Mudragada Padmanabam: ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీ.. ఆ స్థానం కోసం ఆరాటం

టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపి చంద్రబాబుకు భారీగా డ్యామేజ్ చేశారు. అది వైసీపీకి లాభించింది. అయితే అది ఉద్దేశపూర్వకంగానే చేశారని ముద్రగడపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

Written By: Dharma, Updated On : May 6, 2023 2:14 pm
Follow us on

Mudragada Padmanabam: ముద్రగడ పద్మనాభం.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగా గుర్తించబడ్డారు. ప్రస్తుతం ఉద్యమం నుంచి పక్కకు తప్పుకొని సాధారణ జీవితం గడుపుతున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారన్న టాక్ నడుస్తోంది. గత కొన్నేళ్లుగా ఆయన రాజకీయంగా యాక్టివ్ అవుతారని వార్తలు వచ్చినా జరగలేదు. ఇప్పుడు తుని రైలు విధ్వంసం కేసు నుంచి విముక్తి లభించడంతో ఏదో ఒక పార్టీలో చేరతారని అంతా భావిస్తున్నారు. అయితే ఏ పార్టీని ఎంపిక చేసుకుంటారా? అన్నది మాత్రం ఇప్పుడు తెలుగునాట సస్పెన్ష్.

అనుకూల పార్టీ కోసం..
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఏ పార్టీకి అనుకూలమో తేల్చుకునే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చాన్స్ లేదు. చంద్రబాబుతో ఆయనకు పొసగడం లేదు. అటు జనసేనలో చేరడానికి సైతం సంశయిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కాస్తా వెనుకడుగు వేస్తున్నారు. పైగా కాపు ముద్ర ఉంటున్న నేపథ్యంలో పవన్ సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న వార్తలు వస్తున్నాయి. అటు బీజేపీ సైతం డిఫెన్స్ లో ఉంది. టీడీపీ, జనసేనతో కూటమి కడుతున్న టాక్ నడుస్తోంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ముందున్న ఆప్షన్ వైసీపీ. ఇప్పటికే ఆయన వైసీపీకి అనుకూలంగా ఉన్నారు.కాబట్టి అల్టిమేట్ గా అటు వైపు వెళ్లేందుకే రెడీ అయ్యారని టాక్ నడుస్తోంది.

అప్పుడెప్పుడో…
అయితే ముద్రగడ యాక్టివ్ పాలిటిక్స్ విడిచిపెట్టి దాదాపు పుష్కరకాలం దాటుతోంది. చివరిసారిగా 2009లో పిఠాపురంలో పోటీ చేసి ట్రయాంగిల్ ఫైట్ లో ఓటమి పాలుఅయ్యారు. ఇపుడు కూడా పిఠాపురం సీటు మీదనే ఆయన కన్ను ఉందని అంటున్నారు. అయితే ముద్రగడ ఈ సీటులో తాను కాకుండా తన కుమారుడు గిరిబాబుని పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. వైసీపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలు చూస్తే ముద్రగడకు ఎంపీ సీటు…ఆయన కుమారుడికి ఎమ్మెల్యే సీటు ఇస్తారని ప్రచారం సాగుతోంది. అయితే కాకినాడ సీటు నుంచి ఎంపీగా పోటీచేస్తారని తెలుస్తోంది. 1999లో అదే స్థానానికి టీడీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అయితే వైసీపీ మాత్రం ముద్రగడ కుటుంబానికి ప్రత్తిపాడు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.

వైసీపీలో చేరితే ఆ అపవాదు..
టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపి చంద్రబాబుకు భారీగా డ్యామేజ్ చేశారు. అది వైసీపీకి లాభించింది. అయితే అది ఉద్దేశపూర్వకంగానే చేశారని ముద్రగడపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల అనంతరం.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏకంగా ఉద్యమాన్ని బంద్ చేశారు. జగన్ పై అభిమానం ప్రదర్శించడంతో పాటు చంద్రబాబు విమర్శలు చేస్తూ వస్తున్నారు. అటు సొంత సామాజికవర్గానికి చెందిన పవన్ విషయంల సైతం ఎటువంటి అనుకూలతలు వ్యక్తం చేసిన సందర్భాలు లేవు. అటు కాపు ఉద్యమ నేతగా ఉన్న గౌరవంతోనే వైసీపీ సైతం ముద్రగడ విషయంలో సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న సిట్టింగ్ లకు స్థానచలనం కలిగించి ముద్రగడకు స్పేస్ ఇవ్వాల్సిన అవసరముందా? అన్న టాక్ కూడా వైసీపీలో ఉంది. సో కొద్దినెలల్లో ముద్రగడ రాజకీయ రీ ఎంట్రీ గురించి క్లారిటీ రానుందన్న మాట.