కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. చైనాలోని వూహాన్లో సొకిన కరోనా వైరస్ క్రమంగా అన్నిదేశాలకు పాకింది. ప్రస్తుతం ఇండియాలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కరోనా నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణ కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ప్రజలకు ఉపయోగపడే మాస్కులు పెద్దఎత్తున అక్రమ నిల్వలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రంలోనే అక్రమంగా నిల్వచేసిన కోటి రూపాయల విలువైన మాస్కులు తాజాగా బయటపడ్డాయి. లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల నిల్వలను అరికట్టడానికి జరిపిన దాడుల్లో మాస్కుల అక్రమ నిల్వలు వెలుగు చూశాయి. మంగళవారం రాత్రి పక్కా సమాచారంతో గోదాములపై పోలీసులు దాడిచేశారు. గోదాముల్లో నిల్వచేసిన 200బాక్సుల ఫేస్ మాస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.
ఈ మేరకు మాస్కులను అక్రమంగా నిల్వచేసిన గోడౌన్ యజమాని, ఏజెంట్, సరఫరాదారుడితోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్‌లు వంటి ముఖ్యమైన వస్తువులను నిల్వ చేయడం నేరమని పోలీసులు పేర్కొంటున్నారు. సోమవారం కూడా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రూ.15.25కోట్ల విలువచేసే మాస్కులను సీజ్ చేశారు. పోలీసుల దాడుల నేపథ్యంలో గత రెండ్రోజులుగా మాస్కుల అక్రమ నిల్వలు బయటపడుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో పోలీసులు ఇలాంటి దాడులకు పాల్పడితే మొత్తంలో మాస్కులు, శానిటైజర్లు, ఇతర నిత్యావసర సరుకుల నిల్వలు పెద్దఎత్తున బయటపడుతాయని పలువురు అంటున్నారు. ఈ దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.