Mudragada Padmanabham: ముద్రగడ యూటర్న్.. వైసీపీలో చేరడం లేదని ప్రకటన

ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం ఎపిసోడ్ కొలిక్కి రావడం లేదు. టిడిపి ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చారు. పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు.

Written By: Dharma, Updated On : March 13, 2024 3:21 pm

Mudragada Padmanabham not joining YCP

Follow us on

Mudragada Padmanabham: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈరోజు ఉన్న రాజకీయాలు రేపటికి మారిపోతున్నాయి. రేపు వైసీపీలో చేరతానన్న ముద్రగడ పద్మనాభం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఈనెల 14న వైసీపీలో చేరతానని ముద్రగడ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అభిమానులకు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు కూడా. ఈ ప్రయాణంలో తనతో భాగస్వామ్యం కావాలని కోరారు.అయితే ఇంతలో 14వ తేదీ తాను వైసీపీలో చేరడం లేదని.. 15వ తేదీ లేదా 16న చేరతానని ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేయడం విశేషం.

ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం ఎపిసోడ్ కొలిక్కి రావడం లేదు. టిడిపి ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చారు. పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నపలంగా ఉద్యమాన్ని నిలిపివేశారు.గత నాలుగున్నర సంవత్సరాలుగా ముద్రగడ వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ జరగలేదు.అయితే ఎన్నికల ముందు వైసీపీలో చేరడం లాంఛనమేనని టాక్ నడిచింది. అయితే టిక్కెట్ల కేటాయింపులో ముద్రగడ కుటుంబాన్ని వైసిపి హై కమాండ్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. వైసిపి నేతలను కలవడానికి కూడా ముద్రగడ ఇష్టపడలేదని టాక్ నడిచింది. అదే సమయంలో జనసేనలోకి రావాలని ఆ పార్టీ నేతలు ముద్రగడను ఆహ్వానించారు. జనసేన అభ్యర్థనను ఆయన సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పవన్ నుంచి ఆశించిన స్థాయిలో సుముఖత రాకపోవడంతో నొచ్చుకున్న ముద్రగడ వైసీపీలోకి వెళ్తానని తేల్చి చెప్పారు. ఈనెల 14న వైసీపీలోకి వెళ్ళనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. దానికి భద్రతా చర్యలను కారణంగా చెబుతున్నారు.

తాజాగా అభిమానులకు ముద్రగడ ఒక లేఖ రాశారు. రేపు తాడేపల్లి కి వెళ్లేందుకు ఆయన ప్లాన్ చేసుకున్న ర్యాలీని రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. కేవలం తాను ఒక్కడిని మాత్రమే తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని ప్రకటించారు. తాను ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడం మీదట.. వారికి సెక్యూరిటీ ఇబ్బంది ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కువమంది వస్తే కూర్చోడానికి కాదు, నిలబడడానికి కూడా స్థలం సరిపోదని.. వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బంది అని చెప్పడంతోనే ర్యాలీని రద్దు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. తన అభిమానులకు నిరుత్సాహపరిచినందుకు క్షమాపణ కోరారు. మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అయితే సడన్ గా ముద్రగడ యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. దీని వెనుక ఏమైనా జరిగి ఉంటుందా అన్న అనుమానం కలుగుతుంది.