గెలుపు కోసం భారీగా డబ్బులు ఖర్చు చేశాయి. ఇక సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ కూడా ఉన్నంతలో కొన్ని డబ్బులు వెచ్చించింది. ఇప్పుడు ప్రజల తీర్పు ఈవిఎంలలో నిక్షిప్తమైంది. ఈ క్రమంలో విజయం ఎవరిని వరించినా గెలిచేది మాత్రం డబ్బే. అయితే ఈ గెలుపు ఎవరికీ సంతృప్తిగా ఉండదనేది మాత్రం నిజం. ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చుచేసి సాధించిన గెలుపు ప్రజాస్వామ్య విజయం కాదనేది వాస్తవం. ఈ వాస్తవం మూడు పార్టీలతోపాటు ప్రజలకూ తెలుసు. ఈ గెలుపు 2023కు ప్రీఫైనల్ అని పార్టీలు భావిస్తున్నా.. వాస్తవం కాదని ఓటర్లకు తెలుసు. అందుకే ఎవరు గెలిచినా వారి అంతరాత్మ మాత్రం.. నిత్యం ప్రజాస్వామ్య విజయం కాదనే విషయాన్ని పదేపదే గుర్తు చేస్తుంది.

-కొనుక్కున్న విజయమే..
తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం కోసం భారీగా ఖర్చ చేసింది. రూ.వెయ్యి కోట్ల ఎన్నికల్లో సుమారు రూ.500 కోట్లు ఒక్క టీఆర్‌ఎస్ పార్టీనే ఖర్చు చేసినట్లు అంచనా. ఎందుకుంటే.. మునుగోడులో సొంతపార్టీ సర్పంచులు, ఎంపీటీసీలతోపాటు, ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అభ్యర్థిపై కూడా వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అందరినీ శాంతింపజేసేలా సుమారు రూ.200 కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేశారు. అభివృద్ధి నిధులు కేటాయించారు. వేతనాలు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఖజానాపై తీవ్ర భారం పడింది. ఇదంతా అధికారిక ఖర్చే. ఇక అనధికారికంగా మరో రూ.300 కోట్లు ఖర్చు చేశారు.
-దేశంలో అత్యంత ఖరీదైన ప్రాంతీయ పార్టీగా..
దేశంలో అత్యంత ఖరీదైన ప్రాంతీయ పార్టీగా టీఆర్‌ఎస్‌కు గుర్తింపు ఉంది. టీఆర్‌ఎస్ ఖాతాలో రూ.870 కోట్లు ఉన్నట్లు ఇటీవల కెసిఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలను డబ్బుతో గెలవొచ్చన్న భావనలో గులాబీ బాస్ ఉన్నారు. ఈ క్రమంలోనే గతంలో జరిగిన దుబ్బాక, హుజారాబాద్ ఎన్నికల్లోనూ డబ్బులను నీళ్లలా ఖర్చు చేశారు. తాజాగా మనుగోడులోనూ సుమారు రూ.100 కోట్లు పార్టీ నిధులు ఖర్చు చేసినట్లు అంచనా. మొత్తంగా ఉప ఎన్నికల కోసమే టీఆర్‌ఎస్ దాదాపుగా రూ.300 కోట్లు ఖర్చుసింది. మూడు ఉప ఎన్నికలకే ఇంత ఖర్చు చేస్తే వచ్చే ఎన్నిల్లో ఎంత ఖర్చు చేయాలన్న ఆందోళన గులాబీ బాస్‌లో నెలకొంది. మందు డబ్బులు ఖర్చు పెడుతున్న కేసీఆర్.. ఆ తర్వాత విశ్లేషణ చేసుకుంటే మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది.
– అభివృద్ధి చేశామని చెబుతున్నా.. తప్పని ఖర్చు..
తెలంగాణను తాము బంగారు తెలంగాణగా మార్చామని నిత్యం కేసీఆర్ నుంచి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ప్రచారం చేస్తారు. పథకాలను వల్లెవేస్తారు. పథకాలే ఎన్నికల్లో గెలిపిస్తున్నాయని చెబుతారు. ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తమ పనితీరు, పథకాలే గెలిపించాయని చెబుతారు. కానీ వాస్తవం ఏమిటో గులాబీ బాస్ అంతరాత్మకు తెలుసు. అందుకే ఆయన ఉప ఎన్నిక గెలుపుతో మీదికి చిరునవ్వు చిందించినా లోపల మాత్రం బాధే ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

-బీజేపీదీ అదే పరిస్థితి..
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పరిస్థితి కూడా పైకి చిరునవ్వు, లోపల బాధ ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి గెలిచినా.. దాదాపు రూ.200 కోట్లు పెట్టి గెలిచిన గెలుపు.. గెలుపు కాదనే విషయం ఆయన మదిలో ఉంటుంది. బీజేపీ కూడా సర్వశక్తులు ఒడ్డింది కాబట్టి ఆ పార్టీకి కూడా ఇంత భారీగా ఖర్చు పెట్టాల్సి రావడం మింగుడు పడని అంశం. ఇక ఓడితే కేసీఆర్ డబ్బులు ఖర్చు పెట్టిన తీరు, అధికార దుర్వినియోగం, బలగాల మోహరింపు, ధన బలం, నిబంధనలు ఉల్లంఘించి దొడిదారిన గెలిచిన తీరును ఎండగడుతుంది.
మొత్తంగా టీఆర్‌ఎస్, బీజేపీలో ఎవరు గెలిచినా.. విజయం మాత్రం తమ నిజమైనది, తమ పనితీరుతో సాధించినది కాదనేది తెలుస్తుంది. ప్రజాస్వామ్యం ఓడిపోయిందని తెలుస్తుంది. అదే సమయంలో టీఆర్‌ఎస్ గెలిస్తే కేసీఆర్ ఇంత డబ్బు పెట్టి గెలిచామన్న బాధతో ఇంట్లో దుఃఖిస్తారు. అధికార బలంతో టీఆర్‌ఎస్ గెలిచిందని బీజేపీ రోడ్లపై, వేదికలపై ప్రస్తావిస్తూ తాము డబ్బులు పెట్టినా గెలవలేకపోయమని రోడ్డుపై ఏడ్చే పరిస్థితి ఉంటుంది.