Munugode Exit Polls: దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ గెలవబోతోందా? సర్వశక్తులు ఒడ్డినప్పటికీ బిజెపి ఎందుకు చతికిలబడింది? మేం అభివృద్ధి చేస్తామని కెసిఆర్ చెప్తే ఓటర్లు నమ్మారా? దత్తత తీసుకుంటామని కేసీఆర్ అంటే ఆదరించారా? దుబ్బాక, హుజరాబాద్ లో మ్యాజిక్ చేసిన బిజెపి ఇక్కడ ఎందుకు మెరవలేకపోయింది? రాజగోపాల్ రెడ్డి తీరుపై ఓటర్లు నిరసనగా ఉన్నారా? వీటి వెనుక ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? టిఆర్ఎస్ కే ప్రజలు ఎందుకు కట్ట బోతున్నారు?

ఇంకా పోలింగ్ ముగియలేదు
మునుగోడులో ఇంకా కొన్నిచోట్ల పోలింగ్ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ సాయంత్రం వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం పలు సర్వే సంస్థలు అధికార టీఆర్ఎస్ గెలుస్తుందని తేల్చి చెప్పాయి. ప్రధాన పోటీ కేవలం బిజెపి, టిఆర్ఎస్ మధ్య కొనసాగిందని స్పష్టం చేశాయి. ఇక అన్ని ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ పార్టీనే గెలవబోతున్నట్లు స్పష్టమైంది. జనం సాక్షి రిపోర్టు ప్రకారం టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి 15 నుంచి 20 వేల మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. రాజగోపాల్ రెడ్డి రెండో స్థానంతో సరిపెట్టుకునే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. పాల్వాయి స్రవంతి రెడ్డి మూడో స్థానంలో నిలిచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక ఆత్మ సాక్షి సర్వే రిపోర్ట్ ప్రకారం టిఆర్ఎస్ పార్టీకి 41 నుంచి 42 శాతం వరకు ఓటు షేర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బిజెపికి 35 నుంచి 36% ఓటు షేర్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ పదహారు నుంచి 17% వరకు ఓటు షేర్ సాధిస్తుందని తెలిపింది. బి ఎస్ పి కి నాలుగు నుంచి ఐదు శాతం వరకు ఓటు షేర్ రావచ్చని అంచనా వేసింది. ఇతరులకు 1.5% నుంచి రెండు శాతం వరకు ఓటు షేర్ వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పింది. ఈ సర్వే ప్రకారం టిఆర్ఎస్ అభ్యర్థికి 85 వేల ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మిర్రర్ ఆఫ్ పబ్లిక్ పల్స్ రిపోర్ట్ ప్రకారం టిఆర్ఎస్ పార్టీకి 42.13% ఓట్లు, బిజెపికి 31.9 8 శాతం, కాంగ్రెస్ పార్టీకి 21.06% ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. పల్స్ టుడే పోల్ ప్రకారం 42 నుంచి 43% ఓట్లు టిఆర్ఎస్ కు, 38% ఓట్లు బిజెపికి, 14 నుంచి 16% ఓట్లు కాంగ్రెస్ కు పోలయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ఎందుకు ఈ పరిస్థితి
వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించింది బిజెపి. రంగంలోకి దిగింది కూడా ఆ పార్టీ నే. కానీ ఎక్కడో తేడా కొట్టింది. రాజగోపాల్ రెడ్డి మాట తీరు ఓటర్లకు నచ్చలేదని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. పైగా టిఆర్ఎస్ చేసిన 18 వేల కోట్ల కాంట్రాక్టు ప్రచారం కూడా ఆయనకు మైనస్ గా మారింది. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా వెళ్లి తెరవెనక ప్రయత్నం చేసినప్పటికీ రాజగోపాల్ రెడ్డి కి పెద్దగా ప్రయోజనం దక్కలేదని తెలుస్తోంది. పైగా డబ్బు పంపిణీలో కూడా స్థానికేతరులకు అధికారం ఇవ్వడంతో స్థానిక నాయకులు ఒకింత ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. ఓటు వేస్తే తులం బంగారం ఇస్తామని కొన్నిచోట్ల బిజెపి నాయకులు ప్రచారం చేశారు. ఇది కమలం పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారింది. సాక్షాత్తు రాజగోపాల్ రెడ్డి దీనికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఫలితాలు తేలేకపోయినప్పటికీ మెజారిటీ సర్వే సంస్థలు టిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడంతో బిజెపి నాయకుల్లో అంతర్మథనం మొదలైంది. అయితే సర్వే సంస్థలు చెప్పినవన్నీ నిజాలు కావాలని ఏమీ లేదు. గతంలో దుబ్బాక, హుజరాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని సర్వే సంస్థలు చెప్పాయి. కానీ క్షేత్రస్థాయిలో జరిగింది వేరు. అయితే ఇందులో సర్వే చేసిన అన్ని సంస్థలు కూడా టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయనే అపవాదు కూడా ఉంది. ఇప్పటికీ కొన్నిచోట్ల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో సర్వే సంస్థల నివేదిక ప్రకారం ఒక అంచనాకు రాలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.