https://oktelugu.com/

ఆ ఎంపిక ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి?

తెలంగాణలో పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొత్త సారధి ఎంపిక ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. ఈ అంశం ప్రతిసారీ చర్చకు రావడం.. ఆ తర్వాత ఉన్నపళంగా ప్రక్రియ ఆగిపోవడం పరిపాటిగా మారింది. ఏఐసీసీ ఎప్పుడు తుది నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ అంతుపట్టడం లేదని కాంగ్రెస్‌ నేతలు వాపోతున్నారు. పీసీసీ పదవి ఆశించేవాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నా.. ఇద్దరు ఎంపీల మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 21, 2020 / 09:22 PM IST
    Follow us on

    తెలంగాణలో పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొత్త సారధి ఎంపిక ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. ఈ అంశం ప్రతిసారీ చర్చకు రావడం.. ఆ తర్వాత ఉన్నపళంగా ప్రక్రియ ఆగిపోవడం పరిపాటిగా మారింది. ఏఐసీసీ ఎప్పుడు తుది నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ అంతుపట్టడం లేదని కాంగ్రెస్‌ నేతలు వాపోతున్నారు. పీసీసీ పదవి ఆశించేవాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నా.. ఇద్దరు ఎంపీల మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఇటీవల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి రావడం ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. కాంగ్రెస్‌ పగ్గాలు ఆయనకే దక్కే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

    అలాగే,  మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సైతం పీఠం దక్కించుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఆయన ఇటీవల కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్‌ కే పీసీసీ పదవి దక్కే అవకాశం ఉందని అదిష్ఠానం నుంచి సంకేతాలు వచ్చాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అనుచరుల ద్వారా రేవంత్‌ లాబీయింగ్‌ చేస్తున్నారని సీనియర్లు భావిస్తున్నారు. అందుకే రేవంత్‌ కరోనా విపత్కర సమయంలో కూడా బెంగళూరు వెళ్లి  శివకుమార్‌ను కలిసి వచ్చారని అంటున్నారు.

    రేవంత్‌ ను అడ్డుకొనేందుకు ప్రయత్నాలు!
    పీసీసీ పీఠం ఆశిస్తున్న ఇద్దరు ఎంపీలూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. రేవంత్‌ ఎంపికను అడ్డుకొనేందుకు కొందరు సీనియర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వొద్దని విధేయుల ఫోరం తరఫున కొందరు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. దిల్లీ పెద్దలతో ఉన్న పరిచయాలు ఉపయోగించుకుంటున్నారనే ప్రచారం  జరుగుతోంది. తొలి నుంచి పార్టీ జెండా మోసినవారికే పీసీసీ పీఠం ఇవ్వాలని రెండుసార్లు అధిష్ఠానానికి లేఖ రాసిన విధేయుల ఫోరం మరోసారి లేఖ రాసేందుకు సమాయత్తమవుతోందని తెలుస్తోంది.

    తెరపైకి సామాజికవర్గం అంశం
    మరోవైపు, విధేయుల ఫోరం చేస్తున్న వాదనలను రేవంత్‌ రెడ్డి కొట్టిపారేస్తున్నారు. తాను పార్టీలోకి కొత్తగా ఏమీ రాలేదనీ.. ఇప్పటికే ఎంపీగా ఉన్నానని, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు చెబుతున్నారు. అందువల్ల తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించవద్దంటూ అభ్యంతరం చెప్పడంలో అర్థంలేదని రేవంత్‌ అంటున్నారు. అధిష్ఠానం అప్పగించే బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమని ఇటీవల ఇష్టాగోష్ఠిలో ఆయన స్పష్టంచేశారు.