Mudragada Padmanabham: కాపు రిజర్వేషన్ ఉద్యమ మాజీ నాయకుడు ముద్రగడ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారా? ఎన్నికల సమీపిస్తుండటంతో ఏదో పార్టీలో చేరనున్నారా? జనవరి ఒకటి నుంచి క్రియాశీలకం కానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తన అభిమానులను ముద్రగడ ఆహ్వానించారు. జనవరి 1 కిర్లంపూడి లో ఉన్న తన స్వగృహానికి రావాలని ఆహ్వానాలు పంపించినట్లు తెలుస్తోంది. దీంతో ముద్రగడ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమం నడిపిన ముందు.. ఎన్నెన్నో రాజకీయ పదవులు అనుభవించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అందుకున్నారు. పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. తుని రైలు విధ్వంస ఘటనతో ఉద్యమం మరింత ఎగసి పడింది. అయితే వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది. వైసీపీకి లబ్ధి చేకూరింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కారణాలు చూపుతూ ముద్రగడ ఉద్యమాన్ని నిలిపివేశారు. దీంతో ఆయనపై ముప్పేట విమర్శలు వ్యక్తం అయ్యాయి.
గత నాలుగు సంవత్సరాలుగా ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఎప్పటికప్పుడు వైసీపీ నాయకులు ఆయనతో చర్చలు జరిపారు. పార్టీలోకి ఆహ్వానించారు. కానీ ముద్రగడ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ప్రకటన తర్వాత కాపులు ఆ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటువంటి తరుణంలో కాపుల్లో పట్టు ఉన్న ముద్రగడను తన వైపు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నారు. ముద్రగడకు ఎంపీ సీట్ తో పాటు కుమారుడికి ఎమ్మెల్యే సీటు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీకి ముద్రగడ కుటుంబం సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమీపిస్తుండటంతో కొత్త సంవత్సరం నుంచి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముద్రగడ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా అభిమానులకు ఆహ్వానాలు పంపారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మొత్తానికైతే జనవరి 1న ముద్రగడ సంచలన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.