MUDA scam: కర్ణాటక రాజకీయాలలో ముడా స్కాం సంచలనంగా మారింది. మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థలో జరిగిన ఈ కుంభకోణంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు అవకాశం ఉంది. ఈ విచారణకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. దీంతో ఆ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటన చోటు చేసుకోగానే ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరు వెళ్లారు. ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సిద్ద రామయ్య కు ఫోన్ చేశారు. భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.. ముడా కుంభకోణం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పోలీసులు అరెస్టు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మనదేశంలో గవర్నర్ అనుమతితో చాలామంది ముఖ్యమంత్రులు అరెస్టయ్యారు. ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారో ఒకసారి పరిశీలిస్తే..
లాలూ ప్రసాద్ యాదవ్
పశువుల దాణా కుంభకోణానికి పాల్పడ్డాడని 1997లో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో విపక్షాలు ఆయనపై తీవ్రంగా మండిపడ్డాయి. ఫలితంగా ఈ వ్యవహారం పాట్నా హైకోర్టుకు చేరింది. సిబిఐ విచారణ నిర్వహించాలని డిమాండ్ వ్యక్తం అయింది. అప్పటి గవర్నర్ ఏఆర్ కిద్వాయ్ లాలూ ప్రసాద్ యాదవ్ పై కేసు నమోదు చేసేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత సిబిఐ కేసును దర్యాప్తు చేయడం మొదలు పెట్టింది. విచారణ పూర్తికాగానే సిబిఐ లాలూ ప్రసాద్ యాదవ్ ను అరెస్టు చేసింది. ఆ సమయంలో లాలు తన భార్య రబ్రీ దేవిని ముఖ్యమంత్రిని చేశారు.
యడ్యూరప్ప
యడ్యురప్ప 2011లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో లోకాయుక్త కు బాధ్యుడిగా సంతోష్ హెగ్డే ఉన్నారు. అప్పట్లో యడ్యూరప్పపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఆయన భూ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని లోకాయుక్త ఆరోపించింది. అప్పటి కర్ణాటక గవర్నర్ హన్సరాజ్ భరద్వాజ్ ఉన్నారు. యడ్యూరప్పపై విచారణకు అనుమతి ఇచ్చారు. అప్పట్లో గవర్నర్ తీసుకున్న ఆ నిర్ణయం సంచలనగా మారింది. లోకాయుక్త కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో, 2011 అక్టోబర్లో ఆయన అరెస్టు అయ్యారు. ఫలితంగా ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. 23 రోజులపాటు యడ్యూరప్ప జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ కేసును విచారించే బాధ్యతను సిబిఐ తీసుకుంది.
అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. 2022లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మద్యం విధానానికి సంబంధించి దర్యాప్తు చేయాలని సిబిఐని కోరారు. ఆ తర్వాత ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనిషి సిసోడియా ను సిబిఐ విచారించింది. 2022 అక్టోబర్లో ఈడి, సిబిఐ ఆయనను అరెస్టు చేశాయి. సిసోడియాపై విచారణ కొనసాగిస్తూనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ నిందితుడిగా పేర్కొంది. విచారణ అనంతరం 2024 మార్చిలో ఈడీ అరవింద్ కేజ్రివాల్ ను అదుపులోకి తీసుకుంది. అయితే ఆయన తన పదవికి మాత్రం రాజీనామా చేయలేదు.
మధు కోడా
ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన మధు కోడా 2006లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతు ఇవ్వడంతో జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధు మైనింగ్ స్కాం కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. బొగ్గు గనుల కేటాయింపులు 400 కోట్ల అవకతవకలకు పాల్పడినట్టు అప్పట్లో ఆయనపై విమర్శలు వినిపించాయి. ఆ సమయంలో జార్ఖండ్ గవర్నర్ గా సిబ్తే రిజ్వీ మధు కోడా పై దర్యాప్తు చేయాలని సిబిఐకి లేఖ రాశారు. సిబిఐ విచారణలో మనీ లాండరింగ్ కు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి. 2009లో ఈ కేసు కు సంబంధించి సిబిఐ, ఈడీ సంయుక్తంగా విచారణ చేశాయి. ఆ తర్వాత ఆయనను అరెస్టు చేశాయి. 2012 వరకు ఆయన జైల్లో ఉన్నారు. 2017లో ఆయనకు ఈ కేసులో శిక్ష పడింది..మధు కోడా భార్య ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
సిద్ధరామయ్య పరిస్థితి ఏంటి
ముడా స్కామ్ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అక్కడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. సిద్ధరామయ్య పై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆయనను జైలుకు పంపి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. ఇక సిద్ధరామయ్య ప్రస్తుతం న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. కర్ణాటక ప్రభుత్వం గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Muda scam these are the cms who got caught in scams and went to jail
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com