CM KCR: ఆ బండి సంజయ్ మాట్లాడతాడు. అది ఎంతకీ అర్థం కాదు. తర్వాత హఠాత్తుగా కిషన్ రెడ్డి లైన్లోకి వస్తాడు. సంబంధం లేకుండా మాట్లాడుతాడు. కానీ కెసిఆర్ మాట్లాడే మాటల్లో ఉన్న లూప్ హోల్స్ పట్టుకోరు. వాటిని సరిగ్గా కౌంటర్ చేసే సోయి బిజెపికి ఎక్కడ ఉందని? ఓ రఘునందన్, ఈటల రాజేందర్ ను అడ్డుకునే శక్తులు కమలం పార్టీలో బొచ్చెడు. అందుకే కదా కెసిఆర్ విర్రవీగేది. కేటీఆర్ జబ్బలు చరిచేది. ఎస్.. ఆ ఫామ్ హౌస్ ఎపిసోడ్లో ఇప్పటికీ అంతుపట్టని నిజాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా కేసీఆర్ ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్ళాడు. అనవసరంగా ఇందులోకి రాజ్యాంగ వ్యవస్థలను లాగాడు. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ కెసిఆర్ ఎప్పుడూ ఆ లైన్ లో ఉండడు. ఆ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో కెసిఆర్ వైఫల్యం స్పష్టం. కానీ దాన్ని ఒప్పుకోడు. 2014 నుంచి కెసిఆర్ ఇతర పార్టీలను పాతరేసిన తీరు.. వైరి పార్టీల నాయకులను వేధించిన తీరు, తన ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేసిన తీరు ఇప్పటికీ తెలంగాణ మర్చిపోలేదు. మర్చిపోదు కూడా. అధికారం మీద యావతోనే ఎప్పుడో దారి తప్పాడు. ఆశలను పెంచుకుంటూ పోయాడు. 2019లో చంద్రబాబు చేసిన తప్పును కేసీఆర్ రిపీట్ చేస్తున్నాడు.

బిజెపి పై ఆగ్రహం ఎందుకంటే
గత ఎన్నికల సమయంలో కేసీఆర్ నిర్వహించిన యాంటీ పాత్ర, నిధుల పంపిణీ మీద భారతీయ జనతా పార్టీ ఇప్పటికి కూడా ఆగ్రహం గానే ఉంది. దీనివల్లే తెలంగాణ ప్రాంతం మీద బిజెపి ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్దపులి లాంటి బిజెపిని తన మీదకు తెచ్చుకుంది కేసీఆరే. దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఇలా ఏ ఎన్నిక తీసుకున్నా సరే కెసిఆర్ వ్యూహరచనలు గతంలో మాదిరి లేవు. జనం తనని నమ్మడం లేదని, రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుంది అని చెప్పడానికి ఈ సంకేతాలు. ఈరోజు సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్ లోనూ గతంలో వల్లె వేసిన వ్యాఖ్యలనే రిపీట్ చేశాడు. అంతే తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు. తాను ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా విలేకరులు ఎదురు ప్రశ్నిస్తే కేసీఆర్ అసలు తట్టుకోలేడు. పొరపాటున ఎవరైనా విలేకరి ఏదైనా ప్రశ్న సంధిస్తే.. మరలా ప్రతిభవన్ నుంచి ఆహ్వానం అందదు. అందుకే మెజారిటీ జర్నలిస్టులు నోరు మెదపకుండా ఉంటారు. ఒక్క రాహుల్ తప్ప.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
ఎవరో ఎమ్మెల్యేలను కొనడానికొచ్చారు. వ్యవస్థ ఎటుపోతోంది ఆవేదనగా ఉంది అని కేసీఆర్ అంటున్నారు. కానీ వారు బ్రోకర్లు, దొంగలనీ ఆయనే అన్నారు. అలాంటప్పుడు ఓ పార్టీ నాయకుల పేర్లు చెప్పినంతమాత్రాన వెనకున్నది వాళ్లే, ఆ పార్టీనే అని ఎలా నమ్మడం విచారణ ద్వారా తేలాలి కదా! అప్పుడు కదా జనం నమ్ముతారు. వందకోట్లు అన్నారు ఒక్క కోటీ దొరకలే అక్కడ అని పోలీసులే చెప్తున్నారు. ఏసీబీ కోర్టు జడ్జి కూడా పోలీసుల తీరును తప్పు పట్టాడు.నిన్నా మొన్నటివరకు మునుగోడులో చూడలేదా ఎట్లా డబ్బులు పంచింది. జనాన్ని ఎట్లా తాగుబోతులను చేసింది.
దళిత సీఎం సహా ఏ మాట నిలబెట్టుకున్నాడు కనుక?
ఏ ఉద్యమకారుడున్నాడు పక్కన? పైగా ఉద్యమ ద్రోహులను చంకనెక్కించుకుని సుద్దులు చెప్తే ఎలా? ఆయనే పరిశుద్ధుడు కానప్పుడు ఈ మాటల్ని జనం ఎట్లా ఎక్కించుకుంటరు? ఎందుకు ఎక్కించుకుంటారు? బీజేపీ.. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడ్తోంది అది తప్పే. మరి కేసీఆర్ ఒక పార్టీలో గెలిచినవాళ్లను తీసుకోవడం ఒప్పు ఎలా అవుతుంది? టీఆర్ఎస్, కాంగ్రెస్ లాగే బీజేపీ రాజకీయపార్టీనే కదా…మిగతా పార్టీలు రాజకీయం చేస్తే…ఆ పార్టీ కూడా అదే చేస్తుంది. గొంగడి కింద కూర్చొని అన్నం తింటున్నప్పుడు గొర్రె బొచ్చు పడింది అంటే ఎలా? ఇప్పుడు కెసిఆర్ చెప్తున్న నీతులు కూడా అలాంటివే.

ఆ పార్టీ విలువలతో నీతినిజాయతీలతో ఉన్నప్పుడు ఏం చేశాయి ఈ లౌకిక పార్టీలన్నీ ? ఒక్క ఓటుతో వాజపేయి సర్కారును కూల్చలేదా? అవును వాళ్లూ మారారు…ఇప్పుడదీ ఫక్తు రాజకీయపార్టీ…రాజకీయమే చేస్తది కదా! సమకాలీన రాజకీయాల్లో కేసీఆర్ ని మించిన వక్త లేడు. కానీ ఆయన మునుపటిలా లేరు…ఏదో భయం, అభద్రత. బహుశా అధికారం మీద ప్రీతి ఇలానే ఉంటుందేమో?!