Mudragada Padmanabham Fire on Radhakrishna: కాపు సామాజికవర్గం గురించి పోరాడుతున్న నాయకులు అదే సామాజికవర్గానికి చెందిన వారికి ఆర్థికంగా ప్రొత్సహించిన దాఖలాలు ఉన్నాయా? సంఖ్యాబలంలో ఎక్కువగా ఉన్న కాపుల్లో చెప్పుకోదగ్గ పారిశ్రామిక వేత్తలు ఎందుకు లేరు? కాపు ఉద్యమ నాయకులను ఉద్దేశించి ఇటీవల పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడును ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణ సంధించిన ప్రశ్నలివి. దీనిపై కాపు ఉద్యమ నాయకుడు, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ధీటుగా స్పందించారు. వేమూరి రాధాక్రిష్ణకు లేఖ రాశారు. రాధాక్రిష్ణ ప్రారంభ జీవితం నుంచి ఇప్పటివరకూ ఆయన చేపట్టిన రాచ కార్యాలను గుర్తుచేస్తూ కడిగి పారేశారు. ‘మీ స్థాయికి తగని వ్యక్తి అయిన ముద్రగడ పద్మనాభం’ అంటూ ప్రారంభించిన లేఖ ఆసాంతం రాధాక్రిష్ణ ఎలా ఎదిగింది? ఎలా పైకొచ్చింది? ఆంధ్రజ్యోతి పత్రికలో చిరుద్యోగిగా ఉండి అదే పత్రికకు యజమానిగా ఎలా మారింది? ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఎలా నాశనం చేశారు? సామాజిక సేవా ముసుగులో చేపట్టిన వసూలు పర్వం…ఇలా రాధాక్రిష్ణ చేసిన ప్రతీ పనిని గుర్తుచేస్తూ కాస్త వెటకారంతో రాసిన ఈ లేఖ పెద్ద ప్రకంపనలకే దారితీసింది. సర్వత్రా చర్చనీయాంశమైంది.
‘తాను లక్ష లాది మంది కాపులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యంతో ఉద్యమం చేశాను తప్ప..ఒకరిద్దరు లక్షలాదికారులను చేయడానికి కాదు. కాపు సామాజికవర్గంలో పిల్లల భవిష్యత్ కోసం, వారి ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం పరితపించాను. సామాన్యుడిని లక్షాధికారి, లక్షాధికారిని కోటీశ్వరుడ్ని, కోటీశ్వరుడ్నీ అపర కుభేరుడు చేయడానికి కాదు. అది నా నైజం ఉద్దేశ్యం కాదు. నేను చిత్తశుద్ధిగా ప్రయత్నించి వందకు వేయి శాతం విజయవంతమైనట్టు నమ్ముతున్నాను. నా కాపు సోదరులు నమ్మినా, నమ్మకపోయినా నాకు పర్వాలేదు. పేదవారి కోసం కాకుండా ఒకరిద్దరు ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఉద్యమం చేయడం న్యాయమంటారా? అదే కదా మీ నుంచి వచ్చిన మాట. మీ ఆలోచనలు అమలుచేయలేని అసమర్ధుడిని, నేను అంగీకరిస్తానండీ’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు, వ్యంగ్యోక్తులతో ధీటైన జవాబు ఇచ్చారు. పత్రకాధిపతుల ఔన్నత్యాన్ని గుర్తుచేస్తూ మీలా ఏకవచనంతో మాట్టాడే వారు ఎవరూ ఉండరని గుర్తుచేశారు. మర్యాద అంటూ చూడవలసి వస్తే ఈనాడు అధినేత రామోజీరావు గారు అని చెప్పకోవాలంటూ తన లేఖలో ప్రస్తావించారు.
Also Read: TDP Formation Day: ఇక్కడ ఆవిర్భావ వేడుకలు..పొరుగు రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్ లు
ఈ బోగాభాగ్యాలెక్కడివి?
‘ఆంధ్రజ్యోతి’లో స్టింగర్ గా,, రిపోర్టర్ గా ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మీ భోగా భాగ్యాలేమిటని ప్రశ్నించారు. డొక్కు సైకిల్, డొక్కు స్కూటర్ లో తిరిగే రోజులను గుర్తుచేశారు. అటువంటి మీరు సంస్థ అధినేత కేఎల్ఎన్ ప్రసాద్ గారి కాళ్లను లాగేసి ఆయన కుర్చీలో కూర్చున్న మాదిరిగా ఎవర్నీ స్వల్పకాలంలో కోటీశ్వరుడ్ని చేయలేనని ఎద్దేవా చేశారు. మీలాంటి చరిత్ర ఏ కుల నాయకులకు ఉండదన్నారు. తమ లాంటి వారి చరిత్రను చదవాలి..మీ దారిలో నడిచి యజమానులను కుర్చీలో నుంచి లాగి ఆ కుర్చీలో ఎలా కూర్చోవాలో తమరే నేర్పాలి. సలహాలు ఇచ్చి సమాజానికి ఆదర్శ సందేశం ఇవ్వాలి. నోట్ల మార్పిడి సమయంలో నేళమాలిగలో ఉన్న నల్ల డబ్బును చలామణి చేయించేందుకు బంగారు దుకాణదారులకు బెదిరింపు, రెండు తలలు కలిసిపోయిన కవల పిల్లలను విడదీసేందుకు డబ్బులు వసూలు చేసే పద్ధతిని తమ సందేశం ద్వారా అందరికీ తెలియజేయాలని విన్నవించారు. తెలంగాణా ఎన్నికల సందర్భంగా బెట్టింగ్ లను ప్రోత్సహించడం ద్వారా మీరు ఎంత సంపాదించారో సెలవివ్వండని లేఖలో ముద్రగడ వ్యాఖ్యానించారు.
నాటి సంగతి ఇది
మీ ఆధీనంలో ఉన్న ఆంధ్రజ్యోతితో పాటు లక్ష్మీ ఫిలింస్ కంపెనీ అధినేత అయిన కేఎల్ఎన్ ప్రసాద్ గారు రాజ్యసభకు పోటీచేసినప్పుడు నా తండ్రి ఇండిపెండెంట్ శాసనసభ్యులు. ఆ నాడు తాను మద్దతు తెలపడమే కాకుండా పది మంది ఎమ్మెల్యేలతో ఓటు వేయించి కేఎల్ఎన్ గారి ని గెలిపించిన చరిత్ర మా కుటుంబానిది. అందుకు ప్రతిగా తిరుపతి తీసుకెళ్లి శ్రీవారి దర్శనం చేయిస్తానన్నా నా తండ్రి తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. యజమానిని పాతాళంలోకి తొక్కి ఎదిగిపోయిన మీరెక్కడ? మిమ్మల్ని విమర్శించడానికి నాలాంటి వారికి స్థాయి లేదంటూ ముద్రగడ ఎద్దేవా చేశారు. ఇలా వ్యాఖ్యానించానని నాపై కోపం పెంచుకోవద్దని..ప్రత్యేక పుస్తకం అచ్చు వేయించొద్దని కోరారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పతనానికి మీతో పాటు మరో ఇద్దరు పెద్ద అధికారులు కారణం కాదా? అంటూ ప్రశ్నించారు. చివరిగా ఉద్యమాలు ఇమేజీని పెంచుకోవడానికి ఉద్యమాలు చేస్తుంటారని మీతో పాటు ఇంటర్వూకి ఇచ్చిన వ్యక్తి అభిప్రాయం కావడం దురద్రుష్టకరమని లేఖను ముగించారు.