Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం కు రాజకీయంగా ఏది కలిసి రావడం లేదు. తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలనుకున్న ఆయన కోరిక తీరడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ముద్రగడతో ఒక ఆటాడుకున్నాయి. ఆ కుటుంబానికి రాజకీయ అవసరం లేకుండా చేశాయి.గత కొద్దిరోజులుగా వైసీపీలో ముద్రగడ చేరతారని అంతా భావించారు. గత ఎన్నికలకు ముందు, ఇప్పుడు కూడా ఆయన వైసీపీకి సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో వైసీపీ నుంచి స్పష్టత లేకుండా పోయింది. దీంతో ముద్రగడ వైసీపీలో చేరిక ఆగిపోయింది.
టిడిపి ప్రభుత్వ హయాంలో ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఉద్యమం రైలు విధ్వంసానికి దారి తీయడం,కేసులు నమోదు కావడంతో చంద్రబాబు సర్కార్ పై కాపుల్లో ఒక రకమైన ఆగ్రహం నెలకొంది. అయితే ఆ స్థాయిలో కాపుల్లో ఆగ్రహాన్ని రగిలించి.. వైసీపీ వైపు కాపులు వెళ్లేలా ముద్రగడ ప్లాన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నపలంగా ఉద్యమాన్ని ముద్రగడ పద్మనాభం నిలిపివేశారు. చంద్రబాబు సర్కార్ ఇచ్చిన రిజర్వేషన్లను సైతం జగన్ నిలిపివేశారు.ఆ సమయంలో సైతం ముద్రగడ నోరు తెరవలేదు. పైగా జగన్ కు అనుకూలంగా నిత్యం లేఖలు రాసేవారు. దీంతో ముద్రగడ వైసీపీలో చేరిక ఖాయమని ప్రచారం జరిగింది. అయితే ముద్రగడకు సర్వేలు అనుకూలంగా లేకపోవడం, ప్రజలు పెద్దగా మొగ్గు చూపకపోవడంతో టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ముద్రగడలో తీవ్ర అసహనం ప్రారంభమైంది. వైసీపీ నేతలు అంటేనే చిరాకు పడేలా పరిస్థితి వచ్చింది.
సరిగ్గా ఇటువంటి సమయములోనే జనసేన నేతలు ముద్రగడను కలిశారు. జనసేనలోకి ఆహ్వానించారు. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట అనంతరం పవన్ నేరుగా వచ్చి ఆహ్వానిస్తారని.. ఇంటికి వచ్చి చర్చిస్తారని జనసేన నేతలు సమాచారం ఇచ్చారు. కానీ నెలలు గడుస్తున్న పవన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో చిన్న పోయిన ముద్రగడ నేరుగా పవన్ కు లేఖ రాశారు. నన్ను కలవాలంటే ఇతరుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేసేలా మాట్లాడారు. అయినా పవన్ పట్టించుకోలేదు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైసీపీ నేతలు మరోసారి అప్రోచ్ అయ్యారు. ముద్రగడను కలిశారు. పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ముద్రగడ మెత్తబడినట్లు తెలుస్తోంది.
అయితే వైసీపీకి బే షరతుగా ముద్రగడ మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా ఎమ్మెల్యే సీటు గానీ, ఎంపీ సీటు గాని ఆయనకు దక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు వైసీపీకి సేవ చేసేందుకే ముద్రగడ ఆ పార్టీలోకి వెళ్తున్నట్టు. ఇప్పటికే హరి రామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరారు. ఇప్పుడు ముద్రగడ కుటుంబం చేరనుంది. వీరికి టికెట్లు ఇవ్వకపోయినా.. పవన్ నేతృత్వంలోనే కాపు నేతలపై వీరిని ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. ముద్రగడకు వైసీపీ అధికారంలోకి వస్తే రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కొడుకుకు రాజకీయ జీవితం ఇవ్వాలనుకున్న ముద్రగడ పద్మనాభాన్ని అన్ని పార్టీలు అణచివేశాయి. చివరకు తనంతట తాను వైసీపీలోకి వెళ్లి బేషరతుగా మద్దతు తెలపాల్సిన దౌర్భాగ్యస్థితి ఎదురైంది.