MP Raghurama Krishnamraju : రఘురామకృష్ణం రాజు.. పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ తరఫున గత ఎన్నికల్లో 22 మంది ఎంపీలు గెలుపొందారు. కానీ ఎవరికీ లేని ప్రాచుర్యం రఘురామకృష్ణం రాజు సొంతం. ఇప్పటికీ చాలామంది ఎంపీల పేర్లు ఎవరికి తెలియదు. కానీ రఘురామకృష్ణం రాజు అంటేనే చటుక్కున గుర్తుపెట్టుకునే పేరును సంపాదించుకున్నారు ఆయన. గెలుపొందిన ఆరునెలలకి పార్టీకి దూరమయ్యారు. పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చారు. కానీ సొంత నియోజకవర్గం నరసాపురానికి మాత్రం టచ్ చేయలేకపోయారు. అటువంటిది నాలుగేళ్ల తర్వాత.. ఎన్నికల ముంగిట ఆయన సొంత నియోజకవర్గానికి వచ్చి హల్చల్ చేయడం విశేషం.
వైసీపీతో విభేదించిన తర్వాత ఆయన దాదాపు ఢిల్లీకే పరిమితమయ్యారు. సొంత నియోజకవర్గానికి రావాలని ఉన్నప్పటికీ.. ప్రభుత్వం కేసులతో ఉక్కుపాదం మోపడంతో నియోజకవర్గంలో అడుగుపెట్టలేకపోయారు. కానీ ఆయన కుమారుడు తరచూ నియోజకవర్గానికి వచ్చి పనులు చక్కబెట్టేవారు. తన ఎంపీ ల్యాండ్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టాలని రఘురామకృష్ణంరాజు డిసైడ్ అయ్యారు. ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. ఏపీ పోలీసులకు ఆదేశాలు వచ్చేలా చేసుకున్నారు. దీంతో రఘురామరాజు సేఫ్ గా నరసాపురంలో అడుగు పెట్టే వీలుగా ఏపీ పోలీసులే ప్రత్యేక చర్యలు చేపట్టడం విశేషం.
సుదీర్ఘ విరామం తర్వాత నియోజకవర్గంలో అడుగుపెట్టిన రఘురామకృష్ణం రాజుకు ఘనస్వాగతం లభించింది. టిడిపి, జనసేన శ్రేణులతో పాటు రఘురామకృష్ణంరాజు అభిమానులు భారీగా తరలివచ్చారు. రావులపాలెం సెంటర్లో కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బండారు సత్యానందరావు పార్టీ శ్రేణులతో స్వాగతం పలికారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తాడేపల్లిగూడెం టిడిపి ఇన్చార్జ్ వలవల బాబ్జి, జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్ సైతం రఘురామకృష్ణం రాజుకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.రాజమండ్రి విమానాశ్రయం నుంచి రావులపాలెం మీదుగా నరసాపురం వరకు భారీ ర్యాలీతో రఘురామకృష్ణం రాజు సొంత ప్రాంతానికి చేరుకున్నారు.
సంక్రాంతి పురస్కరించుకొని ఈ నాలుగు రోజులపాటు నియోజకవర్గంలోనే ఉండాలని రఘురామకృష్ణం రాజు ప్రణాళిక వేసుకున్నారు. సంప్రదాయ క్రీడలు, ఇతర కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా ఆయన పర్యవేక్షించనున్నట్లు తెలిసింది. 2019 ఎన్నికల తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే తన నియోజకవర్గానికి రఘురామకృష్ణరాజు వచ్చారు. ఇప్పుడు మూడోసారి, చాలా విరామం తర్వాత రావడంతో స్థానికులు ఘన స్వాగతం పలికారు.