ఇవాళ రాఖీ పౌర్ణమి. అన్నాచెల్లెల అనురాగానికి ప్రతీక అయిన ఈ ఉత్సవాన్ని తెలుగు లోగిళ్లన్నీ ఆనందంగా జరుపుకున్నాయి. రక్తం పంచుకు పుట్టినవాడికి అన్ని వేళలా రక్షగా ఉండాలనే ఉద్దేశంతో ఆడబిడ్డలు ఈ రాఖీని కడుతుంటారు. అయితే.. కేవలం తోబుట్టువులు మాత్రమే కాకుండా.. సోదరు సమానులైన వారందరికీ రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో మహిళా రాజకీయ నేతలు కూడా పలువురు పొలిటికల్ లీడర్లకు రాఖీలు కట్టారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడికి రాఖీ కట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో సీతక్క టీడీపీలో కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన ములుగు ఎమ్మెల్యే.. టీడీపీ అధ్యక్షుడికి రాఖీకట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు కాళ్లకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాత్రమే కాకుండా.. తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు కూడా చంద్రబాబుకు రాఖీ కట్టారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత కూడా వేర్వేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. వారిపై అక్షింతలు చల్లి చంద్రబాబు ఆశీర్వదించారు. అక్కడే ఉన్న చంద్రబాబు మనవడు దేవాన్ష్ కు సైతం వీరు రాఖీ కట్టారు.
అటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సైతం ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టారు. మల్కాజ్ గిరిలోని రేవంత్ నివాసానికి వెళ్లి సీతక్క రాఖీ కట్టారు. ఈమెతోపాటు పీసీసీ కమిటీ మహిళా నేతలు నేరెళ్ల శారద, సునీతారావు తదితరులు రేవంత్ కు రాఖీ కట్టి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సీతక్క సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సీతక్క చంద్రబాబుకు రాఖీ కట్టిన వీడియో వైరల్ అవుతోంది.
https://twitter.com/seethakkaMLA/status/1429353314135646214?s=20